పిన్‌ లేకుండా రూ.5వేల లావాదేవీ.. సురక్షితమేనా?

డిజిటల్‌ చెల్లింపుల విషయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో

Published : 26 Dec 2020 17:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డిజిటల్‌ చెల్లింపుల విషయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరింత భద్రమైన, సురక్షితమైన డిజిటల్‌ లావాదేవీలను అందించడంలో భాగంగా కాంటాక్ట్‌లెస్‌ కార్డ్‌ లావాదేవీలు, ఇ-మాండేట్‌ల పరిమితిని పెంచింది. ప్రస్తుతం రూ.2000 వరకు చెల్లింపులు, లావాదేవీలను పిన్‌ నంబరు అవసరం లేకుండా జరుపుకొనే అవకాశం ఉండగా.. ఇప్పుడు ఆ పరిమితిని రూ. 5000 వరకు పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. 2021 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి  రానుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం సురక్షితమైనదేనా? పొరపాట్లు జరగకుండా వినియోగదారులు ఎలా వ్యవహరించాలి?

ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక రంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. దీని ద్వారా నగదు రహిత లావాదేవీలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. కిరాణా దుకాణాలు, మాల్స్‌, వివిధ కోర్సుల ఫీజులు చెల్లించే సమయంలో కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులు కచ్చితంగా పెరుగుతాయని చెబుతున్నారు. అయితే, ఇదే సమయంలో కొన్ని విషయాలను వినియోగదారులు గుర్తు పెట్టుకోవాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా తొలిసారి ఇలాంటి లావాదేవీలు నిర్వహించే వారు జాగ్రత్తగా లేకపోతే సైబర్‌ మాయగాళ్ల వలలో చిక్కుకుంటారని హెచ్చరిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు సురక్షితంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారో, అదే విధంగా మొబైల్‌ ఫోన్లు, ఆన్‌లైన్‌ వాలెట్‌లు, ఆర్థిక సంబంధమైన అప్లికేషన్ల విషయంలో అలాంటి జాగ్రత్తలే పాటించాలని చెబుతున్నారు. పాస్‌వర్డ్‌లు సైతం బలంగా ఉండాలని, లేకపోతే ఇతరులు సులభంగా  వినియోగించే అవకాశం ఉందని అంటున్నారు.

కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

* మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన కార్డును సురక్షితంగా ఉంచుకోవాలి.

* తెలియని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కార్డు ఇవ్వొద్దు.

* మొబైల్‌ ఫోన్‌లలో ఎన్‌ఎఫ్‌సీ, ఎంఎస్‌టీ ఆధారిత అప్లికేషన్లు మాత్రమే వాడాలి. మొబైల్‌ ఫోన్‌ వినియోగించాలంటే, కచ్చితంగా పాస్‌వర్డ్‌ లేదా ఫింగర్‌ప్రింట్‌ కావాల్సి ఉంటుంది.

* కార్డు పోగుట్టుకున్నట్లు నిర్ధారణకు వచ్చిన వెంటనే సదరు బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రానికి ఫోన్‌ చేసి ఆ కార్డును బ్లాక్‌ చేయించాలి.

* మీ ఖాతాకు సంబంధించిన వివరాలను సంబంధితశాఖకు వెళ్లి ఎప్పటికప్పుడు అప్‌చేయించుకోవాలి.

* యూపీఐ ఐడీని కానీ, పిన్‌ను కానీ, ఎవరితోనూ పంచుకోవద్దు.

* పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ వద్ద లావాదేవీ ముగిసిన వెంటనే మీ కార్డును భద్రపరుచుకోండి.

* కిరాణా దుకాణాలు/మాల్స్‌ వద్ద నిదానంగా లావాదేవీలు జరపండి.

*అన్ని వస్తువులతో పాటు, కార్డును కూడా తీసుకున్నారో లేదా ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని