ఆభరణాలకు గిరాకీ బాగుంటుంది: టైటన్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు మధ్య కాలానికి తమ ఆభరణాల విభాగానికి సానుకూలతలు ఉన్నాయని, గణనీయ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని టాటా గ్రూప్‌ సంస్థ టైటన్‌ అంచనా వేసింది. రాబోయే పెళ్లిళ్ల సీజన్‌తో పాటు పసిడి మార్పిడి పథకం, నెట్‌వర్క్‌

Published : 05 Jul 2022 02:29 IST

అమెరికాలో తనిష్క్‌ కొత్త విక్రయశాల

సంప్రదాయ దుస్తులు, పరిమళ విభాగానికి శ్రీకారం

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు మధ్య కాలానికి తమ ఆభరణాల విభాగానికి సానుకూలతలు ఉన్నాయని, గణనీయ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని టాటా గ్రూప్‌ సంస్థ టైటన్‌ అంచనా వేసింది. రాబోయే పెళ్లిళ్ల సీజన్‌తో పాటు పసిడి మార్పిడి పథకం, నెట్‌వర్క్‌ విస్తరణ వంటివి తమ విక్రయాల వృద్ధికి ఊతమిస్తాయని పేర్కొంది. ఆభరణాల విభాగంలో టైటన్‌ బ్రాండ్‌ తనిష్క్‌ను  అంతర్జాతీయ విపణుల్లో విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపింది. పశ్చిమాసియా, ఉత్తర అమెరికా విపణుల్ని లక్ష్యంగా చేసుకున్నామంది. అమెరికాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్త విక్రయశాల ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు కంపెనీ తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. దేశీయ విపణిలోనూ మరిన్ని విక్రయశాలలు తెరుస్తామని పేర్కొంది.

* టైటన్‌ తమ ఆభరణాల విభాగాన్ని తనిష్క్‌, మియా బై తనిష్క్‌, జోయా బ్రాండ్లతో నిర్వహిస్తోంది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.27,456 కోట్ల విక్రయాల్లో 88 శాతానికి పైగా ఆభరణాల విభాగం నుంచే ఆదాయం లభించింది. ఆభరణాల విభాగంతో పాటు వాచీలు, కళ్లజోళ్ల విభాగాలనూ టైటన్‌ నిర్వహిస్తోంది. ఎథినిక్‌ వేర్‌ వ్యాపారంలోకీ అడుగుపెట్టింది.

* వాటాదార్లనుద్దేశించి టైటన్‌ ఎండీ సీకే వెంకట్రామన్‌ మాట్లాడుతూ ‘భారతీయులకు ఆభరణాలపై ఉన్న మక్కువను మేము అవకాశంగా తీసుకుంటున్నాం. తనిష్క్‌ జెండాను త్వరలోనే పశ్చిమాసియా, ఉత్తర అమెరికాల్లోనూ ఎగురవేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మేము ఉన్న ప్రతి విభాగంలోనూ బలమైన వృద్ధి నమోదు చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ దుస్తుల (ఎథినిక్‌ వేర్‌), పరిమళ విభాగం, మహిళల బ్యాగుల విభాగంలో మరింతగా ఎదగాలనుకుంటున్నాం. ఇందుకోసం చిన్న పట్టణాలకు సైతం విస్తరిస్తామ’ని వెల్లడించారు.

* అంతర్జాతీయ ఆభరణాల విభాగ వ్యాపారానికొస్తే దుబాయి, ఏఐ బార్షాల్లో తనిష్క్‌ విక్రయశాలల్ని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ఆ స్టోర్లన్నీ బాగా నడుస్తున్నాయని, యూఏఈ, జీసీసీ దేశాల్లో మరిన్ని విక్రయశాలలను ప్రారంభిస్తామని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని