Published : 05 Jul 2022 02:29 IST

5 లక్షల కార్ల విక్రయ లక్ష్యం

టాటా మోటార్స్‌ ఏజీఎంలో ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో 5 లక్షల కార్లు విక్రయించాలన్నతి టాటా మోటార్స్‌ లక్ష్యమని చంద్రశేఖరన్‌ వెల్లడించారు. విద్యుత్‌ వాహనాల (ఈవీలు) విక్రయాలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి లక్ష మైలురాయిని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2025 నాటికి తమ ఉత్పత్తుల్లో  10 విద్యుత్‌ వాహనాలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. అయిదేళ్లలో మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా 25 శాతానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. త్వరలోనే కంపెనీ వాటాదార్లకు మళ్లీ డివిడెండ్లు పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. 2020-21లో 5,000 ఈవీలను, 2021-22లో 19,500 ఈవీలను విక్రయించినట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 50,000 ఈవీలను విక్రయించాలనుకుంటున్నామని, 2023-24లో ఈ సంఖ్య లక్ష మైలురాయిని అధిగమిస్తుందని తెలిపారు. ప్రయాణికుల విద్యుత్‌ వాహనాల వ్యాపారంలో 2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.15,800 కోట్లు) పెట్టుబడుల్ని పెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసమే గతేడాది టీపీజీ నుంచి రూ.3,500 కోట్ల నిధుల్ని సమీకరించామని, రెండో విడతగా ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం నుంచి అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో మరిన్ని నిధుల్ని సేకరిస్తామని చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. కంపెనీ నెల వారీగా 45,000 వాహనాలను విక్రయిస్తోందని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి 5 లక్షల మైలురాయిని అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని వాహన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నామని, ఇందులో భాగంగానే సనంద్‌లోని ఫోర్డ్‌ ఫ్యాక్టరీని కొనుగోలు చేసినట్లు వివరించారు.

* విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీ ఆలోచన ప్రస్తుతానికి కంపెనీకి లేదని వాటాదార్లకు చంద్రశేఖరన్‌ స్పష్టం చేశారు. విపణిలో వివిధ విభాగాలకు అవసరమైన ఛార్జింగ్‌ సొల్యూషన్లను  సిద్ధం చేస్తామన్నారు. ట్రాక్టర్ల తయారీపై కంపెనీ ఆచితూచి వ్యవహరిస్తుందన్నారు.

2022-23 రెండో అర్ధభాగం బాగుండొచ్చు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) రెండో అర్ధ భాగంలో కంపెనీ పని తీరు బాగుండొచ్చని టాటా మోటార్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సరఫరా పరిస్థితులు మెరుగవడంతో పాటు కమొడిటీ ధరల్లో స్థిరత్వం రావడం ఇందుకు కారణాలుగా పేర్కొన్నారు. కంపెనీ 77వ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదార్లనుద్దేశించి చంద్రశేఖరన్‌ ప్రసంగించారు. ‘బాహ్య సవాళ్లు ఉన్నప్పటికీ కంపెనీ వాహన విభాగాలన్నీ బలంగా ఉన్నాయి. సెమీ కండక్టర్ల కొరత తగ్గుతోంది. మొత్తంగా సరఫరా పరిస్థితులుమెరుగవుతున్నాయి. కమొడిటీ ధరలు స్థిరత్వాన్ని సాధిస్తున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంతో పోలిస్తే రెండో అర్ధభాగంలో కంపెనీ మెరుగైన పని తీరు కనబరుస్తుంది. భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు, సరఫరా ఆందోళనలు, ద్రవ్యోల్బణ భయాలు వంటి సమస్యలున్నా, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌), వాణిజ్య వాహనాలు, ప్రయాణికుల వాహనాలకు గిరాకీ బాగుంది. భవిష్యత్‌ అవసరాలకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. దీంతో వృద్ధి సాధించడంతో పాటు వాటాదార్లకు మెరుగైన ప్రతిఫలాలు అందేలా చూస్తాం. స్వల్పకాలంలో అనేక సవాళ్లున్నా, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నాం. మరింత బలంగా కంపెనీ ఎదుగుతుందన్న నమ్మకం ఉంది. హరిత వాహనాల్లో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సరసన టాటా మోటార్స్‌ నిలబడింది. 2039 నాటికి జేఎల్‌ఆర్‌ను శూన్య కర్బన ఉద్గార స్థాయికి చేరుస్తాం. ప్రయాణికుల వాహనాల విభాగాన్ని 2040కి, వాణిజ్య వాహనాల విభాగాన్ని 2045కు ఆ స్థాయికి తీసుకొస్తామ’ని చంద్రశేఖరన్‌ వెల్లడించారు.

దేశీయ వ్యాపారం 49% పెరిగింది: కంపెనీ దేశీయ వ్యాపారంపై చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో మొత్తం పరిశ్రమ పరిమాణం 15 శాతం వృద్ధి చెందితే,  టాటామోటార్స్‌ దేశీయ వ్యాపార పరిమాణం 49 శాతం పెరిగిందన్నారు. ఆదాయం 11.5 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. సరఫరా సమస్యలు, కమొడిటీ ద్రవ్యోల్బణం మార్జిన్లపై ప్రభావం చూపినా, రూ.1,879 కోట్ల బలమైన నగదు నిల్వలు కలిగి ఉన్నామన్నారు. సెమీ కండక్టర్ల కొరతతో గత ఆర్థిక సంవత్సరంలో జేఎల్‌ఆర్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు.

* అన్నీ విద్యుత్తు వాహనాలు రూపొందించాలన్న జాగ్వార్‌ వ్యూహం, కొత్త ల్యాండ్‌ రోవర్‌ ఉత్పత్తులకు బీఈవీ ఫస్ట్‌ ఈఎంఏ ప్లాట్‌ఫామ్‌ వినియోగం ద్వారా కొత్త తరం విద్యుత్‌ వాహనాల అభివృద్ధిలో గణనీయ పురోగతి సాధిస్తున్నామని చంద్రశేఖరన్‌ వివరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని