Updated : 06 Jul 2022 07:03 IST

₊631 నుంచి ₋100కు

జీవనకాల కనిష్ఠమైన 79.33కు రూపాయి

సమీక్ష

సూచీల ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఐరోపా మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడంతో పాటు ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంకింగ్‌, ఐటీ షేర్లకు చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలు తప్పలేదు. నిఫ్టీ ఇంట్రాడేలో 16,000 పాయింట్లను అధిగమించినా, ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 38 పైసలు కుదేలై తాజా జీవనకాల కనిష్ఠమైన 79.33 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో టోక్యో, సియోల్‌, హాంకాంగ్‌ లాభపడగా, షాంఘై స్వల్పంగా నష్టపోయింది.

సెన్సెక్స్‌ ఉదయం 53,501.21 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ.. ఇంట్రాడేలో 631.16 పాయింట్ల లాభంతో 53,865.93 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత  అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఒకదశలో 53,054.30 పాయింట్లకు పడిపోయింది. చివరకు 100.42 పాయింట్ల నష్టంతో 53,134.35 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 24.50 పాయింట్లు తగ్గి 15,810.85 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,785.45- 16,025.75 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 నష్టపోయాయి. ఐటీసీ 1.73%, విప్రో 1.58%, మారుతీ 1.13%, ఎల్‌ అండ్‌ టీ 1.12%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.98%, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.92% మేర నీరసపడ్డాయి. పవర్‌గ్రిడ్‌ 1.64%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.21%, హెచ్‌యూఎల్‌ 1.12%, సన్‌ఫార్మా 0.83%, రిలయన్స్‌ 0.80%  లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో ఐటీ, టెక్‌, బ్యాంకింగ్‌, వాహన, స్థిరాస్తి, టెలికాం 0.59% వరకు పడ్డాయి. విద్యుత్‌, ఆరోగ్య సంరక్షణ, యుటిలిటీస్‌, లోహ, చమురు-గ్యాస్‌ రాణించాయి. బీఎస్‌ఈలో 1637 షేర్లు నష్టాల్లో ముగియగా, 1664 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 142 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* ఎవరెడీ ఇండస్ట్రీస్‌ అధికారిక ప్రమోటర్‌గా డాబర్‌ సంస్థను నిర్వహించే బర్మన్‌ కుటుంబం అవతరించింది. జూన్‌లో ఓపెన్‌ ఆఫర్‌ ముగిసిన తర్వాత ఎవరెడీ ఇండస్ట్రీస్‌లో ఈ కుటుంబానికి చెందిన పురన్‌ అసోసియేట్స్‌, వీఐసీ ఎంటర్‌ప్రైజెస్‌, ఎంబీ ఫిన్‌మార్ట్‌, గ్యాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌, చౌద్రీ అసోసియేట్స్‌ల వాటా 38.38 శాతానికి చేరింది.

* బ్రిటానియా ఇండస్ట్రీస్‌ రూ.5000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనను ఇటీవల ముగిసిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో వాటాదార్లు తిరస్కరించారు. ప్రతిపాదన ఆమోదానికి కనీసం 75% సభ్యుల ఓట్లు అవసరం కాగా.. 73.35% మాత్రమే అనుకూలంగా వచ్చాయి.  

* ఆస్తుల విక్రయానికి చేసిన ప్రత్యేక తీర్మానాన్ని రిలయన్స్‌ పవర్‌ వాటాదార్లు జూన్‌ 2న జరిగిన ఏజీఎంలో తోసిపుచ్చారు. ఈ ప్రతిపాదనకు అనుకూలంగా 72.02% ఓట్లు, వ్యతిరేకంగా 27.97% ఓట్లు వచ్చాయి. 75 శాతం ఓట్లు అనుకూలంగా వస్తేనే తీర్మానం ఆమోదం పొందుతుందన్నది గమనార్హం.

* అదానీ పోర్ట్స్‌ ఎండీగా గౌతమ్‌ అదానీ పునర్నియామకానికి జులై 26న జరగబోయే ఏజీఎంలో వాటాదార్ల అనుమతిని సంస్థ కోరనుంది. అదానీ కానెక్స్‌తో రూ.5000 కోట్ల రిలేటడ్‌ పార్టీ లావాదేవీకి జులై 27న జరగబోయే ఏజీఎంలో అదానీ పవర్‌ వాటాదార్ల అనుమతి తీసుకోనుంది.

* జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ రూ.470.18 కోట్ల బకాయిలు చెల్లించలేకపోయింది. సంస్థకు స్వల్ప, దీర్ఘకాలిక రుణభారం రూ.495.18 కోట్లుగా ఉంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని