కార్యాలయ స్థలాల లీజింగ్‌.. హైదరాబాద్‌లో 3 రెట్లు

కార్పొరేట్ల నుంచి గిరాకీ పెరగడంతో హైదరాబాద్‌ సహా, దేశ వ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాల లీజింగ్‌ పెరిగింది. ఏప్రిల్‌- జూన్‌లో హైదరాబాద్‌, దిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై, పుణె నగరాల్లో కలిపి మొత్తం 1.40 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని వివిధ సంస్థలు లీజుకు

Published : 05 Jul 2022 02:29 IST

జనవరి-జూన్‌లో అద్దెకు 45 లక్షల చదరపు అడుగులు

దిల్లీ: కార్పొరేట్ల నుంచి గిరాకీ పెరగడంతో హైదరాబాద్‌ సహా, దేశ వ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాల లీజింగ్‌ పెరిగింది. ఏప్రిల్‌- జూన్‌లో హైదరాబాద్‌, దిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై, పుణె నగరాల్లో కలిపి మొత్తం 1.40 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని వివిధ సంస్థలు లీజుకు  తీసుకున్నట్లు స్థిరాస్తి సేవల సంస్థ కొలియర్స్‌ ఇండియా పేర్కొంది. 2021 ఇదే కాలం నాటి లీజు విస్తీర్ణం 56 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే ఇది దాదాపు 2.5 రెట్లు అని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి- జూన్‌లో చూస్తే, ఈ ఆరు ప్రధాన నగరాల్లో మొత్తం 2.75 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలం లీజుకు వెళ్లింది. 2021 ఇదే కాలంలో ఈ మొత్తం 1.03 కోట్ల చదరపు అడుగులుగా ఉంది.

* హైదరాబాద్‌లో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 23 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. 2021 ఇదే కాలం నాటి లీజ్‌ 7 లక్షల చ.అ.తో పోలిస్తే, ఈసారి 3 రెట్లు అధికంగా వెళ్లింది. ఈ ఏడాది జనవరి- జూన్‌లో మొత్తం 45 లక్షల చ.అ. కార్యాలయ స్థలాన్ని కార్పొరేట్‌ సంస్థలు ఇక్కడ లీజుకు తీసుకున్నాయి. 2021 ఇదే కాలంలో ఇది 11 లక్షల చ.అడుగులేనని నివేదిక వెల్లడించింది.

* ఏప్రిల్‌-జూన్‌లో చూస్తే బెంగళూరులో 44 లక్షలు, చెన్నైలో 11లక్షలు, దిల్లీలో 27 లక్షలు, ముంబయిలో 28 లక్షలు, పుణెలో 14 లక్షల చదరపు అడుగుల చొప్పున కార్యాలయాల స్థలం అద్దెకు తీసుకున్నారు.
మరింత గిరాకీ పెరుగుతుంది: రాబోయే రెండు త్రైమాసికాల్లో కార్యాలయ స్థలానికి మరింత గిరాకీ పెరిగే అవకాశం ఉందని  కొలియర్స్‌ ఇండియా సీఈఓ రమేశ్‌ నాయర్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 6 నగరాల్లో దాదాపు 4-4.5 కోట్ల చ.అ. విస్తీర్ణం మేర కార్యాలయాల స్థలం లీజింగ్‌కు అవకాశం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు