సంక్షిప్త వార్తలు

భారత మర్చండైజ్‌ ఎగుమతులు జూన్‌లో 16.78 శాతం వృద్ధి చెంది 37.94 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో బంగారం, చమురు సహా దిగుమతుల బిల్లు కూడా 51 శాతం  పెరిగి 63.58 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఫలితంగా వాణిజ్య లోటు రికార్డు

Published : 05 Jul 2022 02:29 IST

ఎగుమతుల్లో 17% వృద్ధి

వాణిజ్యలోటు 2563 కోట్ల డాలర్లు

దిల్లీ: భారత మర్చండైజ్‌ ఎగుమతులు జూన్‌లో 16.78 శాతం వృద్ధి చెంది 37.94 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో బంగారం, చమురు సహా దిగుమతుల బిల్లు కూడా 51 శాతం  పెరిగి 63.58 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఫలితంగా వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 25.63 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఏడాది క్రితంతో పోలిస్తే ఎగుమతుల వృద్ధి మే నెలలో 20.55%; 2021 జూన్‌లో 48.34 శాతం కావడం గమనార్హం.  

చమురు, పసిడి భారీగా.. : జూన్‌లో ముడి చమురు దిగుమతులు 94% పెరిగి 20.73 బి. డాలర్లకు; పసిడి దిగుమతులు 169.5% పెరిగి 2.61 బి. డాలర్లకు చేరుకున్నాయి. ఎగుమతుల్లోనూ పెట్రోలియం ఉత్పత్తులు 98% అధికంగా 7.82 బి. డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాభరణాలు 19.41% పెరిగి 3.37 బి. డాలర్లకు చేరాయి.
ఏప్రిల్‌-జూన్‌లో..: 2022-23 ఏప్రిల్‌-జూన్‌లో మొత్తం ఎగుమతులు 22.22 శాతం వృద్ధితో 116.77 బిలియన్‌ డాలర్లకు; దిగుమతులు 47.31 శాతం పెరిగి 187.02 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఫలితంగా ఏడాది క్రితం ఇదే సమయం నాటి వాణిజ్య లోటు 31.42 బి. డాలర్ల నుంచి ఈసారి 70.25 బి. డాలర్లకు చేరుకుంది.  కరెంట్‌ ఖాతా లోటు తొలి త్రైమాసికంలో రెట్టింపై 30 బి. డాలర్లకు; 2022-23 మొత్తంమీద 100-105 బి. డాలర్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.


సుజుకీ స్పోర్ట్స్‌ బైక్‌ ‘కటానా’

ధర రూ.13.61 లక్షలు

దిల్లీ: సుజుకీ ఇండియా కొత్త స్పోర్ట్స్‌ బైక్‌ కటానాను భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.13.61 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). జపాన్‌కు చెందిన పురాతన కత్తిని స్ఫూర్తిగా తీసుకుని, ఈ బైక్‌కు కటానా అని పేరు పెట్టారు. ఈ బైక్‌కు 999 సీసీ కూల్డ్‌ డీఓహెచ్‌సీ ఇన్‌లైన్‌ 4 సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 152 పీఎస్‌ సామర్థ్యంతో 106 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్‌ గేర్‌ బాక్స్‌ అమర్చారు. సుజుకీ ఇంటెలిజెంట్‌ రైడ్‌ సిస్టమ్‌తో పాటు పలు అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి.


డుకాటి స్ట్రీట్‌ ఫైటర్‌ వీ4 ఎస్‌పీ

ధర రూ.34.99 లక్షలు

దిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌బైక్‌ల తయారీ సంస్థ డుకాటి, భారత్‌లో స్ట్రీట్‌ ఫైటర్‌ వీ4 ఎస్‌పీ బైక్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.34.99 లక్షలు. 1,103 సీసీ ఇంజిన్‌ అమర్చిన బైక్‌ ఇది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ విక్రయశాలల్లో బుకింగ్‌లు ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. 208 హెచ్‌పీ సామర్థ్యంతో 123 ఎన్‌ఎం టార్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తుందని కంపెనీ తెలిపింది.


టాటాలకు నీలాచల్‌ ఇస్పాత్‌ అప్పగింత

దిల్లీ: నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ను టాటా గ్రూప్‌ సంస్థ టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడక్ట్స్‌కు సోమవారం అప్పగింతతో, ఆ సంస్థ ప్రైవేటీకరణ పూర్తయిందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రెండో విజయవంతమైన ప్రైవేటీకరణ ప్రక్రియ నీలాచల్‌ ఇస్పాత్‌దే. ప్రైవేటీకరణ జాబితాలో మొదటి కంపెనీగా ఉన్న ఎయిరిండియాను సైతం టాటా గ్రూప్‌ కొనుగోలు చేయడం గమనార్హం. నష్టాల్లో ఉన్న నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ను ఈ ఏడాది జనవరిలో టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడక్ట్స్‌ రూ.12,100 కోట్లకు దక్కించుకుంది. 4 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎంటీసీ, ఎన్‌ఎమ్‌డీసీ, భెల్‌, మెకాన్‌, రెండు ఒడిశా ప్రభుత్వ సంస్థలు ఓఎంసీ, ఐపీఐసీఓఎల్‌లు సంయుక్తంగా నీలాచల్‌ ఇస్పాత్‌ను ఏర్పాటు చేశాయి. కంపెనీలో ప్రభుత్వానికి ఎటువంటి ఈక్విటీ లేనందున, ఈ అమ్మకం ద్వారా ఖజానాకు ఎటువంటి సొమ్ముచేరదు. షేరు కొనుగోలు ఒప్పందం ప్రకారం ఈ విక్రయ మొత్తాన్ని ఉద్యోగులు, రుణదాతలు, ఇతర సరఫరాదార్లకు చెల్లించాల్సిన బకాయిలకు వినియోగిస్తారు.

10 మి.టన్నులకు సామర్థ్య విస్తరణ: ఒడిశాలోని కళింగనగర్‌లో 1.1 మి.టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన ఉక్కు కర్మాగారం నీలాచల్‌ ఇస్పాత్‌కు ఉంది. వరుస నష్టాలతో 2020 మార్చిలో ఈ ప్లాంట్‌ను మూసివేశారు. ఈ ప్లాంటును పునఃప్రారంభించే పనిని వేగవంతం చేస్తామని టాటా స్టీల్‌ తెలిపింది. వచ్చే కొన్నేళ్లలో ఏడాదికి 4.5 మిలియన్‌ టన్నుల లాంగ్‌ ఉత్పత్తులు తయారు చేసేలా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2030కి 10 మి.టన్నుల వార్షిక సామర్థ్యానికి చేరతామని వెల్లడించింది.


ఆకాశ్‌కు బైజూస్‌ నుంచి రూ.7125 కోట్లు

రూ.6000 కోట్ల నిధుల సమీకరణ పూర్తి

దిల్లీ: ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీస్‌ కొనుగోలు నిమిత్తం 950 మి. డాలర్ల (దాదాపు రూ.7125 కోట్లు) చెల్లింపును బైజూస్‌ పూర్తి చేసింది. మార్చిలో ప్రకటించిన 800 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.6000 కోట్ల) నిధుల సమీకరణలో అధిక భాగాన్ని సైతం పూర్తి చేయగలిగింది. ‘మా నిధుల సమీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 800 మిలియన్‌ డాలర్ల సమీకరణలో అధిక భాగాన్ని పూర్తి చేశాం. మిగతా మొత్తాన్ని కూడా త్వరలోనే పొందగలం. ఆకాశ్‌కు చెల్లింపులన్నీ పూర్తి చేశాం. వచ్చే 10 రోజుల్లో ఆడిట్‌ చేసిన ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నామ’ని బైజూస్‌ పేర్కొంది. 800 మి. డాలర్లలో బైజూస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ బైజు రవీంద్రన్‌ సొంతంగా 400 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. తాజా నిధుల సమీకరణతో కంపెనీ విలువ 22 బిలియన్‌ డాలర్లకు చేరినట్లయింది.


క్యాన్సర్‌ ఔషధాల అభివృద్ధికి ఈక్యూఆర్‌ఎక్స్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: క్యాన్సర్‌, ఇమ్యూన్‌-ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులకు సంబంధించిన ఔషధాల అభివృద్ధి, ఆవిష్కరణ, విక్రయం కోసం అమెరికాకు చెందిన ఈక్యూఆర్‌ఎక్స్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ అనుబంధ సంస్థ ఆరిజెన్‌ డిస్కవరీ టెక్నాలజీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఆరిజెన్‌ ఔషధాల ఆవిష్కరణ, ప్రీ క్లినికల్‌ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈక్యూఆర్‌ఎక్స్‌ క్లినికల్‌ అభివృద్ధి, ఉత్పత్తి, నియంత్రణ సంస్థల అనుమతి, వాణిజ్యీకరణ వంటి విషయాలను చూసుకుంటుందని డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. రెండు కంపెనీలు దీనికోసం సమానంగా పెట్టుబడులు పెట్టడంతో పాటు, లాభాలనూ అదే నిష్పత్తిలో పంచుకుంటాయని వెల్లడించింది.


ప్రొలిఫిక్స్‌ చేతికి టియర్‌2 కన్సల్టింగ్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సేవలను అందించేసంస్థ ప్రొలిఫిక్స్‌, ఇంగ్లండ్‌ కేంద్రంగా కొనసాగుతున్న టియర్‌ 2 కన్సల్టింగ్స్‌ను సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా విస్తరణ, వృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఈ కొనుగోలు జరిగిందని ప్రొలిఫిక్స్‌ ఛైర్మన్‌, ఎండీ సత్య బొల్లి అన్నారు. సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, డెలివరీ, రెడ్‌హ్యాట్‌ మిడిల్‌వేర్‌, ఓపెన్‌వేర్‌లో టియర్‌2 కన్సల్టింగ్స్‌ అనుభవం మాకెంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. యూకే, ఉత్తర అమెరికా క్లౌడ్‌ మార్కెట్లలో స్థానం మెరుగుపర్చుకునేందుకు ఇది తోడ్పడుతుందన్నారు.


ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడి ఉందాం!

2022-23లో 6.4 శాతంపై కేంద్రం దృష్టి

దిల్లీ: అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోగలిగేంత బలంగా దేశ స్థూల ఆర్థిక మూలాలు ఉండడం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 6.4 శాతానికి పరిమితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ముడి చమురు ధరలను అదుపులో పెట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆ వర్గాలు వివరించాయి. దేశ చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీన పడటంతో, దిగుమతులు భారంగా మారాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ముడి చమురు, ఇతర కమొడిటీల ధరలు పెరుగుతున్నందున భారత్‌తో పాటు అన్ని దేశాల్లోనూ ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతోంది. బడ్జెట్‌లో ద్రవ్యలోటును జీడీపీలో 6.4 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దానికే కేంద్రం కట్టుబడి ఉండేందుకు ప్రయత్నిస్తోందని అధికార వర్గాలు వివరించాయి. అయితే కరెంటు ఖాతా లోటు(సీఏడీ) అధికంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నాయి. కొన్నేళ్లుగా సీఏడీ తక్కువ స్థాయిలో నమోదవుతూ వస్తున్నా, ఈ ఏడాది మాత్రం ఒత్తిడి కనిపిస్తోంది. అయితే స్థూల ఆర్థిక పరిస్థితులు, విదేశీ మారకపు నిల్వలు గతంలో కంటే మెరుగ్గా ఉండడం కలిసొచ్చే అంశం.


చమురు పన్నులపై 15 రోజులకోసారి సమీక్ష

పరిమితి ఏదీ లేదు: కేంద్రం

దిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విండ్‌ఫాల్‌ పన్ను, పెట్రోల్‌-డీజిల్‌-విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ఎగుమతులపై  ప్రత్యేక సుంకాన్ని జులై 1 నుంచి కొత్తగా విధించారు. ఈ పన్నులను ప్రతి 15 రోజులకోసారి కేంద్రం సమీక్షించనుంది. విదేశీ కరెన్సీ మారకపు రేట్లు; అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా దీనిని చేపట్టనున్నట్లు రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. ఈ పన్నులను వెనక్కి తీసుకోవడానికి చమురు ధరలకు ఎటువంటి స్థాయినీ నిర్దేశించుకోలేదని స్పష్టం చేశారు. ‘చమురు బ్యారెల్‌ ధర 40 డాలర్లకు చేరినపుడు విండ్‌ఫాల్‌ పన్నును ఉపసంహరిస్తామన్న చర్చలు నడుస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ప్రస్తుత ధరలను దృష్టిలో పెట్టుకుంటే, ఈ వాదనలు అవాస్తవికంగా ఉన్నాయ’ని పేర్కొన్నారు. ‘డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ, అంతర్జాతీయంగా డీజిల్‌, ముడి చమురు ధర; దేశీయ ముడి చమురు ఉత్పత్తి వ్యయాలను బట్టి 15 రోజులకోసారి మేం పన్నులను సమీక్షిస్తాం’ అని తరుణ్‌ బజాజ్‌ వెల్లడించారు.  పన్నులను సమీక్షించడానికి ఎటువంటి పరిమితినీ పెట్టుకోలేదని సీబీఐసీ ఛైర్మన్‌ వివేక్‌ జోహ్రి సైతం స్పష్టం చేశారు. ‘ఇంధన ఎగుమతుల వల్ల కొన్ని చమురు రిఫైనరీ సంస్థలు భారీ స్థాయిలోనే లాభాలు పొందాయి. దేశ అవసరాలను తీర్చడమే ప్రాధాన్యతగా భావించే, ఇంధన ఎగుమతిపై పన్ను విధించాల్సి వచ్చింద’ని గత వారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించిన సంగతి తెలిసిందే.


సోలార్‌ సెల్స్‌ ప్లాంటుపై

టాటా పవర్‌ రూ.3000 కోట్ల పెట్టుబడి

దిల్లీ: తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే సోలార్‌ సెల్‌ ప్లాంటుపై రూ.3,000 కోట్ల పెట్టుబడులను టాటాపవర్‌ ప్రకటించింది. ‘4గిగా వాట్‌ సోలార్‌ సెల్‌, 4గిగా వాట్‌ సోలార్‌ మాడ్యూల్‌ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడం కోసం రూ.3000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడం కోసం తమిళనాడు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్న’ట్లు టాటా పవర్‌  వెల్లడించింది. 16 నెలల వ్యవధిలో ఈ పెట్టుబడులను పెట్టనున్నట్లు, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2000 మందికి ఉద్యోగాలను ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది.


ఆరోగ్య సంరక్షణ సేవలకు జీఎస్‌టీ మినహాయింపు ఇవ్వాలి: ఫిక్కీ

దిల్లీ: ఆరోగ్య సంరక్షణ సేవలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని (శూన్య జీఎస్‌టీ పరిధిలోకి చేర్చాలని) కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిక్కీ లేఖ రాసింది. ఇందువల్ల ఈ రంగంలోని సంస్థలు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను (ఐటీసీ) క్లెయిమ్‌ చేసుకునే వీలు ఏర్పడుతుందని అందులో పేర్కొంది. తద్వారా ఆరోగ్య సంరక్షణ సేవల వ్యయాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణకు 12%, రోజుకు రూ.5000 మించిన ఆసుపత్రి గది అద్దెపై 5 శాతం జీఎస్‌టీ విధించేందుకు జీఎస్‌టీ మండలి ఇటీవల సిఫారసు చేయడాన్ని ఫిక్కీ ప్రస్తావించింది.  కొన్ని ఆసుపత్రులకు సొంతంగా బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఉన్నాయని, 12 శాతం జీఎస్‌టీ విధిస్తే ఆ ఆసుపత్రులు ఐటీసీని క్లెయిమ్‌ చేసుకునే వీలుండదని పేర్కొంది. దీనివల్ల రోగులకు ఆసుపత్రి ఖర్చుల భారం పెరుగుతుందని పేర్కొంది. గది అద్దెపై 5 శాతం జీఎస్‌టీ విధించడం వల్ల రోగుల్లో గందరగోళానికి దారి తీస్తుందని తెలిపింది. ‘సాధారణంగా చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చులోనే (ప్యాకేజీ) గది అద్దె ఉంటుంది. ప్యాకేజీలో ఏదో ఒక దానికి జీఎస్‌టీ విధించడం వల్ల.. ప్యాకేజీ స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. పన్ను రేట్లు పెరగడం వల్ల ఆసుపత్రులకు వ్యయాలు భారం అవ్వడంతో పాటు నిబంధనల పాటింపు ప్రక్రియ మరింత క్లిష్టంగా మారొచ్చ’ని ఫిక్కీ పేర్కొంది.  


వైర్‌లెస్‌ జామర్లు విక్రయిస్తున్న పోర్టళ్లకు డాట్‌ హెచ్చరిక

దిల్లీ: వైర్‌లెస్‌ జామర్లు, నెట్‌వర్క్‌ బూస్టర్ల వంటి టెలికాం పరికరాలను విక్రయిస్తున్న ఇ-కామర్స్‌ పోర్టళ్లను టెలికాం విభాగం(డాట్‌) హెచ్చరించింది. వీటి అమ్మకానికి ప్రభుత్వ అనుమతి అవసరమని స్పష్టం చేసింది. గత 4-5 ఏళ్లలో పలుమార్లు డాట్‌ ఈ అంశాన్ని లేవనెత్తింది. ఈ తరహా సామగ్రి అక్రమ అమ్మకాలను అదుపులో పెట్టడానికి దాడులు సైతం నిర్వహించింది. ‘ప్రభుత్వం అనుమతించిన వాటికి మినహా, మిగతా సెల్యులార్‌ సిగ్నల్‌ జామర్లు, జీపీఎస్‌ ట్రాకర్లు, ఇతరత్రా సిగ్నల్‌ జామింగ్‌ పరికరాల వినియోగం చట్టవిరుద్ధం. ప్రైవేటు రంగ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు భారత్‌లో జామర్లను సేకరించరాద’ని డాట్‌ పేర్కొంది. జనవరి 21న సైతం డాట్‌ ఇ-కామర్స్‌ సంస్థలకు నోటీసులు పంపింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ, పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ), ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ, కస్టమ్స్‌ శాఖలకు సైతం ఈ నోటీసు కాపీని తగిన చర్యల కోసం పంపారు. తాజా నోటీసుల వల్ల పౌరుల్లోనూ స్పృహ కలుగుతుందని కాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ కొచ్చర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని