సానుకూల సెంటిమెంటు కొనసాగొచ్చు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఓఎన్‌జీసీ వంటి కొన్ని పెద్ద షేర్లలో భారీ అమ్మకాలు కనిపించినా.. ఇతర స్క్రిప్‌లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో, సూచీలు స్థిరంగా కొనసాగడం చూస్తే సెంటిమెంటు మెరుగుపడినట్లే ఉందని విశ్లేషకులు అంటున్నారు. నిఫ్టీ కీలక మద్దతు స్థాయి అయిన 15,500 పైన ఉన్నంత కాలం, సానుకూలంగానే

Published : 04 Jul 2022 04:36 IST

ఔషధ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లకు సానుకూలతలు

నిఫ్టీకి 15,500 స్థాయి కీలకం

విశ్లేషకుల అంచనాలు

స్టాక్‌ మార్కెట్‌

ఈ వారం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఓఎన్‌జీసీ వంటి కొన్ని పెద్ద షేర్లలో భారీ అమ్మకాలు కనిపించినా.. ఇతర స్క్రిప్‌లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో, సూచీలు స్థిరంగా కొనసాగడం చూస్తే సెంటిమెంటు మెరుగుపడినట్లే ఉందని విశ్లేషకులు అంటున్నారు. నిఫ్టీ కీలక మద్దతు స్థాయి అయిన 15,500 పైన ఉన్నంత కాలం, సానుకూలంగానే భావించొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. నిరోధ స్థాయి 15,900ని అధిగమిస్తే 16,000-16,180 వరకు నిఫ్టీ వెళ్లొచ్చని భావిస్తున్నారు. శుక్రవారం వెలువడే టీసీఎస్‌ ఫలితాలపై అందరి కళ్లూ ఉంటాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, చైనాలో కొవిడ్‌-19 పరిస్థితి ప్రభావం చూపుతాయి. పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై పన్ను విధించిన నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ షేరు రూ.2,330 వరకు తగ్గొచ్చు. ఓఎన్‌జీసీ  రూ.123ను పరీక్షించొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే.

* టెలికాం కంపెనీల షేర్లు మార్కెట్‌ నుంచే సంకేతాలు అందుకోవచ్చు. 5జీ స్పెక్ట్రమ్‌ను నేరుగా టెక్‌ కంపెనీలకు కేటాయించే విషయంలో మార్గదర్శకాల కోసం మార్కెట్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందువల్ల టెల్కోలకు ఆదాయంలో 40% వరకు నష్టం వస్తుందన్నది ప్రైవేటు సెల్యులార్‌ ఆపరేటర్ల సంఘం అంటోంది.

* సిమెంటు కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణిలో కదలాడొచ్చు. సిమెంటుకు గిరాకీ మోస్తరుగా ఉండొచ్చన్న అంచనాలే ఇందుకు కారణం.

* యంత్ర పరికరాల షేర్లు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ముడి పదార్థాల ధరలు పెరుగుతుండడం ఈ రంగాన్ని ఇబ్బంది పెడుతోంది.

* వారం మధ్య వరకు అమెరికా మార్కెట్లు; తరవాత టీసీఎస్‌ ఫలితాల ఆధారంగా ఐటీ షేర్లు చలించొచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్నందున, ఐటీ సేవలకు గిరాకీ తగ్గొచ్చన్న భయాలున్నాయి.

* విక్రయ గణాంకాలు వాహన షేర్లపై ప్రభావం చూపొచ్చు. గ్రామీణ భారత్‌పై రుతు పవనాలు సానుకూల ప్రభావం చూపితే ద్విచక్ర వాహన కంపెనీలు రాణించొచ్చు. ఫాడా వెలువరిచే వాహన రిటైల్‌ అమ్మకాలపై ఓ కన్నేయొచ్చు.

* అంతర్జాతీయ ప్రాథమిక లోహ ధరల ఆధారంగా లోహ కంపెనీల షేర్లు ట్రేడవవచ్చు. డాలరు  చలనాలు, ఇతర అంశాలు కమొడిటీ ధరలపై ప్రభావం చూపొచ్చు.

* మార్కెట్‌తో పోలిస్తే ఔషధ షేర్లు రాణించొచ్చు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెరుగుతూ.. వృద్ధి తగ్గుతున్న వేళ రక్షణాత్మకమైన ఈ రంగంపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు.

* ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా వంటి అప్‌స్ట్రీమ్‌ కంపెనీల షేర్లలో; చమురు రిఫైనింగ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరులో కొద్ది రోజుల పాటు బలహీనతలు కొనసాగొచ్చు. ముడిచమురు ఉత్పత్తి, ఇంధన ఎగుమతులపై పన్ను విధించాలనే నిర్ణయం ఇందుకు నేపథ్యం.

* ఎంపిక చేసిన బ్యాంకు షేర్లలో కదలికలుంటాయి. బ్యాంకుల రుణ వృద్ధి, స్థిరమైన ఆస్తుల నాణ్యతపై దృష్టి సారించొచ్చు. నిఫ్టీ బ్యాంక్‌కు 34100 వద్ద నిరోధం; 33000 వద్ద మద్దతు కనిపించొచ్చు.

* సాధారణ వర్షపాతంతో గ్రామీణ గిరాకీ రాణిస్తుందన్న అంచనాలతో ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించొచ్చు. ఐటీసీ, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా షేర్లు లాభాల్లో పయనించొచ్చు. డాబర్‌, కోల్గేట్‌, మారికో షేర్లలో అంత సందడి కనిపించకపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని