బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లకు కొనుగోళ్లు

విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగినా.. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో, దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలు ఆర్జించాయి. బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో, మూడు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. డాలర్‌తో పోలిస్తే

Published : 05 Jul 2022 02:29 IST

సమీక్ష

విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగినా.. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో, దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలు ఆర్జించాయి. బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో, మూడు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా తగ్గి 78.95 వద్ద ముగిసింది.  

సెన్సెక్స్‌ ఉదయం 52,851.67 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై, 52,674.81 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. మధ్యాహ్నం తర్వాత పుంజుకుని లాభాల్లోకి వచ్చిన సూచీ 53,301.99 పాయింట్ల దగ్గర గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 326.84 పాయింట్ల లాభంతో 53,234.77 వద్ద ముగిసింది.  నిఫ్టీ 83.30 పాయింట్లు పెరిగి 15,835.35 వద్ద ముగిసింది.  

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 24 రాణించాయి. హెచ్‌యూఎల్‌ 4.03%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.05%, ఐటీసీ 2.62%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.25%, పవర్‌గ్రిడ్‌ 2.01%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.44%, ఎస్‌బీఐ 1.40%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.26%, నెస్లే 1.04% లాభపడ్డాయి. టీసీఎస్‌ 2.46%, టాటా స్టీల్‌ 2.15%, ఎం అండ్‌ ఎం 1.56%, టెక్‌ మహీంద్రా 1.01% డీలాపడ్డాయి.  

కాగితం షేర్ల జోరు: ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం అమల్లోకి రావడంతో పేపర్‌ షేర్ల జోరు కొనసాగుతోంది. ఈ ఆదేశాలు వెలువడిన జూన్‌ 30 నుంచి చూస్తే, ఇప్పటివరకు శేషసాయి పేపర్‌ 7%, ఆంధ్రా పేపర్‌ 6.21%, తమిళనాడు న్యూస్‌ప్రింట్‌ 4.62%, సటియా ఇండస్ట్రీస్‌ 4.62%, స్టార్‌ పేపర్‌ మిల్స్‌ 4.14%, ఇమామీ పపర్‌ 3.92%, వెస్ట్‌కోస్ట్‌ పేపర్‌ 3.83%, ఓరియెంట్‌ పేపర్‌ 3.10%, జేకే పేపర్‌ 2.93%, ఆస్ట్రాన్‌ పేపర్‌ 2.64% చొప్పున లాభపడ్డాయి.

* రూ.2,500 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించినట్లు సోమవారం బజాజ్‌ ఆటో వెల్లడించింది. రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరును రూ.4,600 మించకుండా వాటాదార్ల నుంచి కొనుగోలు చేయనుంది.

* హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీన ప్రతిపాదనకు బ్యాంకింగ్‌ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం అనుమతినిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని