Published : 07 May 2021 00:22 IST

సురక్షితంగా.. అధిక రాబడి...

కొవిడ్‌-19 వల్ల వస్తున్న ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు వడ్డీ రేట్లను ఆర్‌బీఐ తగ్గిస్తూ వస్తోంది. తాజాగా ప్రకటించిన విధానాల ప్రకారం చూస్తే.. వడ్డీ రేట్లు   పెరిగేందుకు మరో రెండేళ్లు పట్టే అవకాశాలు ఉన్నట్లు అర్థం అవుతోంది. అప్పులు తీసుకున్న వారికి దీనివల్ల ప్రయోజనమే. పెట్టుబడుల పెట్టి, వడ్డీ ఆదాయంపైనే ఆధారపడిన వారికి ఇది కొంత నిరుత్సాహపరిచే విషయమే. తక్కువ వడ్డీ రేట్లు కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్టుబడికి రక్షణ కల్పిస్తూ.. కాస్త అధిక రాబడిని అందించే పథకాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒకవైపు ఆరోగ్య అత్యవసర పరిస్థితి. మరోవైపు ఆదాయాలు తగ్గిపోవడం.. దేశంలో ఇప్పుడు అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయాల్లోనూ అధిక రాబడిని అందించే సురక్షితమైన పెట్టుబడి పథకాలు ఉన్నప్పటికీ చాలామంది వీటిని విస్మరిస్తున్నారు. అధిక ఆదాయం ఆశతో నష్టభయం ఉన్న పథకాల్లో మదుపు చేస్తూ.. తమ పెట్టుబడిని కోల్పోతున్నారు. ఏదేని పెట్టుబడి పథకాన్ని ఎంచుకునే ముందు మన ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు ఎలా ఉన్నాయి అనేది తొలుత చూసుకోవాలి. ఆ తర్వాతే ఒక ప్రణాళికకు అనుగుణంగా పథకాలను ఎంచుకోవాలి.
స్వల్పకాలిక నిధులతో..
అత్యవసరం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేకపోతున్నాం. అందుకోసం ప్రతి ఒక్కరూ తమ వీలును బట్టి, కొంత అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొత్తంతో ఎలాంటి సాహసాలూ చేయొద్దు. వీటిని తప్పనిసరిగా స్వల్పకాలిక ఆదాయ పథకాలైన మనీ మార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలోగానీ లేదా బ్యాంకు డిపాజిట్లలో మాత్రమే పెట్టుకోండి.
బ్యాంకు ఎఫ్‌డీలలో..
అత్యంత సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ముందుంటాయి. ఈ పథకాల మీద సాధారణ పొదుపు బ్యాంకు ఖాతాకన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది సీనియర్‌ సిటిజెన్లకు ఎఫ్‌డీల మీద ఇతరులతో పోలిస్తే 0.5శాతం వరకూ అధిక వడ్డీ వస్తుంది. వడ్డీ రేటు పెట్టుబడి పెట్టే సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. బ్యాంకులే కాకుండా, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలూ ఎఫ్‌డీలను అందిస్తున్నాయి. వడ్డీ రేట్లు వచ్చే 2-3 సంవత్సరాల తర్వాత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, వీటిని ఎంచుకునేటప్పుడు మూడేళ్లకు మించి పెట్టుబడి పెట్టడం అంత మంచిది కాదు.  
ప్రజా భవిష్య నిధి...
ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌) కేంద్ర ప్రభుత్వ హామీతో ఉండే పెట్టుబడి పథకం ఇది. ఇందులో కనీసం 15 ఏళ్ల పాటు కొనసాగాల్సి ఉంటుంది. ప్రభుత్వ హామీ ఉండటం వల్ల ఇది అత్యంత సురక్షితమైన పెట్టుబడులలో ఒకటిగా చెప్పొచ్చు. పీపీఎఫ్‌లో 15 ఏళ్లపాటు ఏడాదికి కనీసం రూ.500, గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ మదుపు చేస్తూ ఉండాలి. ప్రస్తుతం బ్యాంకు ఎఫ్‌డీలతో పోలిస్తే ఇందులో అధిక వడ్డీ లభిస్తోంది. 15 ఏళ్ల లాకిన్‌ ఉంటుంది కాబట్టి, దీర్ఘకాలిక లక్ష్యాలకు బాగా సరిపోతుంది.
జాతీయ పింఛను పథకం..
పదవీ విరమణను దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) ఒక మార్గం. దీన్ని పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నిర్వహిస్తోంది. డెట్‌ సెక్యూరిటీలు, ఈక్విటీల వంటి వివిధ పెట్టుబడుల మిశ్రమం ఎన్‌పీఎస్‌. ఇందులో మన పెట్టుబడులకు అధిక నష్టభయం లేకుండా ఎంచుకునేందుకు వివిధ ఆప్షన్లూ ఉంటాయి. నిర్ణీత వడ్డీ ప్రకటించనప్పటికీ.. మిగిలిన పథకాలతో పోలిస్తే ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలు ఉంటాయి.
పసిడి రూపంలో..
బంగారంలో పెట్టుబడులు పెట్టడం కొత్తేమీ కాదు. ఆభరణాలు, నాణేలు, కడ్డీల రూపంలో పసిడిని చాలామంది కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం మీద భౌతిక రూపంలో పెట్టుబడికన్నా.. ఈటీఎఫ్‌లు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల వంటి పథకాలను ఎంచుకోండి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే సాధనంగా బంగారానికి పేరుంది. స్టాక్‌ మార్కెట్లకూ.. పసిడి ధరలకూ విలోమ సంబంధం ఉంటుంది. దీనిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా స్టాక్‌ మార్కెట్‌ తగ్గినప్పుడు హెడ్జ్‌గా పనిచేస్తుంది. బంగారం ధర తగ్గే అవకాశాలు తక్కువ కాబట్టి, మూలధన రక్షణ ఉంటుంది.  
ఆర్‌బీఐ బాండ్లు...
ఆర్‌బీఐ ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్‌ బాండ్లపై వడ్డీ రేటు ప్రతి ఆరు నెలలకు మారుతూ ఉంటుంది. ఏడేళ్ల కాలానికి ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. సీనియర్‌ సిటిజెన్లు ఏడేళ్లకు ముందుగానే వెనక్కి తీసుకోవచ్చు. వీటికి ఆర్‌బీఐ హామీ ఉంటుంది. కాబట్టి, తక్కువ రిస్క్‌ కోసం చూసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ బాండ్లపై వడ్డీ రేట్లు నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌పీఎస్‌)తో ముడిపడి ఉంటుంది. వీటిపై వడ్డీ రేటు ఎన్‌పీఎస్‌ కన్నా 0.35శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఇందులో 7.15శాతం వడ్డీ లభిస్తోంది.
కార్పొరేట్‌ బాండ్లలో..
మదుపరులు బ్యాంకు ఖాతాలకన్నా మించి వడ్డీ కోసం బాండ్‌ మార్కెట్‌ వైపు చూస్తారు. మూలధనాన్ని కోరుకునే కంపెనీలు కార్పొరేట్‌ బాండ్లు జారీ చేస్తాయి. మంచి బ్యాలెన్స్‌ షీటు, ఆర్థిక చరిత్ర కలిగిన సంస్థలను పరిశీలించి, మంచి క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న బాండ్లలో పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. నష్టభయం భరించగలిగే మదుపరులు స్టాక్‌ మార్కెట్లు, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల వంటి వాటిలోనూ మదుపు చేయొచ్చు. 

- ఫణి శ్రీనివాసు

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts