Updated : 04 Jan 2021 18:09 IST

కొత్త ఏడాదిలో.. ఆర్థిక విజయోస్తు!

కొత్త సంవత్సరం.. గతేడాది మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి.. ఈసారైనా.. అన్నీ శుభాలే జరగాలని అందరూ కోరుకుంటున్నారు. కొన్ని కోరికలు.. మరికొన్ని కఠిన నిర్ణయాలు.. ఇలా కొత్త ఏడాది తొలి రోజున అనుకునేవి ఎన్నో.. ఈ 2021లో ఆర్థికంగా మనం విజయ తీరాల్ని చేరాలంటే.. తప్పనిసరిగా పాటించాల్సిన సూత్రాలేమిటి? నిపుణులు ఏం సూచిస్తున్నారు.. చూద్దాం పదండి..

ట్రేడింగ్‌ చేస్తున్నారా?

చాలామంది కొత్త మదుపరులు 2020లో స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసేందుకు ఆసక్తి చూపించారు. వీరి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. డిజిటల్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాంలు పెరగడంతో వారు సులభంగా మదుపు చేయడం ప్రారంభించారు. ఇలాంటి వారందరూ ముందుగా కాగితంపైన ట్రేడింగ్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక షేరును ఏ ధరకు కొంటారు... ఏ ధరకు అమ్ముతారు అనేది రాసుకొని చూసుకోవాలి. చివరకు లాభనష్టాలను చూసుకోవాలి. అనుభవం, నమ్మకం వచ్చాకే వాస్తవంగా ట్రేడింగ్‌ చేయాలి. మార్కెట్లో ట్రేడింగ్‌ చేయాలి. పూర్తి ఆర్థిక ప్రణాళికతో, నష్టభయం ఎంత మేరకు తట్టుకోగలరు అనేది చూసుకున్నాకే ఇందులోకి ప్రవేశించాలి. కొత్త ఏడాదిలో ముందుగా మీ ఆర్థిక ప్రణాళికలపైన దృష్టి పెట్టండి. అప్పు చేసి.. ట్రేడింగ్‌ చేయాలనే ఆలోచన వద్దు.

- రవి కుమార్‌, సీఈఓ, అప్‌స్టాక్స్‌


తొందరగా.. క్రమం తప్పకుండా...

సంపద సృష్టించాలంటే.. పెట్టుబడిని వీలైనంత తొందరగా ప్రారంభించాలి. క్రమశిక్షణతో దీర్ఘకాలం కొనసాగించాలి. ఎంత త్వరగా మదుపు చేస్తే.. అంత వేగంగా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మీ సంపాదన గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడే సమీప ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు, దీర్ఘకాలంలో పదవీ విరమణను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టాలి.

- ధీరజ్‌ సెహగల్‌, చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌


ఆరోగ్య రక్ష

కరోనా మహమ్మారి ఆరోగ్య బీమా అవసరం గురించి తెలియజేసింది. ప్రస్తుతం వైద్య ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. అనారోగ్యం.. ఆర్థిక ఇబ్బందులకు దారి తీయకూడదు. ఆరోగ్య బీమా లేకపోతే మీ కష్టార్జితం కరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి, పూర్తిస్థాయి ఆరోగ్య బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోండి. ఇది పన్ను మినహాయింపు కోసమూ ఉపయోగపడుతుంది. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు పాత పాలసీలూ రూపు మారుతున్నాయి. కొత్త ప్రయోజనాలతో లభిస్తున్నాయి. ఫోన్‌లో డాక్టర్‌ను సంప్రదించడం, టెలీ మెడిసిన్‌లాంటి వాటి విషయాల్లోనూ బీమా సంస్థలు తోడ్పాటును అందిస్తున్నాయి.

- సంజయ్‌ దత్తా, చీఫ్‌ అండర్‌రైటింగ్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌


* సాధారణ ఆరోగ్య బీమా పాలసీలతోపాటు, ప్రత్యేకంగా కరోనా చికిత్స కోసం పాలసీలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అధిక మొత్తానికి కొత్త పాలసీ తీసుకోవాలంటే.. ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు. ఇలాంటప్పుడు సూపర్‌ టాపప్‌ పాలసీలను ఎంచుకోవడం మంచిది. ఇప్పటికే మీకు ఆరోగ్య బీమా ఉంటే.. దాన్ని పెంచుకునేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొన్ని సూపర్‌ టాపప్‌ పాలసీలు.. హామీతో కూడిన కొనసాగింపు ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. యాజమాన్యం అందించే బృంద బీమా పాలసీ ఉన్నవారు.. ఉద్యోగం మానేసినప్పుడు లేదా మారినప్పుడు.. ఈ పాలసీ వల్ల ప్రయోజనం ఉంటుంది.

- శశాంక్‌ ఛఫేకర్‌, చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌,  మణిపాల్‌సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌


* ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా కీలకం. కుటుంబం అంతటికీ వర్తించేలా పాలసీ ఉండటం ఎప్పుడూ అవసరం. ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకూ ఆరోగ్య బీమా రక్షణ ఉండాలనే విషయాన్ని మర్చిపోవద్దు. హాస్పిటల్‌ క్యాష్‌ బెనిఫిట్‌, ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడం, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బెనిఫిట్‌లాంటి వన్నీ మీ ఆరోగ్య బీమా పాలసీలో ఉండేలా చూసుకోండి. పాలసీ తీసుకునేటప్పుడు నియమ నిబంధనలు, మినహాయింపులు ఒకటికి రెండుసార్లు చదివి, అర్థం చేసుకోండి.

- ఆనంద్‌ రాయ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలీడ్‌ ఇన్సూరెన్స్‌.


మోసాల బారిన పడకండి..

మీ కష్టార్జితాన్ని కాజేసేందుకు ఎంతోమంది కాచుకొని కూచున్నారు. డిజిటల్‌ లావాదేవీలు పెరగడంతో.. సైబర్‌ నేరాల సంఖ్యా అదే రీతిలో అధికమవుతోంది. కేవైసీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు చేస్తున్న మోసాలకు అడ్డు లేకుండా పోతోంది. అధునాతన సాంకేతికతలపై పట్టున్న వారూ ఈ కేవైసీ మోసాలకు బలైపోతున్నారు. బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామంటే చాలు.. వాళ్లు అడిగిన అన్ని వివరాలూ చేప్పేస్తున్నారు. చెప్పకపోతే నష్టపోతారని.. లేదా ఏదో లాభాలను చెబితే.. భయపడి.. ఆశపడి.. ఖాతాకు సంబంధించిన రహస్యాలన్నీ మోసగాళ్లకు అప్పగించేయడం సరికాదు. కొత్త ఏడాదిలో ఇలాంటి మోసాలు మరిన్ని పెరిగే అవకాశం లేకపోలేదు. అందుకే, అప్రమత్తత ఎంతో అవసరం. గుర్తుంచుకోండి.. బ్యాంకు నుంచి ఫోను చేస్తున్నాం.. అంటే అది మోసమే.. ఏ బ్యాంకు మీకు ఫోన్‌ చేసి.. మీ వివరాలు కావాలని అడగదు.

- భారత్‌ పంచాల్‌, చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌ ఫర్‌ ఇండియా, ఎఫ్‌ఐఎస్‌


పాఠాలు మరవొద్దు..

కొవిడ్‌-19 మనకు అనేక డబ్బు పాఠాలు నేర్పింది. అవి అందరికీ ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చినవే. కొత్త ఏడాదిలో ఆ పాఠాలను మర్చిపోకండి. ఆర్థికారోగ్యాన్ని కాపాడుకునేందుకు మీ పెట్టుబడులను సమీక్షించుకోండి. ఆదాయం-ఖర్చుల మధ్య సమతౌల్యం సాధించే ప్రయత్నం చేయండి. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడులు ప్రారంభించండి. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా అందుబాటులో ఉంచుకోండి.

- గోప్‌కుమార్‌, ఎండీ-సీఈఓ, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌


సొంతింటికి తరుణమిదే..

డబ్బు నిర్వహణ అనేది ఇప్పుడు ఎంతో ముఖ్యమైన అంశం. డబ్బుపై నియంత్రణ సాధించండి. పెట్టుబడులు, ఖర్చులన్నింటి విషయాల్లోనూ కచ్చితమైన లెక్కలుండాలి. దీనికి డిజిటల్‌ సహాయం తీసుకోండి. అప్పులను వీలైనంత తొందరగా వదిలించుకునే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇల్లు కొనాలనుకునే వారికి ఇంతకంటే మంచి తరుణం లేదని చెప్పొచ్చు. మీరు ఎంత ఈఎంఐ చెల్లించగలరు. ఎంత విలువైన ఆస్తిని కొనాలి..లాంటి విషయాల్లో కాస్త పరిశోధన చేసి, ముందడుగు వేయండి.

- సౌరవ్‌ బసు, హెడ్‌-వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, టాటా క్యాపిటల్‌


ఒకే చోట వద్దు..

కొత్త ఏడాదిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు 2020 నేర్పిన కొన్ని ముఖ్యమైన అంశాలను విస్మరించకూడదు. కొన్ని షేర్లు, రంగాలను నమ్ముకుంటే నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, పెట్టుబడులు కొనసాగాలి. వాటిని క్రమం తప్పకుండా సమీక్షించాలి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లు, బాండ్లు, ఈక్విటీ, పీపీఎఫ్‌, బంగారం.. ఇలా వైవిధ్యంగా ఉండేలా పెట్టుబడి ప్రణాళిక ఉండాలి. నష్టభయం భరించే సామర్థ్యం, నగదుగా మార్చుకునే వీలు, పెట్టుబడి వ్యవధి, పన్ను భారం ఇలా అనేక అంశాలను పరిశీలించాకే పథకాలను ఎంపిక చేసుకోవాలి. అంతర్జాతీయ ఫండ్లలో మదుపు చేయడం ఇప్పుడు సులభమయ్యింది. వీలును బట్టి, వీటినీ పరిశీలించాలి.

- సతీశ్‌ కృష్ణమూర్తి, హెడ్‌, థర్డ్‌ పార్టీ ప్రొడక్ట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌


ధీమాగా ఉండండి..

మీరు ఎన్ని పెట్టుబడులు పెట్టినా.. జీవిత బీమా లేకుండా అవి పరిపూర్ణం కాలేవు. ఆదాయం, బాధ్యతలు, అప్పులను బట్టి, సరైన మొత్తానికి బీమా ఎంచుకోవడం తప్పనిసరి. పాలసీ తీసుకున్న తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులను బట్టి, అందులో మార్పులు, చేర్పులు చేయాల్సిందే. పాలసీ తీసుకోవడమే కాదు.. దాని గురించి మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి. నామినీ వివరాలు లేని పాలసీలు ఉంటే.. వెంటనే వాటిలో నామినీ పేరును చేర్పించండి.

- ఎం.ఆనంద్‌, ప్రెసిడెంట్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌నేటి నుంచి..

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని