Published : 06 Jul 2022 03:44 IST

ఏడాదిన్నరలో పలు కొత్త ఔషధాలు!

పరిశోధనలకు రెట్టింపు ప్రాధాన్యం

ఎంయూపీఎస్‌ ఉత్పత్తులకు కొత్త బ్లాకు సిద్ధం

గ్రాన్యూల్స్‌ ఇండియా విస్తరణ వ్యూహాలు

ఈనాడు, హైదరాబాద్‌

స్థానిక ఫార్మా కంపెనీ అయిన గ్రాన్యూల్స్‌ ఇండియా సత్వర వృద్ధి వ్యూహాలపై కసరత్తు చేస్తోంది. పరిశోధనలకు పెద్ద పీట వేయడం ద్వారా సమీప భవిష్యత్తులో పలు కొత్త ఔషధాలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,764 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2020-21 ఆదాయంతో పోలిస్తే ఇది 16 శాతం అధికం. ముడిపదార్థాలు, సాల్వెంట్స్‌ ధరలు 40 - 70 శాతం పెరిగినా, మెరుగైన లాభాలు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు, లాభాలను ఇంకా పెంచుకోడానికి అవసరమైన చర్యలపై కంపెనీ దృష్టి సారించింది. ప్రధానంగా పరిశోధనా కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు, పరిశోధనలకు రెట్టింపు నిధులు ఖర్చు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా సీఎండీ డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ 2021-22 వార్షిక నివేదికలో వెల్లడించారు. నూతన ఏపీఐ ఔషధాలు, ఫార్ములేషన్లను ఆవిష్కరించడమే లక్ష్యంగా పరిశోధనలను అధికం చేస్తామని పేర్కొన్నారు. వ్యయాలు తగ్గించుకోడానికి, సాంకేతిక భాగస్వామ్యాలు కుదుర్చుకోడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు.

ఆర్‌ అండ్‌ డీపై రూ.143 కోట్లు

గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ పరిశోధన- అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాలకు రూ.143 కోట్లు వెచ్చించింది. హైదరాబాద్‌ సమీపంలో జీనోమ్‌ వ్యాలీలోని ఎంఎన్‌ పార్క్‌లో 20,000 చదరపు అడుగుల నూతన పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రంలో 150 మందికి పైగా శాస్త్రవేత్తలు పనిచేసే అవకాశం ఉంది. ఎంజైమ్‌, ప్రొటీన్‌ ఇంజినీరింగ్‌పై పరిశోధనలు చేపట్టి కొత్త ఔషధాలు ఆవిష్కరించడం లక్ష్యంగా శాస్త్రవేత్తల బృందాలు పనిచేస్తున్నట్లు సమాచారం. కొత్తగా ఎంయూపీఎస్‌ (మల్టీ- యూనిట్‌ పెల్లెట్‌ సిస్టమ్స్‌) ఉత్పత్తుల కోసం రూ.240 కోట్లతో నూతన బ్లాకును నిర్మించింది. అవసరమైన సదుపాయాలు సమకూర్చుకుంటూనే, పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాల ద్వారా కొత్త ఔషధాలు తీసుకురావడం ద్వారా స్థిర వృద్ధి సాధించడానికి ప్రయత్నించాలనేది కంపెనీ ఆలోచనగా కనిపిస్తోంది. ఏడాదిన్నర వ్యవధిలో పలు కొత్త ఔషధాలను మార్కెట్‌కు అందించే ఏర్పాట్లలో కంపెనీ ఉంది.

వీటిల్లో అగ్రస్థానం

పారాసెట్మాల్‌, మెట్‌ఫామిన్‌, గ్వాఫెనెసిన్‌, మెథోకార్బమోల్‌ ఔషధ ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) ల్లో గ్రాన్యూల్స్‌ ఇండియా అగ్రగామిగా ఉంది.  ఫార్మాస్యూటికల్‌ ఫార్ములేషన్‌ ఇంటర్మీడియేట్లు (పీఎఫ్‌ఐ), తుది ఔషధాలను (ఫినిష్డ్‌ డోసేజెస్‌) ఈ సంస్థ సరఫరా చేస్తోంది. కంపెనీ వార్షిక ఆదాయాల్లో 88 శాతం ఎగుమతుల రూపంలోనే లభిస్తున్నాయి. ఎగుమతుల్లోనూ అమెరికా వాటా ఎంతో అధికం. గత ఆర్థిక సంవత్సరంలో యూఎస్‌ మార్కెట్లో 64 ఏఎన్‌డీఏ (అబ్రివియేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్‌) అనుమతుల కోసం దరఖాస్తు చేయగా, 50 ఔషధాలకు అనుమతి లభించింది. అదే సమయంలో ఐరోపా మార్కెట్లో 6, కెనడాలో 5 ఔషధాలకు అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. మున్ముందూ యూఎస్‌, ఐరోపా దేశాల్లో కొత్త ఔషధాలకు దరఖాస్తు చేదు అనుమతులు పొంది, సత్వరం విడుదల చేయాలని కంపెనీ యాజమాన్యం భావిస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని