నేటి నుంచి.. అమల్లోకి...

కొత్త ఏడాది మొదటి రోజు నుంచి బ్యాంకింగ్‌ లావాదేవీల్లోనూ, బీమా, పెట్టుబడుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. అవేమిటి..

Updated : 01 Jan 2021 04:55 IST

కొత్త ఏడాది మొదటి రోజు నుంచి బ్యాంకింగ్‌ లావాదేవీల్లోనూ, బీమా, పెట్టుబడుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. అవేమిటి.. అవి మనపై ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందామా!


చెక్కులు మరింత భద్రంగా..

బ్యాంకింగ్‌ మోసాలను తగ్గించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే చెక్కు ద్వారా జరిగే క్లియరింగ్‌ చెల్లింపుల కోసం జనవరి 1, 2021 నుంచి పాజిటివ్‌ పే మెకానిజం ప్రకటించింది. దీని ప్రకారం రూ.50వేలకు మించిన చెక్కు చెల్లింపులకు కీలక వివరాలను రెండోసారి ధ్రువీకరించడం తప్పనిసరి. ఖాతాదారులు వారు ఇచ్చిన చెక్కు తేదీ, చెక్కు మొత్తం, లబ్దిదారుడి వివరాలు మొదలైనవి బ్యాంకులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇది ఖాతాదారుల భద్రతను మరింత పెంచడమే కాకుండా మోసపూరిత లావాదేవీలను నివారించడంలో ఉపయోగపడుతుంది. రూ.50వేలకు మించి చెక్కులు జారీ చేసే ఖాతాదారులకు ఆప్షనల్‌గానూ, రూ.5లక్షల కంటే ఎక్కువ మొత్తానికి చెక్కుల విషయంలో తప్పనిసరిగానూ బ్యాంకులు ఈ నిబంధన అమలు చేయాల్సి ఉంటుంది.


పిన్‌ అవసరం లేకుండానే..

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కాంటాక్ట్‌లెస్‌ కార్డుల లావాదేవీల పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2వేల నుంచి రూ.5వేలకు ఆర్‌బీఐ పెంచింది. కార్డులు, యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్ఫేస్‌ (యూపీఐ) ద్వారా పునరావృతమయ్యే లావాదేవీలకూ ఈ పరిమితి వర్తిస్తుంది. కాంటాక్ట్‌లెస్‌ కార్డు చెల్లింపులు పిన్‌ అవసరం లేకుండా చేయొచ్చు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో సురక్షితమైన పద్ధతిలో చెల్లింపులు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.


ప్రామాణిక సరళ్‌ జీవన్‌ బీమా..

ఎక్కువ మందిని జీవిత బీమా పరిధిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఐఆర్‌డీఏఐ ఆదేశాల ప్రకారం అన్ని జీవిత బీమా సంస్థలు ఒక ప్రామాణిక టర్మ్‌ బీమా పాలసీ ‘సరళ్‌ జీవన్‌ బీమా’తో ముందుకు వస్తున్నాయి. సాధారణంగా ఆదాయాన్ని బట్టి, టర్మ్‌ పాలసీ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఈ ప్రామాణిక పాలసీలో.. ఆదాయాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా.. రూ.5లక్షల నుంచి రూ.25లక్షల వరకూ బీమా చేసుకునే అవకాశం కల్పిస్తుంది. సరళ్‌ జీవన్‌ బీమా టర్మ్‌ పాలసీ కాబట్టి, తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉంటుంది. డిజిటల్‌ విధానంలో (ఆన్‌లైన్‌) కొనుగోలు చేసేవారికి 20 శాతం వరకూ ప్రీమియంలో రాయితీ ఉండవచ్చు. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఇందులో చేరొచ్చు. పాలసీ మెచ్యూరిటీ వయసు 70 ఏళ్లు. అన్ని బీమా సంస్థల్లోనూ ఒకే రకమైన షరతులు, మినహాయింపులతో ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది.

- ఫణి శ్రీనివాసు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని