Published : 26 Dec 2020 16:34 IST

వీరి తపనే నేడు 2.28లక్షల మందికి ఉపాధి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్తది సృజించాలన్న తపన అన్నింటి కంటే చాలా గొప్పది. సంకల్పం బలంగా ఉంటే పరిస్థితులు కూడా సహకరిస్తాయన్నది వేదాంతం. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ఏడుగురు యువకుల తపనకు ఈ సంస్థ ఓ తార్కాణం. వారి టీం వర్క్‌కి నిదర్శనం. అందరికి అందరూ ప్రావీణ్యులే అయినా.. అభిప్రాయ భేదాలకు ఏమాత్రం తావివ్వలేదు. కొత్త ఉత్పత్తులను సృష్టించి మనిషి జీవితానికి విలువ జోడించాలన్న వారి సదుద్దేశం నేడు విరగబూసి ఫలితాలిస్తోంది. బృందంగా పనిచేస్తే ఫలితం రెట్టింపవుతుందన్న సూత్రానికి ఇన్ఫీ వ్యవస్థాపకుల జీవితాలే ఉదాహరణ..

కంపెనీలో సహచరులే...

అప్పటికే రెండు, మూడు ఉద్యోగాలు చేసి మానేసిన నారాయణమూర్తి.. కార్పొరేట్‌ ప్రపంచంలో అనుభవం కోసం ముంబయిలోని ప్యాట్నీ కంప్యూటర్‌ సిస్టమ్స్‌లో చేరారు. అక్కడే ఆయన సంపదను ఎలా సృష్టించాలి.. తద్వారా నిరుద్యోగ సమస్యను ఎలా రూపుమాపాలో అవగతం చేసుకున్నారు. ఎలాగైనా కొత్తది ఎదో తయారు చేయాలని తపించారు. దానికి అందులోనే పనిచేస్తున్న మరికొంత మంది చురుకైన సహచరులు తోడయ్యారు. వారే నందన్‌ నిలేకని, ఎస్‌.గోపాలకృష్ణన్‌, ఎస్‌.డి.శిబులాల్‌, కె.దినేశ్‌, ఎన్‌.ఎస్‌. రాఘవన్‌, అశోక్‌ అరోరా. మూర్తి తన ఆలోచనని వారితో పంచుకున్నారు. అప్పటికి వారు కూడా అదే తలంపుతో ఉండడంతో మూర్తి ప్రతిపాదనకు ఓకే చెప్పేశారు. 

పెద్ద సాహసమే..

మొత్తానికి ఈ ఏడుగురు యువకులు వారికున్న సౌకర్యవంతమైన ఉద్యోగాల్ని వదిలేసి పెద్ద సాహసమే చేశారు. కొత్తది సృజించాలి.. విలువ జోడించాలన్న వారి తపనే వారిని ముందుకు నడిపించింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. వారి సంకల్ప బలం ముందు సమస్యలు సైతం తలవంచాయి. తొలుత వారి సతీమణుల నుంచి తీసుకున్న సొమ్మునే పెట్టుబడిగా పెట్టారు. రాఘవన్ ఇంటి చిరునామాతో 1981లో కంపెనీని రిజిస్టర్‌ చేయించినా.. మూర్తి ఇళ్లే వారి కార్యస్థలంగా మార్చారు. కొంతకాలం గడిచాక వీరి ఆసక్తిని గమనించిన హెచ్‌డీఎఫ్‌సీ రుణసాయం చేయడానికి ముందుకు వచ్చింది. దీంతో మౌలికవసతుల ఏర్పాటుకు కావాల్సిన పెట్టుబడి సమకూరింది. 

మూర్తి నాలుగో ఉద్యోగి...

ఇన్ఫీ అనగానే చాలా మందికి గుర్తొచ్చే పేరు నారాయణమూర్తి. కానీ, నిజానికి కంపెనీలో చేరిన నాలుగో వ్యక్తి ఆయన. ఆయనకంటే ముందే రాఘవన్‌ సహా ముగ్గురు కంపెనీలో చేరి కార్యకలాపాల్ని ప్రారంభించారు. తొలి కంప్యూటర్‌ని సమకూర్చుకోవడానికి వీరికి దాదాపు రెండేళ్లు పట్టింది. దాన్ని పొందడానికి మూర్తి అప్పట్లో పెద్ద యజ్ఞమే చేశారు. అప్పట్లో ఉన్న కఠిన నిబంధనల వల్ల మూర్తి దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చివరకు డేటా జనరల్‌ 32-బిట్‌ ఎంవీ8000 మోడల్‌ కంప్యూటర్‌ని సాధించగలిగారు. ఇక ఇప్పుడు క్లయింట్‌ని తెచ్చుకోవడం వారికి కత్తి సామే అయింది. మళ్లీ మూర్తి రంగంలోకి దిగారు. ఏకంగా అమెరికాకే మకాం మార్చారు. ఎట్టకేలకు డేటాబేసిక్స్‌ నుంచి తొలి ప్రాజెక్టుని సంపాధించారు. ఈలోపు ఇక్కడ సంస్థ బాలారిష్టాల్ని అధిగమించడంలో మిగతా ఆరుగురు చేసిన కృషి ఫలించింది. ప్రాజెక్టు రాగానే వాటికి కార్యరూపం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 

తొలి బ్రేక్‌...

లైసెన్స్‌ రాజ్‌ వ్యవస్థ, ప్రాజెక్టులు సాధించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండడంతో కొంత మంది సహచరులు కంపెనీని అమ్మేద్దామన్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. కానీ, మూర్తి దానికి ససేమిరా అన్నారు. మళ్లీ మిగతా సభ్యులు తమ బృంద స్ఫూర్తిని చాటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కంపెనీని నిలిపి గెలుపుతానన్న మూర్తి స్థైర్యానికి తోడుగా నిలిచారు. కానీ, ఏడుగురిలో ఒకరైన అశోక్‌ అరోరా మాత్రం బయటకు వెళ్లడానికే నిశ్చయించుకున్నారు. అయినా మిగతా సభ్యులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు.

సంస్థ కోసం తమ జీతాలకే కోత..

సాఫ్ట్‌వేర్‌ రంగంలో వస్తున్న మూర్పులకు అనుగుణంగా సంస్థ ఉద్యోగుల్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంతగా లాభాలు లేని సంస్థకు ఇది పెద్ద భారమే. దీంతో తమ జీతాల్లో కొత విధించుకొని మరీ ఉద్యోగులకు శిక్షణ ఇప్పించడానికి సిద్ధపడ్డారు ఇన్ఫీ పెద్దలు. మెంటార్‌షిప్‌ ప్రోగ్రాంలు స్థాపించి ఉద్యోగుల శిక్షణలో కొత్త ఒరవడి సృష్టించారు. మూర్తి ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత నిలేకని, గోపాలకృష్ణన్‌, శిబులాల్‌ ఆ పదవిలో ఒదిగిపోయి మెరుగైన బాటలు వేశారు. 

ప్రపంచంలోనే మేటి ఐటీ సంస్థల్లో నేడు ఇన్ఫోసిస్‌ ఒకటి. ఈ స్థాయికి రావడంలో మూర్తి నాయకత్వం ఎంత తోడ్పడిందో ఆయన సహచరుల అండ అంతే బలాన్నిచ్చింది. వారి సంకల్పమే నేడు భారత ఐటీ పరిశ్రమకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా నేడు 2.2లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. మదుపర్లుగా మారి పెట్టుబడులు పెట్టిన ఎంతో మందికి ధనాన్ని ఆర్జించి పెడుతోంది. అమెరికా గడ్డపైనా పాగా వేసి భారత ఐటీ నిపుణతను చాటుతోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts