Published : 03 Jul 2022 02:56 IST

కలిసి పనిచేద్దాం.. ఖర్చు తగ్గిద్దాం

కో-వర్కింగ్‌ కార్యాలయాలకు గిరాకీ

2021-22లో రెండింతల వృద్ధి

జేఎల్‌ఎల్‌ ఇండియా, క్యూడెస్క్‌ నివేదిక

దిల్లీ

న దేశంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించి నిలదొక్కుకోవడం అంత సులభం కాదనే చెప్పొచ్చు. ఏటా లక్షల సంఖ్యలో అంకురాలు పుడుతున్నా అందులో కొన్ని మాత్రమే ముందుకెళ్తుంటాయి. ముఖ్యంగా బహుళజాతి సంస్థలు(ఎమ్‌ఎన్‌సీలు) భారీ స్థాయి పెట్టుబడులతో ప్రాంగణాలు ఏర్పాటు చేస్తూ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుంటాయి. కానీ కొత్తగా పుట్టుకొచ్చే అంకుర సంస్థలకు భారీ పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఉండదు. తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉండే ఇటువంటి సంస్థల కోసం పుట్టిందే కో-వర్కింగ్‌ సంస్కృతి.

ఒకే కార్యాలయంలో వేర్వేరు సంస్థల ఉద్యోగులు పనిచేయడమే కో-వర్కింగ్‌ అంటే. దీని వల్ల చిన్న సంస్థలకు ఖర్చులు తగ్గడంతో లబ్ధి పొందుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కో-వర్కింగ్‌ కార్యాలయాలకు గిరాకీ రెండింతలు పెరిగిందని జేఎల్‌ఎల్‌ ఇండియా, క్యూడెస్క్‌ సంయుక్త నివేదిక వెల్లడించింది. ఏడు ప్రధాన నగరాల్లో 90,200 డెస్క్‌లు ఏర్పాటైనట్లు తెలిపింది. 2020-21లో ఏడు నగరాల్లో 37,300 పైగా కో-వర్కింగ్‌ కార్యాలయ స్థలాలను లీజుకు తీసుకున్నారు. ముఖ్యంగా కొవిడ్‌-19 రెండో దశ ఉద్ధృతి అనంతరం ఇటువంటి కార్యాలయాలకు గిరాకీ జోరందుకున్నట్లు వివరించింది. నివేదికలోని పలు అంశాలు ఇలా..

* నగరాల వారీగా చూస్తే.. హైదరాబాద్‌లో ఫ్లెక్సిబుల్‌ సీట్ల గిరాకీ 8,284గా నమోదైంది. బెంగళూరులో అత్యధిక గిరాకీ(25,130) కనిపించగా.. ఆ తర్వాత పుణె (15,659), దిల్లీ-ఎన్‌సీఆర్‌ (14,900), ముంబయి (12,500), చెన్నై (11,312), కోల్‌కతా (2,432)లలోనూ ఈ ధోరణి కనిపించింది.

* కార్పొరేట్లకు సౌకర్యంగా ఉండటం, తక్కువ లీజు కాలవ్యవధి, పూర్తి స్థాయి సేవలు, ఖరీదైన కార్యాలయ సదుపాయాలు వంటి వాటిని కో-వర్కింగ్‌ గిరాకీ పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు.

* 2021-22లో మొత్తం లీజుకు తీసుకున్న ఫ్లెక్సిబుల్‌ సీట్లలో కార్యాలయాల వాటా 62 శాతం ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 52 శాతంగా ఉంది.

* నెలకు ఒక్కో ఉద్యోగికి సగటు ధర రూ.6,300- 14,300 శ్రేణిలో ఉంది. ప్రధాన వ్యాపార సముదాయాలు, కీలక ప్రాంతాల్లో ఇవి మరింత అధికంగా ఉంటున్నాయి. ముంబయిలో నెలకు ఒక్కో సీటుకు రూ.50,000, దిల్లీలో రూ.25,000-45,000 వరకు వసూలు చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఈ ధర రూ.4,000- 6,800 మధ్య ఉంటోంది.

* ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో దాదాపు 3,000 కో-వర్కింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు అంచనా. అగ్రగామి ఏడు నగరాల్లో 2,300కు పైగా ఫ్లెక్స్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇటువంటి కేంద్రాల పరంగా బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో ముంబయి, దిల్లీ, పుణెలు నిలిచాయి.

* ద్వితీయ శ్రేణి నగరాలైన విశాఖపట్నం, కాన్పూర్‌, గోవా, రాయ్‌పూర్‌, భోపాల్‌, కోచి, చండీగఢ్‌, పట్నా, లఖ్‌నవూ, జయపూర్‌, ఇండోర్‌, అహ్మదాబాద్‌లో దాదాపు 650 కో-వర్కింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని