జొమాటోకు నష్టాల బ్లింకిట్‌

క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ను నిర్వహించే బ్లింక్‌ కామర్స్‌ (ఇంతకు ముందు గ్రోఫర్స్‌ ఇండియా)ను రూ.4447.48 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించినప్పటి నుంచీ జొమాటో షేరు నష్టపోతూనే ఉంది. షేరు రూ.70.50 నుంచి వరుసగా ఆరో ట్రేడింగ్‌ రోజుల్లో రూ.54.40 కి కుదేలైంది. బ్లింకిట్‌

Published : 05 Jul 2022 02:29 IST

రూ.50 కంటే దిగితే.. రూ.25 దిశగా షేరు

ఛాయిస్‌ బ్రోకింగ్‌ అంచనా

క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ను నిర్వహించే బ్లింక్‌ కామర్స్‌ (ఇంతకు ముందు గ్రోఫర్స్‌ ఇండియా)ను రూ.4447.48 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించినప్పటి నుంచీ జొమాటో షేరు నష్టపోతూనే ఉంది. షేరు రూ.70.50 నుంచి వరుసగా ఆరో ట్రేడింగ్‌ రోజుల్లో రూ.54.40 కి కుదేలైంది. బ్లింకిట్‌ కొనుగోలు విషయాన్ని ఆలస్యంగా బహిర్గతం చేసిందని కొంత మంది జొమాటో పెద్ద మదుపర్లు సెబీకి ఫిర్యాదు చేశారు కూడా. సోమవారం ఇంట్రాడేలో 5 శాతానికి పైగా కోల్పోయిన షేరు.. రూ.53.35 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 3.03 శాతం తగ్గి రూ.54.40 వద్ద ముగిసింది. బ్లింకిట్‌ కొనుగోలుకు జొమాటో డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని జూన్‌ 24న సంస్థ వెల్లడించింది. ఆ రోజు రూ.70.50గా ఉన్న జొమాటో షేరు.. ఆ తర్వాత 6 ట్రేడింగ్‌ రోజుల్లో 20 శాతానికి పైగా క్షీణించింది. సాంకేతికంగా జొమాటో షేరు బలహీనంగా ఉందని.. రాబోయే రోజుల్లో షేరు రూ.50 దిగువన ముగిస్తే.. రూ.25-30 వరకు పడిపోవచ్చని ఛాయిస్‌ బ్రోకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుమీత్‌ బగాడియా అంచనా వేస్తున్నారు. ఈ స్క్రిప్‌ తాజా కొనుగోళ్లకు దూరంగా ఉండమని, పెట్టుబడులకు మంచి షేర్లను ఎంపిక చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఇటీవలి త్రైమాసికంలో జొమాటో నష్టాలు మూడింతలు అధికం కాగా, నష్టాల్లో ఉన్న బ్లింకిట్‌ను కొనుగోలు చేయడం సందేహాలకు తావిస్తోందని సార్వాంక్‌ అసోసియేట్స్‌ ప్రిన్సిపల్‌ అసోసియేట్‌ యశ్‌వర్ధన్‌ సింగ్‌ అన్నారు. ఈ ఏడాదిలో జొమాటో షేరు ఇప్పటివరకు 60 శాతానికి పైగా క్షీణించింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్‌ విలువ రూ.41,970 కోట్లకు పరిమితమైంది.

* రూ.76 షేరు విలువకు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన జొమాటో, 2021 జులై 24న స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నమోదైనప్పుడు 51.6 శాతం అధికంగా రూ.115కు చేరింది. ఆరోజు గరిష్ఠంగా రూ.138కి చేరిన షేరు, చివరకు రూ.125.85  వద్ద ముగిసింది. తొలిరోజు రూ.లక్ష కోట్ల మార్కెట్‌ విలువను అధిగమించడంతో పాటు అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన 50 సంస్థల జాబితాలోనూ చేరింది. తొలిరోజు మార్కెట్‌ విలువ రూ.98,700 కోట్ల వద్ద ముగిసింది. ఇప్పటికి రూ.56,730 కోట్ల విలువను కోల్పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని