రిసెప్షనిస్టు నుంచి ప్రపంచ శక్తిమంతురాలిగా..

శీతల పానీయాల దిగ్గజం కోకాకోలా..! కొన్ని దశాబ్దాలపాటు ఈ మార్కెట్‌ను ఏకఛత్రాధిపత్యంతో ఏలింది. ఎప్పటి నుంచో శీతల పానీయాల మార్కెట్‌లో ఉన్న పెప్సీ మాత్రం అనుకున్న స్థాయిలో ఎదగలేదు. ఈ క్రమంలో ఒక భారతీయురాలు ఆ సంస్థ దశ..దిశను మార్చేశారు. ఆమే ఇంద్రా నూయి..!

Published : 26 Dec 2020 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శీతల పానీయాల దిగ్గజం కోకాకోలా..! కొన్ని దశాబ్దాలపాటు ఈ మార్కెట్‌ను ఏకఛత్రాధిపత్యంతో ఏలింది. ఎప్పటి నుంచో శీతల పానీయాల మార్కెట్‌లో ఉన్న పెప్సీ మాత్రం అనుకున్న స్థాయిలో ఎదగలేదు. ఈ క్రమంలో ఒక భారతీయురాలు ఆ సంస్థ దశ..దిశను మార్చేశారు. ఆమే ఇంద్రా నూయి..! ఒకప్పుడు పార్చూన్, ఫోర్బ్స్‌ వంటి జాబితాల్లో నిలకడగా చోటు దక్కించుకొన్నారు. అకుంఠిత దీక్షతో అత్యున్నత శిఖ‌రాల‌ను అందుకున్న ఆమె ప్రపంచ నారీ లోకానికే ఓ విజ‌యం సంకేతం. కేవ‌లం ఓ విద్యార్థిగా అమెరికాలో అడుగుపెట్టి కార్పొరేట్ రంగంలో అపార కీర్తిని సొంతం చేసుకున్నారు.

క్రికెట్‌ అంటే ఇష్టం...

ఉక్కు మహిళ‌గా కార్పొరేట్ రంగం కొనియాడే నూయి పూర్తి పేరు ఇంద్రా కృష్ణమూర్తి నూయి. చెన్నైలోని హోలి ఏంజెల్స్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. మ‌ద్రాస్ క్రిస్టియ‌న్ కాలేజీ నుంచి బీఎస్సీలో పట్టా పొందారు. స్కూల్‌, కాలేజీల్లో నూయి కేవ‌లం చ‌దువుల‌కే ప‌రిమితం కాలేదు. ఆట‌పాటల్లో ముందుండేవారు. క్రికెట్ అంటే ఆమెకు చాలా ఇష్టం. బీఎస్సీ అనంత‌రం 1976లో కోల్‌క‌తా ఐఐఎం నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. ‘నెటూర్ బెడ్‌సెల్’ అనే వ‌స్త్ర త‌యారీ సంస్థలో ప్రొడ‌క్ట్ మేనేజ‌ర్‌గా ఉద్యోగం ల‌భించింది. 

ఆదిలోనే సవాల్‌...

ఆ త‌ర్వాత ముంబ‌యిలోని ‘జాన్సన్ అండ్ జాన్సన్‌’ బహుళ‌జాతి సంస్థలో ఉన్నత ఉద్యోగం సంపాదించారు. అక్కడే ఉద్యోగంలో తొలి స‌వాల్‌ ఎదురైంది. సంప్రదాయాల‌కు పెద్దపీట వేసే భార‌త మార్కెట్లోకి మ‌హిళ‌లు ఉప‌యోగించే శానిట‌రీ న్యాప్‌కిన్లను ప్రవేశ‌పెట్టే గురుత‌ర బాధ్యతను నూయికి అప్పగించారు. అప్పటికి మ‌న‌దేశంలో ఆ వ‌స్తువు పేరు కూడా ఎవ‌రికీ అంత‌గా తెలియ‌దు. పైగా కట్టుబాట్ల సుడిగుండంలో ఉన్న భారత్‌లో వాటిని ప్రచారం చేయ‌డ‌మూ క‌ష్టమే. అయినా నూయి అధైర్యప‌డ‌లేదు. స్కూళ్లు, కాలేజీల‌కు వెళ్లి నేరుగా యువ‌తుల‌కే వాటి ఉపయోగాన్ని వివ‌రించారు. ఈ ఆలోచ‌నే నూయిని ముంద‌డుగు వేయించింది. అలా నెమ్మదిగా ప్రారంభ‌మైన అవ‌గాహ‌న కార్యక్రమం విశేష ప్రచార స్థాయికి ఎదిగింది. 

అలా అమెరికాకు...

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ రోజు ప‌త్రిక‌లు తిర‌గేస్తుండ‌గా.. అమెరికాలోని యేల్ విశ్వవిద్యాల‌యం గురించి వచ్చిన క‌థనాన్ని చదివారు. అమెరికాలోని మిత్రుల ప్రోత్సాహం ల‌భించడంతో అదే విశ్వవిద్యాలయంలో ‘పబ్లిక్ అండ్ ప్రైవేట్ మేనేజ్‌మెంట్’ పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోర్సులో ప్రవేశం దొరికింది. 1976లో త‌ల్లిదండ్రుల అండ‌తో అమెరికాలో అడుగుపెట్టింది నూయి. అప్పటికే నూయి ఉద్యోగం చేసినా.. కోర్స్‌కు అవసరమైన డబ్బులు లేవు. దీంతో విశ్వవిద్యాల‌యంలో చేరిన మొద‌ట్లో రాత్రిపూట రిసెప్షనిస్టుగా ప‌నిచేయాల్సి వ‌చ్చింది. పాశ్చాత్యులు ధ‌రించే సూటు లేదు. అయితేనేం తాత్కాలిక ఉద్యోగాల స‌మ‌యంలో చీర‌ ధరించే విధులకు వెళ్లేవారు. అక్కడ భార‌తీయుల సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచేవారు. గ్రూప్‌ డిస్కషన్లు, నిత్య ప‌రిశీల‌నా యాత్రల్లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వ్యాపార నిర్వహ‌ణ‌లో అతిముఖ్యమైన క‌మ్యూనికేష‌న్ నైపుణ్యాలు యేల్‌లోనే నూయికి అల‌వ‌డ్డాయి. కార్పొరేట్ ప్రాజెక్టుల‌పై బృందంగా ప‌నిచేస్తూ స‌మ‌స్యల్ని విశ్లేషించే సామ‌ర్థ్యాల్ని పుణికిపుచ్చుకున్నారు. 1980లో రెండో మాస్టర్ డిగ్రీ సొంత‌మైంది. 

తొలి ఉద్యోగ ప్రయత్నంలో విఫలం...

యేల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక అమెరికాలో తొలి ఉద్యోగ ప్రయ‌త్నంలో నూయి విఫ‌ల‌మ‌య్యారు. ఆమె సంస్కృతికి నిలువెత్తు నిద‌ర్శనం. ఆచార వ్య‌వ‌హారాలు, న‌మ్మకాల‌పై ఎన‌లేని విశ్వాసాన్ని ప‌రాయి దేశంలోనూ పాటించ‌డం మాన‌లేదు. ఓ ప్రొఫెసర్‌ సలహాతో తనకు బాగా నప్పిన చీర క‌ట్టులోనే రెండో ఇంట‌ర్వ్యూకి వెళ్లారు. అక్కడ విజ‌యం సాధించారు. బోస్టన్ క‌న్సల్టింగ్ గ్రూప్‌లో డైరెక్టరుగా అమెరికాలో తొలి ఉద్యోగం చేప‌ట్టారు. 1986 మోటోరోలా కంపెనీ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను అందుకొన్నారు. ఆ సంస్థ కార్పొరేట్ వ్యూహ ప్రణాళిక‌ బృందానికి డైరెక్టరుగా వ్యవ‌హ‌రించారు. త‌ర్వాతి మ‌జిలీ ఆసియాన్ బ్రౌన్ బ్రోవెరీ అనే బ‌హుళ‌జాతి సంస్థలో సీనియ‌ర్ ఉపాధ్యక్షురాలిగా చేరారు. అందులో విడివిడిగా న‌డుస్తున్న వ్యాపారాల‌ను ఏకీకృతం చేసే బాధ్యత‌ను స‌మ‌ర్థంగా నిర్వర్తించారు. క్రమంగా ఆమె దీక్షాద‌క్షత‌లు అమెరికా కార్పొరేట్ రంగం అంతా వ్యాపించ‌డం ఆరంభ‌మైంది.

పెప్సీలో చేరికతో తిరుగులేని ఖ్యాతి... 

1994 నాటికే మేనేజ్‌మెంట్‌ రంగంలో తిరుగులేని శ‌క్తిగా నూయికి ఎన‌లేని ఖ్యాతి ల‌భించింది. అనేక దేశాల్లో ఆహార ప‌దార్థాల్ని ప్యాక్ చేసి అమ్మే దాదాపు అన్ని కంపెనీలు ఆమెను సీఈఓగా తీసుకోవ‌డానికి పోటీపడ్డాయంటే అతిశ‌యోక్తి కాదు. ఆ స‌మ‌యంలోనే ప్రముఖ కంపెనీ జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్(జీఈ) నుంచి ఆహ్వానం అందింది. అయితే, అప్పటి పెప్సీ సీఈఓ మాత్రం ఆమెను త‌మ కంపెనీలోకి తీసుకోవాల‌ని గ‌ట్టిగా భావించారు. వెంట‌నే ఓ ప్రతిపాద‌న‌ను ఆమె ముందుంచారు. ‘పెప్సీలో మీకొక ప్రత్యేక స్థానం క‌ల్పిస్తాం’ అని వారు హామీ ఇవ్వడం నూయిని ముగ్ధురాల్ని చేసింది. ఆ మాటల్లో నిజాయ‌తీ పెప్సీలో చేరేలా పురిగొల్పింది. 1994 కార్పొరేట్ స్ట్రాట‌జీ డెవ‌ల‌ప్‌మెంట్ ఉపాధ్యక్షురాలిగా పెప్సీలో అడుగుపెట్టారు. పెప్సీలో చేర‌డం ఒక ఎత్తయితే.. అందులో నెగ్గుకురావ‌డం మ‌రో ఎత్తు. ఒక మ‌హిళ‌.. అందులోనూ విదేశీయురాలు అక్కడ రాణించ‌డం అంటే మాట‌లు కాదు. అందుకు ఆమె పాటించిన సూత్రం ఒక్కటే. పురుషుల క‌న్నా ఎక్కువ‌గా క‌ష్టప‌డ‌టం.. కాలం గురించి  ప‌ట్టించుకోక‌పోవ‌డం.. చేప‌ట్టిన ప‌నిని పూర్తిచేసే వ‌ర‌కు వ‌దిలిపెట్టక‌పోవ‌డం. ఈ ల‌క్షణాలే ఆమెను ఉన్నత శిఖ‌రాల‌కు చేర్చాయి. ఫ‌లితంగా కంపెనీ వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగింది. ఎంత ప‌ని ఒత్తిడిలో ఉన్నా.. తోటి వారిని ఉత్సాహ‌ప‌రిచే ల‌క్షణం ఆమె సొంతం. స‌మ‌ర్థ నాయ‌కురాలిగా ప్రపంచవ్యాప్తంగా అనుస‌రించాల్సిన వ్యూహాల్ని తీర్చిదిద్దుతూ కంపెనీ పునర్నిర్మాణంలో మ‌మేకం అయ్యేవారు. 

దూరదృష్టితో కొత్త ఉత్పత్తుల జోడింపు

ఆయా ప్రాంతాల అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తుల్ని త‌యారుచేయ‌డ‌మే కాదు.. ప్రజ‌ల ఆరోగ్యాన్ని కాపాడాల‌ని నూయి ఆకాంక్షించారు. సుస్థిర‌త సాధించ‌డానికి ఇదే గ‌ట్టి మూలం అని ఆమె న‌మ్మకం. అందుకే మున్ముందు ఆరోగ్యక‌ర ఆహారం వైపు స‌మాజం మొగ్గుచూపుతుంద‌ని ఆనాడే ప‌సిగ‌ట్టారు. పెప్సీ ప్రధాన అమ్మకాలైన కూల్‌డ్రింకులు, ఫ్రైలవంటి తినుబండారాల అమ్మకాలు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని ఆమె  అంచ‌నా వేశారు. అది ఆమె దూర‌దృష్టికి తార్కాణం. అందుకే పెప్సీని కొత్త ఉత్పత్తుల‌వైపు మళ్లించారు. 1988లో ప‌ళ్ల ర‌సాలను త‌యారుచేసే ట్రాపికోనాను ద‌క్కించుకోవ‌డం ఈ వ్యూహంలోని భాగ‌మే. దీనికి 303 కోట్ల డాల‌ర్ల‌ను వెచ్చించ‌డం అప్పట్లో చాలా మంది ఉద్యోగుల‌కు న‌చ్చలేదు. అయితే, భ‌విష్యత్తుపై విశ్వాసంతో నూయి ప‌ట్టువ‌ద‌ల్లేదు. ఏడాది తిరిగేస‌రికి లాభాలు వ‌చ్చాయి. 2000 సంవ‌త్సరంలో ఆమె క‌న‌బ‌రిచిన అద్వితీయ నైపుణ్యానికి గుర్తింపే సీఎఫ్‌వోగా ప‌దోన్నతి. అమెరికా కార్పొరేట్ రంగంలో ఓ భార‌తీయ మ‌హిళ‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వం ఇది. ఇక ఏడాది తిరిగే స‌రికి అధ్యక్షురాలిగానూ ఎద‌గ‌డం మ‌రో సంచ‌ల‌నం. అదే స‌మ‌యంలో క్వాక‌ర్ ఓట్స్ కంపెనీని విలీనం చేసుకోవ‌డంలో నూయి చూపించిన తెగువ ఎన‌లేనిది. ఆ స‌మ‌యంలో రెండు కంపెనీల మ‌ధ్య త‌లెత్తిన వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించి తన నాయకత్వ లక్షణాల్ని మరోసారి నిరూపించుకున్నారు. 

సీఈఓగా.. విలక్షణ నాయకత్వం..

నూయి జీవితంలో 2006 మ‌ర‌చిపోలేని సంవత్సరం. అదే ఏడాది కంపెనీ సీఈఓగా బాధ్యత‌ల్ని అందుకున్నారు. అలా ఆమె పెప్సీ చ‌రిత్రలో తొలి మహిళా సీఈఓగా రికార్డు సృష్టించారు. మ‌రో ఏడాదిలో పెప్సీ బోర్డు అధ్యక్షురాలిగా ఎదిగి ప్రపంచ కార్పొరేట్ రంగంలో నూత‌న అధ్యాయాన్ని లిఖించారు. 2006లో పెప్సీ నిక‌ర ఆదాయం రెట్టింపైంది. ఇది నూయి ప్రతిభ‌కు తిరుగులేని నిద‌ర్శనం. అయితే ఏనాడూ త‌న ఘ‌న‌త‌గా భావించ‌లేదు ఆమె. మంచి ఉద్యోగులు ల‌భించ‌డం పెప్సీ అదృష్టంగా అభివర్ణిస్తుంటారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అంత‌ర్జాతీయంగా విల‌క్షణ నాయ‌కురాలిగా పేరు తెచ్చుకున్నారు. వివిధ సంస్థలు కూడా ఆమె ప్రతిభ‌ను గుర్తించి గౌర‌వించాయి. అమెరికా-భార‌త వాణిజ్య మండ‌లి స‌భ్యురాలిగానూ త‌న సత్తా చాటుకున్నారు. 

కుటుంబానికి ప్రాధాన్యం...

న‌మ్మకం, స్నేహితులు, కుటుంబం ఈ మూడు త‌న విజ‌యానికి బాట‌లు వేశాయ‌ని ఇంద్రా నూయి చెబుతారు. ఆమెపై చిన్నప్పటి నుంచి త‌ల్లి ప్రభావ‌మే అధికం. తండ్రి బ్యాంకు ప‌నుల్లో నిమ‌గ్నమైతే త‌ల్లి ఇంటి వ్యవహారాలన్నీ చ‌క్కదిద్దేది. నూయి రాజ్‌కిష‌న్‌ని వివాహం చేసుకొన్నారు.  వారి అన్యోన్య జీవితంలో ఏనాడూ ఉద్యోగ హోదాలు అడ్డురాలేదు. పిల్లలు ప్రీతి, తారల అవ‌స‌రాల‌తోపాటు.. తన ఆఫీసు వ్యవ‌హారాల‌ను స‌మ‌న్వయంతో నెగ్గుకురావ‌డంలో నూయి ఎన్నడూ త‌డ‌బ‌డ‌లేదు. ఉన్నతాధికారిగా కంపెనీ ఉద్యోగుల బాగోగులు కూడా చూసుకొన్నారు.

‘‘జీవితంలో కుటుంబ బాధ్యతలను నెర‌వేర్చడ‌మే అన్నింటిక‌న్నా ముఖ్యం. త‌ను సాధించుకున్న విజ‌యాలు, అందుకున్న అందలాలు అన్నీ దాని త‌ర్వాతే’’ అని ఆమె తల్లి నూయికి చెప్పిన మాటల్ని అక్షరాలా ఆచరించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. కుటుంబ ప్రాధాన్యం ముఖ్యమ‌ని.. సాధించిన విజ‌యానికి అప్పుడే పూర్తి సార్థకత చేకూరుతుంద‌ని ఇంద్రా తెలుసుకొన్నారు. ‘‘నా భ‌ర్త రాజ్‌తో నేను అన్ని విష‌యాలు చ‌ర్చిస్తాను. తాను అన్ని విధాలుగా ఆలోచించి నాకు మంచి స‌ల‌హాలు ఇస్తారు’’ అని నూయి చెప్పడం వారి ప్రేమానుబంధానికి మ‌చ్చుతున‌క‌. ఆమె ఉద్యోగ జీవితం మ‌హిళా లోకానికి ఓ చ‌క్కటి పాఠం. ఆమె కృషిని గుర్తించిన భార‌త ప్రభుత్వం ప‌ద్మభూష‌ణ్‌తో స‌త్కరించింది.

చెన్నై న‌గ‌రంలో ఓ మ‌ధ్యత‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టిన నూయి కార్పొరేట్ రంగానికే వ‌న్నె తెచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెప్సీ కంపెనీ సీఈఓ పీఠాన్ని అధిరోహించారు. అత్యంత శ‌క్తిమంతురాలిగా అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో ప‌తాక శీర్షిక‌ల్లో నిలిచారు. ఇలాంటి మైలురాళ్లను సునాయసంగా సాధించిన ఇంద్రా నూయి కార్పొరేట్‌ రంగంలో ధ్రువతారగా నిలిచిపోయారంటే అతిశయోక్తి కాదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని