Updated : 04 Jul 2022 05:16 IST

సంక్షిప్త వార్తలు

పారాసెట్మాల్‌ రిటైల్‌ ధర రూ.2.88

దిల్లీ: మధుమేహం, తలనొప్పి, అధిక రక్తపోటు సహా పలు వ్యాధుల చికిత్సలో వినియోగించే 84 ఔషధ ఫార్ములేషన్‌లకు నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) రిటైల్‌ ధరలు నిర్ణయించింది. ఓగ్లిబోస్‌, (ఎస్‌ఆర్‌) మెట్‌ఫార్మిన్‌ హైడ్రోక్లోరైడ్‌ ఒక్క మాత్ర ధర రూ.10.47 (జీఎస్‌టీ మినహాయించి)గా ఉంది. పారాసెట్మాల్‌, కాఫీన్‌ మాత్ర ధర రూ.2.88; అధిక కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ స్థాయులను తగ్గించేందుకు వినియోగించే రోసువాస్టాటిన్‌ ఆస్ప్రిన్‌, క్లోపిడోగ్రెల్‌ క్యాప్సూల్‌ ధర రూ.13.91గా నిర్ణయించింది. లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ ఇన్‌హెలేషన్‌ (మెడికల్‌ గ్యాస్‌) సవరించిన సీలింగ్‌ ధరను ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు పొడిగించింది.


ఇంధన విక్రయాలు జూన్‌లో పెరిగాయ్‌

దిల్లీ: దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ ఏడాది జూన్‌లో బాగా పెరిగాయి. వ్యవసాయ పనులు మొదలవడం, వేసవి పర్యటనలు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వ్యవసాయ పనులతో డీజిల్‌కు గిరాకీ రెండంకెల స్థాయిలో పెరిగింది. గత నెలలో 7.38 మిలియన్‌ టన్నుల మేర డీజిల్‌ విక్రయాలు జరిగాయి. 2021 జూన్‌ విక్రయాలతో పోలిస్తే, ఇది 35.2 శాతం ఎక్కువ. కొవిడ్‌కు ముందు (2019 జూన్‌)తో పోల్చినా 10.5 శాతం వృద్ధి నమోదైంది.

* ఈ ఏడాది జూన్‌లో పెట్రోల్‌ విక్రయాలు 2.8 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. 2021 జూన్‌తో పోలిస్తే ఇవి 29 శాతం అధికం. 2020 జూన్‌తో పోలిస్తే 36.7 శాతం, 2019 జూన్‌తో పోలిస్తే 16.5 శాతం అధిక అమ్మకాలు జరిగాయి.

* వంట గ్యాస్‌ విక్రయాలు 0.23 శాతం పెరిగి 2.26 మిలియన్‌ టన్నులకు చేరాయి.

* విమాన ఇంధన (ఏటీఎఫ్‌) విక్రయాలు రెట్టింపునకు పైగా పెరిగి 5,35,900 టన్నులకు చేరాయి. 2020 జూన్‌తో పోలిస్తే 150.1 శాతం పెరిగినా, 2019 జూన్‌తో పోలిస్తే  మాత్రం 12.9 శాతం తక్కువగానే ఉన్నాయి.


చిప్‌ వ్యాపారం రూ.27,000 కోట్లకు!

2026-27 కల్లా సాధ్యం: వేదాంతా గ్రూప్‌  

దిల్లీ: సెమీకండక్టర్‌ వ్యాపార టర్నోవర్‌ 2026-27 కల్లా 3- 3.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.23,500- 27,000 కోట్లు)కు చేరొచ్చని వేదాంతా గ్రూప్‌ అంచనా వేస్తోంది. ఇందులో దాదాపు 100 కోట్ల డాలర్ల ఆదాయం ఎగుమతుల ద్వారా లభించొచ్చని వేదాంతా గ్రూప్‌ గ్లోబల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (డిస్‌ప్లే, సెమీకండక్టర్‌ వ్యాపారం) ఆకర్ష్‌ హెబ్బార్‌ తెలిపారు. ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ ప్లాంటును దేశీయంగా ప్రారంభించడానికి అవసరమైన అన్ని ఒప్పందాలు, సాంకేతికతలు తమ భాగస్వామి ఫాక్స్‌కాన్‌ వద్ద ఉన్నాయని వెల్లడించారు. దేశంలో సెమీకండక్టర్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు దరఖాస్తు చేసుకున్న మూడు కంపెనీల్లో వేదాంతా ఫాక్స్‌కాన్‌ సంయుక్త సంస్థ కూడా ఉంది. ఎలక్ట్రానిక్‌ పరికరాల  కోసం తెరలను తయారు చేయడానికి డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకూ వేదాంతా దరఖాస్తు చేసుకుంది. సెమీకండక్టర్‌ వ్యాపారం కోసం 20 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.56 లక్షల కోట్లు) పెట్టుబడులను వేదాంతా గ్రూప్‌ ప్రకటించింది. ఇందులో 15 బి.డాలర్ల పెట్టుబడులను మొదటి పదేళ్లలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
2030 నాటికి దేశీయంగా 100 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు, 1.5 కోట్ల టీవీలు, 2.4 కోట్ల నోట్‌బుక్‌లు ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుందని, స్థానిక అవసరాలకు ఇవి సరిపోతాయని హెబ్బర్‌ అన్నారు. స్థానిక వినియోగమే తమ లక్ష్యమని, డిస్‌ప్లేలో 10 శాతం, సెమీకండక్టర్‌ల్లో 20-25 శాతామే ఎగుమతి చేస్తామని తెలిపారు. 2024-25కు డిస్‌ప్లే తయారీ యూనిట్లు, 2025-26కు సెమీకండక్టర్ల ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది.

* 2015-16లో కూడా 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో వేదాంతా గ్రూప్‌ డిస్‌ప్లే ఫ్యాబ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని భావించినా, ప్రభుత్వ అనుమతి లభించలేదు. అనంతరం తైవాన్‌ కంపెనీ అవన్‌స్ట్రేట్‌ కొనుగోలుతో డిస్‌ప్లే ఫ్యాబ్‌ తయారీలోకి అడుగుపెట్టింది.


హిందుస్థాన్‌ మోటార్స్‌ నుంచి విద్యుత్‌ ద్విచక్రవాహనాలు!

కోల్‌కతా: గతంలో అంబాసిడర్‌ కార్లను తయారు చేసిన హిందుస్థాన్‌ మోటార్స్‌ (హెచ్‌ఎం), ఐరోపా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుని దేశీయంగా విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయాలని భావిస్తోందని కంపెనీ డైరెక్టర్‌ ఉత్తమ్‌ బోస్‌ వెల్లడించారు. వచ్చే ఏడాది కల్లా విద్యుత్తు ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించి, ఆ తర్వాత విద్యుత్‌ కార్ల తయారీ చేపట్టాలనేది కంపెనీ ప్రణాళికగా పేర్కొన్నారు. ఇరు కంపెనీల మధ్య జులైలో ఆర్థికపరమైన చర్చలు ప్రారంభమవుతాయి. ఇందుకు 2 నెలలు, ఆ తర్వాత సాంకేతిక అంశాలపై చర్చకు మరో నెల సమయం పడుతుందని బోస్‌ తెలిపారు. ఆ తర్వాతే పెట్టుబడుల అంచనాతో పాటు కొత్త కంపెనీ ఆవిర్భావం జరుగుతుందని వివరించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2023 ఫిబ్రవరి 15 నాటికి కొత్త కంపెనీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఆ తర్వాత 2 త్రైమాసికాలకు ప్రయోగాత్మక ప్రాజెక్టు మొదలవుతుందన్నారు. అంతిమ ఉత్పత్తులు వచ్చే ఆర్థిక సంవత్సరం చివర్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. ద్విచక్ర వాహనాల ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన రెండేళ్ల తర్వాత, విద్యుత్‌ కార్ల తయారీపై నిర్ణయం వెల్లడిస్తామన్నారు. కొత్త ప్రాజెక్టు కోసం కొత్తగా నియామకాలు చేపడతామని, వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమయ్యే నాటికి సుమారు 400 మందిని తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం సంస్థలో 300 మంది పని చేస్తున్నారు.


హైబ్రిడ్‌ మోడళ్లపై మారుతీ దృష్టి

దిల్లీ: పర్యావరణ అనుకూల సాంకేతికతలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని, వచ్చే 5-7 ఏళ్లలో తమ మోడళ్లు అన్నింటిలో బలమైన హైబ్రిడ్‌ సాంకేతికత కలిగి ఉండాలని భావిస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ముఖ్య సాంకేతిక అధికారి సీవీ రామన్‌ వెల్లడించారు. ప్రతి మోడల్‌లో పర్యావరణహిత అంశాలు ఉండటానికి చొరవ చూపిస్తున్నామని, ఇందుకోసం బలమైన హైబ్రిడ్‌ సాంకేతికతల్ని వినియోగిస్తున్నామని తెలిపారు. దీంతో ఇంధన సామర్థ్యం మెరుగవ్వడంతో పాటు కర్బన ఉద్గారాలు బాగా తగ్గుతాయని వివరించారు. బ్యాటరీ విద్యుత్‌ వాహనాలు, సీఎన్‌జీ కార్లు, ఇథనాల్‌, బయో-సీఎన్‌జీ ఇంజిన్లపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే 5-7 ఏళ్లలో ప్రతి మోడల్‌లో ఒక హరిత సాంకేతిక అంశం ఉండేలా చూసుకుంటామని, పూర్తిగా పెట్రోల్‌ మాత్రమే వినియోంచే ఇంజిన్లు ఉండవని సీవీ రామన్‌ వెల్లడించారు. విద్యుత్‌ వాహన విభాగంలో  సమస్యల్ని పరిశీలించి వచ్చే 3-5 ఏళ్లలో వినియోగదార్లకు ఉత్తమ పరిష్కారాలను అందిస్తామన్నారు. 2025లో దేశీయంగా తొలి విద్యుత్‌ కారును విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని