అప్పు చేసి మదుపు వద్దు..

మాకు ఇద్దరు పిల్లలు. వారి చదువుల కోసం ఉపయోగపడేలా నెలకు రూ.6,000 వరకూ మదుపు చేద్దామని అనుకుంటున్నాను. పీపీఎఫ్‌లో జమ చేయడం మంచిదేనా? అవసరమైనప్పుడు డబ్బు వెనక్కి తీసుకునే

Published : 21 May 2021 01:17 IST

మాకు ఇద్దరు పిల్లలు. వారి చదువుల కోసం ఉపయోగపడేలా నెలకు రూ.6,000 వరకూ మదుపు చేద్దామని అనుకుంటున్నాను. పీపీఎఫ్‌లో జమ చేయడం మంచిదేనా? అవసరమైనప్పుడు డబ్బు వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉండే పథకాలు ఏమున్నాయి?   - రాజేశ్వర్‌
* మీ ఇద్దరు పిల్లలు అయిదేళ్ల లోపు ఉంటే.. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)ని పరిశీలించవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో 7.1శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. వడ్డీ ఆదాయానికి పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. పెట్టుబడిని కనీసం 15 ఏళ్లపాటు కొనసాగించాలి. మధ్యలో డబ్బు కావాలనుకుంటే.. కొన్ని నిబంధనలకు లోబడి రుణం తీసుకోవచ్చు. అయిదేళ్ల తర్వాత పాక్షికంగా కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకునే వీలుంది. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో రూ.3,000 పీపీఎఫ్‌కు కేటాయించండి. మిగతా మొత్తం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో ‘సిప్‌’ చేయండి. మీరు నెలకు రూ.6,000 పీపీఎఫ్‌, ఫండ్లలో మదుపు చేస్తే.. సగటున 10 శాతం అంచనాతో.. 15 ఏళ్లనాటికి రూ.22,87,600 జమ అయ్యే అవకాశం ఉంది. ఈ పెట్టుబడితోపాటు, మీ కుటుంబం, పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు మీ వార్షికాదాయానికి 10-12 రెట్లు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. మ్యూచువల్‌ ఫండ్ల నుంచి మీ డబ్బును కావాల్సినప్పుడు వెనక్కి తీసుకోవచ్చు. కానీ, 7-10 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తేనే మంచిది. స్వల్పకాలంలో వీటిలో నష్టభయం ఉంటుంది.
గృహరుణం మరో రెండేళ్లలో పూర్తి కాబోతోంది. ఇప్పుడు టాపప్‌ లోన్‌ తీసుకొని, ఆ మొత్తాన్ని ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నాను. దీనివల్ల ఏదైనా ఇబ్బంది వస్తుందా? - శ్యామల
* మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం.. అప్పు చేసి పెట్టుబడి పెట్టకూడదు. సొంతంగా ఆర్జించే డబ్బునే పెట్టుబడులకు కేటాయించాలి. అప్పు తీసుకొని మదుపు చేసినప్పుడు.. వచ్చే రాబడి.. అప్పుపై చెల్లించే వడ్డీకన్నా మించి ఉండాలి. అప్పుడే లాభం వచ్చినట్లు. తక్కువ వస్తే.. నష్టపోతాం. అన్నిసార్లు అధిక వడ్డీ వస్తుందని చెప్పలేం. రాబడి ఎక్కువగా రావాలంటే.. నష్టభయం ఉన్న పథకాల్లోనే మదుపు చేయాలి. అప్పుడు మీ అసలు మొత్తానికీ రిస్క్‌ ఉన్నట్లే. మీ గృహరుణం మొత్తం తీరాక.. ఇప్పుడు నెలకు చెల్లిస్తున్న ఈఎంఐలను దీర్ఘకాలిక దృష్టితో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లకు మళ్లించండి.
బంగారంలో మదుపు చేసేందుకు నెలకు రూ.10వేలు కేటాయించాలనుకుంటున్నాను. సార్వభౌమ పసిడి బాండ్లలో వడ్డీ వస్తుంది కదా. ఏం చేయాలి? - నరేశ్‌
* సార్వభౌమ పసిడి బాండ్లలో నిర్ణీత కాలంలోనే మదుపు చేయగలరు. నెలనెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టేందుకు వీలుండదు. ఈ బాండ్లలో పెట్టిన పెట్టుబడికి 2.5శాతం వార్షిక వడ్డీ వస్తోంది. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగించగలను అనుకున్నప్పుడే వీటిని ఎంచుకోవాలి. మధ్యలో డబ్బులు కావాలనుకుంటే.. సెకండరీ మార్కెట్‌లో విక్రయించాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా ఎస్‌ఐపీ ద్వారా గోల్‌్్డ ఈటీఎఫ్‌లలో మదుపు చేయొచ్చు.
నేను కొత్తగా ఉద్యోగంలో చేరాను. నా వయసు 23 ఏళ్లు. నెలకు రూ.25 వేల వరకూ వస్తున్నాయి. ఇందులో కనీసం నెలకు రూ.8వేలు పదేళ్ల దాకా మదుపు చేద్దామని అనుకుంటున్నాను. మాకు రూ.2 లక్షల అప్పు ఉంది. వ్యక్తిగత రుణం తీసుకొని, ఈ అప్పు తీర్చడం మంచిదా? లేకపోతే కొన్నాళ్లు మదుపు చేసి, ఆ మొత్తంతో అప్పు చెల్లించాలా? ఏం చేయాలి?  - నారాయణ
* మీరు తీసుకున్న రుణానికి ఎంత వడ్డీ చెల్లిస్తున్నారన్నది చెప్పలేదు. సాధారణంగా ఇతరుల నుంచి తీసుకున్న అప్పుపై వార్షిక వడ్డీ 18-24 శాతం వరకూ ఉంటుందనుకోవచ్చు. మీకు వ్యక్తిగత రుణం 10-11 శాతానికి వస్తే.. తీసుకొని, ఆ అప్పును చెల్లించండి. లేకపోతే.. మీరు వీలైనంత తొందరగా ఆ రూ.2లక్షలను జమ చేసి అప్పు తీర్చేయడమే మేలు.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని