ఆన్‌లైన్‌లో టర్మ్‌ పాలసీ తీసుకో వచ్చా?

నా దగ్గర ఉన్న రూ.3లక్షలను ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాను. దీన్ని రద్దు చేసి,  స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలన్నది నా ఆలోచన. ఇందువల్ల అధిక  రాబడికి అవకాశం ఉంటుంది కదా! కనీసం 15-18 శాతం రాబడి రావాలంటే ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?  

Published : 14 May 2021 00:57 IST

నా దగ్గర ఉన్న రూ.3లక్షలను ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాను. దీన్ని రద్దు చేసి,  స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలన్నది నా ఆలోచన. ఇందువల్ల అధిక  రాబడికి అవకాశం ఉంటుంది కదా! కనీసం 15-18 శాతం రాబడి రావాలంటే ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?  

- ప్రభాకర్‌

మీ దగ్గర ఉన్న రూ.3లక్షలు స్వల్ప కాలంలో అవసరం లేకుంటే.. కనీసం 7-10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటేనే స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులను పరిశీలించవచ్చు. స్వల్పకాలంలో ఈ పెట్టుబడులతో నష్టభయం ఉంటుందని గమనించాలి. దీర్ఘకాలంలో 15-18శాతం రాబడి రావడం అనేది కాస్త కష్టమే. రాబడి మార్కెట్‌ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. 12-14శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. దీనికి మీరు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోండి.

గత రెండేళ్లుగా మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌  చేస్తున్నాను. రూ.3లక్షల వరకూ జమ అయ్యాయి. ఇప్పుడు ఈ డబ్బును వెనక్కి తీసుకొని, ఇంటి రుణం అసలును చెల్లించాలని అనుకుంటున్నాను. ఇలా చేయడం మంచిదేనా? ఫండ్లలోనే పెట్టుబడిని కొనసాగించాలా?

- విజయ్‌

ప్రస్తుతం గృహరుణం వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చెల్లించే గృహరుణంపై పన్ను మినహాయింపు తీసుకుంటూ ఉంటే... రుణాన్ని చెల్లించకపోవడమే మంచిది. గత రెండేళ్లుగా మదుపు చేస్తున్నా అంటున్నారు కాబట్టి, ఫండ్లలో మీకు మంచి రాబడి వచ్చిందనే అనుకోవచ్చు. మీ పెట్టుబడిని మరో నాలుగైదేళ్లు కొనసాగించి, ఆ తర్వాత వచ్చిన మొత్తంతో మీ గృహరుణం చెల్లించేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీకు మరింత ప్రయోజనం లభిస్తుంది.

మా అమ్మాయి వయసు 13 ఏళ్లు. తన పేరుతో నెలకు రూ.20వేల చొప్పున 10 ఏళ్ల వరకూ పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నాను. నేను వ్యాపారిని. ఆదాయం క్రమంగా ఉండదు. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?    

- రాజు

మీరు పదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించాలని అనుకుంటున్నారు కాబట్టి, మంచి రాబడి కోసం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. నెలకు రూ.10వేల చొప్పున పదేళ్ల కాలం పెట్టుబడిని కొనసాగిస్తే దాదాపు 13 శాతం రాబడి అంచనాతో.. రూ.44,20,700 అయ్యే అవకాశం ఉంది. మీకు ఆదాయం క్రమంగా ఉండదు అంటున్నారు కాబట్టి, కనీసం ఆరు నెలల పెట్టుబడిని ముందుగానే బ్యాంకులో జమ చేయండి. ఆ తర్వాత నెలనెలా రూ.10వేలు కేటాయించండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేకుండా మీ పెట్టుబడి కొనసాగుతుంది.

నేను ఆరేళ్ల క్రితం రూ. 25 లక్షలకు  టర్మ్‌ పాలసీని తీసుకున్నాను. ఇప్పుడు మరో పాలసీని తీసుకోవాలని అనుకుంటున్నాను. నా వార్షిక వేతనం రూ.7లక్షలు. ఎంత    విలువైన టర్మ్‌ పాలసీ తీసుకోవాలి. నా వయసు 48 ఏళ్లు. ఆన్‌లైన్‌లో నాకు పాలసీ ఇస్తారా?    

- శ్రీనివాస్‌

మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్లు విలువైన జీవిత బీమా ఉండాలి. మీకు ఇప్పటికే రూ.25లక్షల పాలసీ ఉందంటున్నారు కాబట్టి, అదనంగా రూ.60లక్షల విలువైన టర్మ్‌ పాలసీ తీసుకోండి. మీరు ఆన్‌లైన్‌లోనూ ఈ పాలసీని తీసుకునేందుకు వీలుంది. ముందుగా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న బీమా సంస్థను ఎంచుకొని, పాలసీకి దరఖాస్తు చేయండి. అవసరాన్ని బట్టి, బీమా సంస్థ మిమ్మల్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించవచ్చు. ఇందులో అన్నీ సరిగా ఉంటే.. సులభంగానే పాలసీ వస్తుంది. ఏదైనా సమస్య ఉన్నప్పుడు కాస్త అధిక ప్రీమియం వసూలు చేసే వీలుంది.

- తుమ్మబాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని