Updated : 04 Jul 2022 05:48 IST

ఖజానాకు నష్టం రూ.12,000 కోట్లే!

పెట్రోపై ఎక్సైజ్‌ సుంకం కోతతో రూ.84,000 కోట్ల  ఆదాయం తగ్గే అవకాశం

ఇంధనంపై ఎగుమతి సుంకం, ముడిచమురుపై విండ్‌ఫాల్‌ పన్నుతో రూ.72,000 కోట్ల ఆదాయం

దిల్లీ: ద్రవ్యోల్బణ నియంత్రణ కోసం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకంలో కోత విధించడం వల్ల  ప్రభుత్వం భారీగానే ఆదాయాన్ని కోల్పోతుందని అంచనా. అయితే జులై 1 నుంచి దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విండ్‌ఫాల్‌ పన్నుగా టన్నుకు   రూ.23,250, విదేశాలకు ఎగుమతి చేస్తున్న పెట్రోల్‌-విమాన ఇంధనం (ఏటీఎఫ్‌)పై లీటరుకు 6, డీజిల్‌పై లీటరుకు రూ.13 చొప్పున విధించనున్న ఎగుమతి సుంకంతో లభించే ఆదాయంతో, ఖజానాకు నష్టాన్ని నాలుగింట మూడొంతులు తీర్చొచ్చని అంచనా వేస్తున్నారు.

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు పెట్రోల్‌, డీజిల్‌పై ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ మే 23న నిర్ణయం తీసుకుంది. ఇందువల్ల ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల మేర ఆదాయం ప్రభుత్వానికి తగ్గుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 నెలలు పూర్తయిందున, 10 నెలలు మాత్రమే ఇంకా మిగలడంతో, ఈ కాలంలో సుమారు రూ.84,000 కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా. ఇంధనంపై ఎగుమతి పన్ను, ముడిచమురుపై విండ్‌ఫాల్‌ పన్ను జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 నెలల కాలానికి ఇది అమలై, ఖజానాకు అదనపు రాబడి వస్తుంది.

కంపెనీలు ఏం చేయబోతున్నాయ్‌

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యా నుంచి అభివృద్ధి చెందిన దేశాలన్నీ ముడిచమురు కొనుగోళ్లు నిలిపివేశాయి. ఫలితంగా భారీ రాయితీపై రష్యా విక్రయిస్తున్న ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌)తో పాటు రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌ అనుబంధ నయారా ఎనర్జీ ఇక్కడి తమ రిఫైనరీల్లో శుద్ధి చేసి, ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తూ, భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. దేశీయంగా రిటైల్‌ విక్రయాల వల్ల నష్టాలు వస్తున్నాయనే భావనతో, విదేశాలకు ఎగుమతులపైనే ఈ సంస్థలు దృష్టి సారిస్తున్నాయనే నిర్ధారణకు కేంద్రం వచ్చింది. అందుకే విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌ పరిమాణంలో 50 శాతం, డీజిల్‌లో 30 శాతం దేశీయంగా తప్పనిసరిగా విక్రయించాలనే నిబంధనను కేంద్రం పెట్టింది. 2023 మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. అయితే ఎగుమతుల కోసమే పెట్టిన యూనిట్లు/ప్రత్యేక ఆర్థిక మండళ్లకు మాత్రం ఈ పరిమాణ నిబంధనలు ఉండవు.

* ఎగుమతుల కోసమే ఉద్దేశించిన ఆర్‌ఐఎల్‌ జామ్‌నగర్‌ రిఫైనరీ, ఏడాదికి 35.2 మిలియన్‌ టన్నుల ముడిచమురును శుద్ధి చేసి, పెట్రోల్‌, డీజిల్‌ను విదేశీ ఖాతాదార్లకు సరఫరా చేస్తోంది.. కొత్తగా పన్ను విధించినా ఎగుమతుల్ని కొనసాగించేందుకు రిలయన్స్‌ సిద్ధంగా ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

* నయారా ఎనర్జీ కూడా 20 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో వాదినర్‌ రిఫైనరీని నిర్వహిస్తోంది.

* దేశంలో మొత్తం 83,423 పెట్రోల్‌ బంకులు ఉండగా, ఇందులో రిలయన్స్‌-భాగస్వామి బీపీ కలిసి 1459 బంకులే నిర్వహిస్తున్నాయి. నయారా 6619 బంకులు నిర్వహిస్తుండటం గమనార్హం.


ఇదీ లెక్క

* ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా, వేదాంతా సంస్థలు 2021-22లో 29.7 మిలియన్‌ టన్నుల ముడి చమురును ఉత్పత్తి చేశాయి. విండ్‌ఫాల్‌ పన్ను ప్రకారం, ప్రభుత్వానికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.69,000 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 9 నెలలే మిగిలి ఉన్నందున, రూ.52,000 కోట్లు ఖజానాకు సమకూరనున్నాయి.

* మన దేశం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌, మే నెలల్లో 2.5 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌, 5.7 మి.టన్నుల డీజిల్‌, 7.97 లక్షల టన్నుల ఏటీఎఫ్‌ ఎగుమతి అయ్యాయి. పన్ను భారం వల్ల, ఈ పరిమాణంలో ఎగుమతులు మూడో వంతుకు పడిపోయినా సరే, 2023 మార్చి ఆఖరుకు ప్రభుత్వానికి కనీసం రూ.20,000 కోట్లు అదనంగా ఈ రూపేణ లభించే అవకాశం ఉంది.

* ఈ రెండు పన్నుల రూపేణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలానికి రూ.72,000 కోట్ల అదనపు ఆదాయం లభించనుంది. కోల్పోనున్న రూ.84,000 కోట్ల నుంచి ఈ అదనపు రాబడిని మినహాయిస్తే ప్రభుత్వానికి ఏర్పడే నష్టం రూ.12,000 కోట్లు మాత్రమేనని ఒక అధికారి తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని