చిట్‌ఫండ్‌పై జీఎస్‌టీ తొలగించాలి

చిట్‌ఫండ్‌ సేవలకు జీఎస్‌టీ (వస్తు,సేవల పన్ను) రేటును 12 నుంచి 18 శాతానికి పెంచితే ఖాతాదారులకు నష్టం జరుగుతుందని ఆలిండియా అసోసియేషన్‌ ఆఫ్‌ చిట్‌ఫండ్స్‌ (ఏఐఏసీఎఫ్‌) ప్రధాన కార్యదర్శి ఎ.చిత్రరసు తెలిపారు. మంగళవారం చెన్నై ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల

Published : 06 Jul 2022 03:43 IST

ఏఐఏసీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ఎ.చిత్రరసు

ఈనాడు, చెన్నై: చిట్‌ఫండ్‌ సేవలకు జీఎస్‌టీ (వస్తు,సేవల పన్ను) రేటును 12 నుంచి 18 శాతానికి పెంచితే ఖాతాదారులకు నష్టం జరుగుతుందని ఆలిండియా అసోసియేషన్‌ ఆఫ్‌ చిట్‌ఫండ్స్‌ (ఏఐఏసీఎఫ్‌) ప్రధాన కార్యదర్శి ఎ.చిత్రరసు తెలిపారు. మంగళవారం చెన్నై ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం బ్యాంకుల్లో లభించే వడ్డీపై జీఎస్‌టీ లేదని తెలిపారు. చిట్‌ఫండ్‌ సంస్థల్లో నెలవారీ పొదుపు చేసుకుంటూ, అవసరమైనప్పుడు పాడుకుని, ఆ నిధులను వినియోగించుకునే సామాన్యులే 90% ఉంటారని వివరించారు. చిట్‌ఫండ్‌ కంపెనీ కమీషన్‌పై వసూలు చేస్తున్న జీఎస్‌టీకి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) సదుపాయం ఉందని, అయితే ఖాతాదారుల్లో అత్యధికులు సామాన్యులైనందున, వారికి జీఎస్‌టీ నెంబరు ఉండదని, కనుక ఐటీసీ సదుపాయాన్ని వినియోగించుకోలేక నష్టపోతున్నారని చెప్పారు. ఒక చిట్‌ గ్రూప్‌లో కొంతమంది పొదుపు చేస్తుంటే, మరికొందరు పాడుకుని, చెల్లించే వారుంటారని గుర్తు చేశారు. అందువల్ల  జీఎస్‌టీ జాబితా నుంచి చిట్‌ఫండ్‌ సేవల్ని తొలగించడంతో పాటు, ఆర్థిక సేవలపై పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా నమోదిత చిట్‌ఫండ్‌ కంపెనీలు 20వేలకు పైగా ఉన్నాయని, 50 లక్షల మందికి పైగా ఖాతాదారులు వీటిల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఆయా సంస్థల్లో 2 లక్షల చిట్‌ గ్రూపులు కొనసాగుతున్నాయని వివరించారు. చిరు వ్యాపారులు, అంకుర సంస్థల నిర్వాహకులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, మధ్యతరగతి ప్రజలు చిట్‌ఫండ్‌ ఖాతాదారులుగా ఉన్నారన్నారు. వీరంతా తాజా నిర్ణయ ప్రభావానికి లోనయితే, ప్రైవేటు రుణదాతల నుంచి 36-60 శాతం వరకు వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులూ రావొచ్చని చెప్పారు. అందువల్ల జీఎస్‌టీ జాబితా నుంచి చిట్‌ఫండ్‌ సంస్థలను పరిహరించాలని అభ్యర్థించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉపాధ్యక్షుడు ఇ.శ్రీధర్‌, ఏఐఏసీఎఫ్‌ కోశాధికారి ఎ.ఆర్‌.ఉమాపతి, డీఎన్‌సీ చిట్స్‌ ఛైర్మన్‌ డి.సి.ఎలంగోవన్‌, శ్రీరామ్‌ చిట్స్‌ సీఈవో కె.ఆర్‌.సి.శేఖర్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని