మార్కెట్‌ను అర్థం చేసుకోండి...

గత ఏడాది కాలంలో స్టాక్‌ మార్కెట్‌ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. లాక్‌డౌన్‌ ప్రారంభమైన కొన్నాళ్లపాటు.. పతన దశలో ఉన్నప్పటికీ.. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగుంటుందనే అంచనాతో.. జీవన కాల గరిష్ఠాలకు చేరింది. ఇప్పుడు మళ్లీ కాస్త హెచ్చుతగ్గులను ....

Updated : 26 Mar 2021 06:09 IST

గత ఏడాది కాలంలో స్టాక్‌ మార్కెట్‌ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. లాక్‌డౌన్‌ ప్రారంభమైన కొన్నాళ్లపాటు.. పతన దశలో ఉన్నప్పటికీ.. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగుంటుందనే అంచనాతో.. జీవన కాల గరిష్ఠాలకు చేరింది. ఇప్పుడు మళ్లీ కాస్త హెచ్చుతగ్గులను నమోదు చేస్తోంది. మార్కెట్లు పెరగడం, తగ్గడం సహజమే. మదుపరులు దీర్ఘకాలంపాటు కొనసాగినప్పుడు ప్రతిదశలోనూ మంచి అవకాశాలు లభిస్తుంటాయి. వాటిని చేజిక్కించుకున్నప్పుడే లాభాలను సంపాదిస్తారు. మార్కెట్‌ను అర్థం చేసుకోవడంతోపాటు, దానితో  మనం ఎలా ప్రవర్తిస్తున్నామన్నదే ఈ తరుణంలో కీలకం...

మీరు డబ్బుతో ఎలా వ్యవహరిస్తారు? పెట్టుబడుల విషయంలో మీ వ్యూహం ఏమిటి? మీరు మదుపు చేస్తున్న కంపెనీల గురించి మీకు పూర్తి వివరాలు తెలుసా? నష్టం వస్తే తట్టుకొని నిలబడగలరా? మదుపరులు తమను తాము ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూనే ఉండాలి. షేర్లను కొనడం.. అమ్మడం.. నిజమైన పెట్టుబడి కాదు. ఆకర్షణీయమైన ధరకు కొని, సాధ్యమైనంత దీర్ఘకాలం కొనసాగడం, దాని ద్వారా పెద్ద మొత్తంలో లాభాలను సొంతం చేసుకోవడం.. నిజమైన పెట్టుబడికి నిర్వచనం ఇదే.
మీ మాటేమిటి?
మార్కెట్లో కొత్తగా మదుపు చేస్తున్నవారైనా.. ఇప్పుటికే పెట్టుబడులు చేస్తున్నా.. ముందుగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీ పెట్టుబడుల లక్ష్యం ఏమిటి తెలుసుకోండి. బంధువులు, స్నేహితులు మార్కెట్లో మదుపు చేసి లాభాలు సంపాదిస్తున్నారు.. నేను ఆ అవకాశాన్ని వదులుకుంటున్నాను.. అనే ఆలోచనతో షేర్లు కొంటున్నారా? మార్కెట్‌ గురించి తెలుసు.. మిగిలింది లాభాలు ఆర్జించడమే అనే అతి నమ్మకం.. అత్యాశ తదితర భావోద్వేగాలు.. ఇలాంటి కారణాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఫండమెంటల్స్‌ను పరిగణనలోకి తీసుకొని, మదుపు చేయడమే శ్రేయస్కరం. షేర్లపై మీ అవగాహన, పెట్టుబడి లక్ష్యం.. కొనసాగే వ్యవధి.. వీటన్నింటినీ పూర్తిగా విశ్లేషించుకోవాలి. షేర్లలో పెట్టుబడులకు నష్టభయం ఉంటుంది. మీరు ఎంత మేరకు నష్టపోయినా ఇబ్బంది లేదు అనుకుంటున్నారు అనేదీ ఇక్కడ ముఖ్యమే. వీటన్నింటికీ మీకు మీరు సమాధానాలు చెప్పుకోండి. అన్నీ సవ్యంగా ఉంటేనే.. మార్కెట్‌ వైపు అడుగులు వేయండి.
చిన్న కంపెనీలా.. పెద్దవా..
సెబీ నిర్వచనం ప్రకారం.. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో ముందు వరుసలో ఉన్న 1 నుంచి 100 వరకూ ఉన్న కంపెనీలను లార్జ్‌ క్యాప్‌ షేర్లుగా పేర్కొంటారు. 101-250 వరకూ ఉన్న వాటిని మిడ్‌ క్యాప్‌, 251 నుంచి ఆ కిందకు ఉన్న వాటిని స్మాల్‌ క్యాప్‌ షేర్లుగా పరిగణిస్తారు. సాధారణంగా లార్జ్‌ క్యాప్‌ షేర్లలో హెచ్చుతగ్గులు కాస్త తక్కువగా ఉంటాయి. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లో హెచ్చుతగ్గులు ఎక్కువ. ఏ క్యాప్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలన్నది మీరు ఆశిస్తున్న రాబడి, భరించగలిగిన నష్టభయాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.
సమతౌల్యంగా...
షేర్ల పనితీరును బట్టి, వివిధ రకాలుగా వర్గీకరిస్తారు.. దీర్ఘకాలంగా మంచి ఫలితాలు చూపించడం, డివిడెండ్లను ప్రకటిస్తూ.. పలు రంగాల్లోని దిగ్గజ కంపెనీలుగా ఉన్న బలమైన, నాణ్యమైన కంపెనీలను సహజంగా బ్లూచిప్‌ కంపెనీలుగా పిలుస్తారు. తక్కువ నష్టభయం ఉండాలని కోరుకునే మదుపరులు వీటిని ఎంచుకోవాలి. పరిశ్రమలోని ఇతర కంపెనీలు, ఆర్థిక వ్యవస్థ కన్నా ఎక్కువ వృద్ధిని గత కొంతకాలంగా చూపిస్తూ ఉంటే.. వాటిని గ్రోత్‌ కంపెనీలుగా పేర్కొంటారు. చాలా కాలంగా స్థిరమైన వృధ్ధిని చూపిస్తూ.. భవిష్యత్తులో కొంత నిలకడగా ఉండగలిగి, వచ్చే రాబడిలో ఎక్కువ భాగాన్ని తన పెట్టుబడిదారులకు క్రమం తప్పకుండా డివిడెండ్ల రూపంలో పంపిణీ చేసేవి ఇన్‌కం షేర్లుగా చెబుతుంటారు. ఆర్థిక వృద్ధి దశతోపాటు ప్రభావితమయ్యే వాటిని సైక్లికల్‌ స్టాక్స్‌, పలు కాలాల్లో స్థిరమైన వృద్ధిని చూపించే వాటిని డిఫెన్సివ్‌ స్టాక్స్‌ అని అంటారు. మదుపరులు తాము పెట్టుబడి కోసం ఎంచుకునే షేర్లలో ఇలాంటివన్నీ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ పరిస్థితుల్లో ఇది మరింత అవసరంగా చెప్పొచ్చు.
అన్ని దశల్లోనూ...
మార్కెట్‌ ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా నాలుగు దశలను చెప్పుకోవచ్చు.
కూడబెట్టే దశ: పెట్టుబడిదారుల్లో భయం.. మార్కెట్లు పతనం కాకుండా ఒక పరిధిలో కదలాడుతుంటాయి. అనుభవంగల వారు మదుపు చేస్తుంటారు. సాధారణ మదుపరి షేర్లను అమ్ముతుంటారు. పబ్లిక్‌ ఇష్యూలు పెద్దగా ఉండవు. మదుపరులు ఈ దశలో పెట్టుబడులవైపు మొగ్గు చూపాలి.
ర్యాలీ దశ: స్థిరీకరణ జరుగుతూ.. అధిక స్థాయులకు వెళ్లడానికి మార్కెట్లు సిద్ధం అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకోకున్నా వృద్ధిని చూస్తుంటారు. మదుపరులు భయాలన్నీ పక్కన పెట్టి, మార్కెట్‌కు వస్తుంటారు. ఐపీఓలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లు జోరుగా వెళ్తుంటాయి. ఎక్కువ లాభాలు తెచ్చే దశగా దీన్ని చెప్పొచ్చు. ప్రతికూల వార్తలను అంతగా పట్టించుకోని దశ ఇది.
పంపిణీ దశ: మితి మీరిన విలువల వద్ద సాధారణ మదుపరులు    పెట్టుబడి పెడుతుంటే.. అనుభవం, నైపుణ్యంగల వారు పెట్టుబడుల ఉపసంహరణ చేస్తుంటారు. గిరాకీకి మించిన షేర్ల సరఫరా వస్తుంటుంది. ఐపీఓల హవా ఎక్కువగా ఉంటుంది.
పతన దశ: షేర్లను అమ్మడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. మూలధనంతో చూసినప్పుడు మార్కెట్‌ విలువ చాలా తక్కువగా ఉంటుంది. మళ్లీ ధరలు  కోలుకుంటాయన్న ఆశకన్నా.. ఇంకా కోల్పోతూనే ఉంటుందనే భయం ఎక్కువగా ఉంటుంది. ఐపీఓలు రావడం, ఆదరణ, మదుపరులు రావడం బాగా తగ్గిపోతుంది. దీర్ఘకాలిక మదుపరులు దీన్ని అవకాశంగా తీసుకోవాలి.
ఈ దశలన్నీ మార్కెట్లో సర్వసాధారణంగా వస్తుంటాయి. వీటితో పాటు మంచి యాజమాన్యం, స్థిరమైన వృద్ధి - లాభదాయకతతో ముందుకెళ్లడం,  ఆరోగ్యకరమైన బ్యాలెన్స్‌ షీట్‌ ఉండటం, పరిశ్రమ వృద్ధి ఆశాజనకంగా ఉండటం ముఖ్యమైన అంశాలుగా చూడాలి. మదుపరులు ఏ ఒక్క దశలోనే పెట్టుబడులు పెట్టడం, తర్వాత మార్కెట్‌ను పట్టించుకోవడం సరికాదు. మంచి కంపెనీని ఎంచుకొని, ఏ దశలో మదుపు చేసినా.. దీర్ఘకాలం కొనసాగడమే లక్ష్యంగా పెట్టుకోవాలి.

- జె.వేణుగోపాల్‌, జెన్‌మనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని