నూరేళ్ల వరకూ..

పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ముఖ్యంగా చదువుల ఖర్చు ఏటా 10-12 శాతం పెరుగుతున్న నేపథ్యంలో భారతీయులు దీర్ఘకాలిక లక్ష్యంతో పొదుపు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇక ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో

Published : 28 May 2021 00:17 IST

పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ సెంచరీ ప్లాన్‌

పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ముఖ్యంగా చదువుల ఖర్చు ఏటా 10-12 శాతం పెరుగుతున్న నేపథ్యంలో భారతీయులు దీర్ఘకాలిక లక్ష్యంతో పొదుపు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇక ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. దీంతోపాటు సగటు జీవితకాలం పెరగడమూ.. పదవీ విరమణ ప్రణాళికలు కచ్చితంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో జీవితంలో వివిధ దశల్లో వచ్చే ఖర్చులను తట్టుకునేందుకు వీలుగా ఉండటంతోపాటు.. నూరేళ్ల వరకూ బీమా రక్షణ కల్పించే వినూత్న పాలసీని పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఆవిష్కరించింది. ఈ సెంచరీ ప్లాన్‌ పాలసీ మూడు రకాలుగా ప్రయోజనాలు పొందేందుకు వీలు కల్పిస్తోంది.
సూపర్‌ ఇన్‌కం ఆప్షన్‌ కింద.. పాలసీ తీసుకున్న తొలి ఏడాది నుంచే.. బోనస్‌ (ప్రకటిస్తే)ను ఆదాయం రూపంలో చెల్లిస్తారు. వ్యవధి తీరిన తర్వాత పాలసీ విలువను ఒకేసారి అందిస్తారు. ఇందులో చెల్లించిన వార్షిక ప్రీమియంపై 10శాతం హామీతో కూడిన రాబడి ఉంటుంది. స్మార్ట్‌ ఇన్‌కం కింద ప్రీమియం చెల్లించిన మొదటి ఏడాది నుంచి బోనస్‌ చెల్లించి, వ్యవధి తీరిన తర్వాత పాలసీ మొత్తం ఇస్తారు. ఇక ఫ్యూచర్‌ ఇన్‌కంలో పాలసీ తీసుకున్న 15 ఏళ్ల తర్వాత నుంచి బోనస్‌ను చెల్లిస్తారు. 20-30ఏళ్లపాటు కనీసం 30శాతం వరకూ వార్షిక ప్రీమియంలో బోనస్‌గా చెల్లిస్తారు. దీంతోపాటు.. పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవంలాంటి సందర్భాల్లో ప్రత్యేక బోనస్‌ చెల్లించే ఏర్పాటూ చేసుకోవచ్చు. పాలసీదారుడు మరణించినా.. ఫ్యామిలీ కేర్‌ ఆప్షన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ఏర్పాటు చేయొచ్చు. ఈ పాలసీలో 65 ఏళ్లలోపు వారెవరైనా చేరేందుకు అవకాశం ఉంది. కనీస పాలసీ మొత్తం రూ.6లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. కనీస ప్రీమియం రూ.60వేలు. గరిష్ఠంగా బీమా సంస్థ నిబంధనలకు లోబడి ఉంటుంది.

పింఛను హామీతో..

క్రమం తప్పకుండా పింఛను ఆదాయం రావాలని కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకొని, మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఇమ్మీడియట్‌ యాన్యుటీ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ మ్యాక్స్‌ లైఫ్‌ సరళ్‌ పెన్షన్‌ ప్లాన్‌.. సింగిల్‌ ప్రీమియం పాలసీ. వెంటనే పింఛను ప్రారంభమై జీవితాంతం వరకూ కొనసాగుతుంది. పాలసీదారుడి తదనంతరం జీవిత భాగస్వామికి పింఛను అందే ఏర్పాటూ చేసుకోవచ్చు. పాలసీదారుడి లేదా జీవిత భాగస్వామి తర్వాత ప్రీమియం మొత్తం నామినీకి అందించే వెసులుబాటూ ఉంది. ఏడాదికోసారి లేదా ఆరు నెలలు, మూడు నెలలు, నెలనెలా పింఛను తీసుకునే వీలుంది. 40-80 ఏళ్ల లోపు వారెవరైనా ఈ యాన్యుటీ పాలసీలో చేరవచ్చు. తీవ్రవ్యాధులు సోకిన సందర్భాల్లో పాలసీని స్వాధీనం చేయొచ్చు. ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర వ్యాధుల బారిన పడితే.. 95శాతం వరకూ స్వాధీన విలువ చెల్లిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని