Updated : 04 Jun 2021 09:46 IST

Investment: పిల్లల భవితకు భద్రతనిద్దాం...

‘మా పిల్లలు మంచి చదువులు చదవాలి.. ఉన్నత స్థానానికి చేరాలి’.. ప్రతి తల్లిదండ్రుల ఆలోచనా ఇదే..  చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్నదే వారి లక్ష్యంగా ఉంటుంది. కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను ఎలా కబళిస్తోందో చూస్తున్న తర్వాత.. ఇప్పుడు అందరిలోనూ ఒక తెలియని ఆందోళన మొదలైంది. ఒకవైపు ఆదాయాలు తగ్గడం, మరోవైపు ఉద్యోగాల్లో కోత చాలామందిని ఇబ్బంది పెడుతోంది. కొన్ని కుటుంబాలు ఆర్జించే వ్యక్తిని కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.. ఈ ఉదంతాలన్నీ.. మన ఆర్థిక ప్రణాళికలను మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరాలను చెబుతున్నాయి. ముఖ్యంగా పిల్లలకు తగిన ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏం చేయాలన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆర్థిక ప్రణాళికలో పిల్లల చదువులు, వారి ఇతర ఖర్చులకు తగిన ఏర్పాట్లు చేయడం అనేది ఎంతో కీలకమైన అంశం. పిల్లలు తమ ప్రతి అవసరం కోసం తల్లిదండ్రుల మీదే ఆధారపడుతుంటారు. కాబట్టి, వారికి అవసరమైన ఆర్థిక వనరులకు ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఎలాంటి సందర్భం ఎదురైనా సరే.. పిల్లలకు ఆర్థికంగా కష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
వాయిదా వేయొద్దు..
పిల్లల చదువుల, ఇతర లక్ష్యాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. కాబట్టి, వారు చిన్న వయసులో ఉన్నప్పుడే వారికి మున్ముందు అవసరమైన మొత్తాన్ని సమకూర్చడం కోసం పెట్టుబడులు ప్రారంభించాలి. చాలామంది తమ పిల్లలు ఏం కావాలని అనుకుంటున్నారో స్పష్టత వచ్చాకే మదుపు మొదలు పెడతారు. తొందరగా పెట్టుబడులు ప్రారంభిస్తే.. పిల్లలు పెద్దవాళ్లయ్యే నాటికి దీర్ఘకాలిక రాబడి ప్రయోజనం అందుతుంది. దీనివల్ల తక్కువ మొత్తం మదుపు చేసినా.. మంచి ప్రతిఫలం అందుకోవచ్చు. ఆలస్యం చేస్తున్న కొద్దీ.. పెట్టుబడి పెట్టాల్సిన మొత్తాన్ని పెంచాల్సి ఉంటుంది. వచ్చే రాబడీ అంత అధికంగా ఉండదు. పైగా ఇతర ఆర్థిక లక్ష్యాలపైనా దీని ప్రభావం పడుతుంది.
మదుపు చేసేటప్పుడు విద్యా ద్రవ్యోల్బణాన్ని కచ్చితంగా పరిగణించాలి. దీర్ఘకాలంలో ఇది 8-10 శాతం వరకూ ఉంటుంది. కోర్సులను బట్టి ఇది    మారుతుంది. మీ అమ్మాయి/అబ్బాయి ఏం చదవాలనుకుంటున్నారు.. దానికి ఇప్పుడు అయ్యే ఖర్చు ఎంత.. రాబోయే రోజుల్లో ఎంత అవసరమవుతుందిలాంటి లెక్కలన్నీ వేయాలి. ఆ తర్వాతే సరైన మొత్తం.. అనువైన పథకంలో మదుపు చేసేందుకు సిద్ధం కావాలి.


రక్షణగా..

తల్లిదండ్రులు ఉన్నంత కాలం పిల్లలకు ఎలాంటి కష్టం రాదు. దురదృష్టవశాత్తూ వారికి ఏదైనా తీవ్ర వ్యాధులు సోకడం లేదా అనుకోని పరిస్థితుల్లో దూరం కావడంలాంటి సందర్భాల్లో పిల్లల చదువులు, ఇతర ఆర్థిక అవసరాలను తీర్చేలా బీమాతో రక్షణ కల్పించాలి. వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు.. కనీసం 200 నెలల ఆదాయానికి సమానమైన మొత్తానికి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడం తప్పనిసరి. కుటుంబానికి అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా.. క్రిటికల్‌ ఇల్‌నెస్‌, డిజేబిలిటీ, పర్సనల్‌ యాక్సిండెంట్‌ పాలసీల్లాంటివీ ఉండాల్సిందే.


సమయానుకూలంగా..

మదుపు చేసే వ్యవధిని బట్టి, ఏ పథకాలను ఎంచుకోవాలన్నది చూసుకోవాలి. మీకు మూడేళ్లలోపే డబ్బు అవసరం ఉంది అనుకుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈక్విటీ పెట్టుబడులు సరిపోవు. వీటికన్నా.. తక్కువ నష్టభయం ఉన్న లిక్విడ్‌, డెట్‌ ఫండ్లు.. బ్యాంకు డిపాజిట్లలాంటివి పరిశీలించాలి. ఒకవేళ మీకు ఐదేళ్లు ఆ తర్వాత డబ్బు అవసరాలుంటే.. అప్పుడు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయొచ్చు. 15 ఏళ్ల దీర్ఘకాల పెట్టుబడి కోసం పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌).. అమ్మాయి ఉంటే.. సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై)లాంటి ప్రభుత్వ పథకాలనూ చూడొచ్చు. విదేశాల్లో చదివించాలనే ఆలోచన ఉంటే.. అందుబాటులో ఉన్న అంతర్జాతీయ మ్యూచువల్‌ ఫండ్లలోనూ మదుపు చేయొచ్చు.


డబ్బు గురించి చెప్పండి..

జీవితంలో డబ్బు అవసరం ఏమిటి? దాన్ని ఎలా నిర్వహించాలి? ఖర్చులు.. పెట్టుబడులు.. భవిష్యత్‌ అవసరాలు.. ఇలా చిన్నతనంలోనే పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పించాలి. చేతిలో ఉన్న డబ్బును తెలివిగా ఎలా వినియోగించాలన్న సంగతి వారికి తెలిసి ఉండాలి. వారికి డబ్బు విలువ అర్థం అయితేనే.. ఆలోచించి ఖర్చు చేస్తారు. చెప్పలేం.. కొన్నిసార్లు ఇది వారికి ఎంతో అవసరం కావచ్చు. పిల్లల పేరుమీద మైనర్‌   బ్యాంకు ఖాతాలను ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఈ ఖాతాలను తీసుకోవడమూ మంచిదే.


వీలునామా ఉందా?

జరగకూడనిది ఏదైనా జరిగితే.. పిల్లల బాగోగులు ఎవరు చూసుకుంటారు... చాలామంది దీన్ని ఊహించడానికీ.. దంపతులిద్దరూ కలిసి ఈ విషయం మాట్లాడుకోవడానికీ ఇష్టపడరు. కానీ.. వాస్తవ దృష్టితో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఆస్తుల   వివరాలు.. పెట్టుబడులు.. బీమా పాలసీలు.. అప్పులు ఇలా ఒక కుటుంబ పెద్ద తన ఆర్థిక విషయాలన్నీ ఒక చోట రాసి పెట్టడం ఎంతో అవసరం. దీంతోపాటు.. వీలునామా రాయడమూ ఇప్పుడు ముఖ్యమే. ఒకవేళ ఏదైనా అనుకోనిది జరిగిన సందర్భంలో..    ఆస్తులు ఎవరికి బదలాయించాలి.. పిల్లల సంరక్షుకులుగా ఎవరుండాలి.. వారి హక్కులు.. బాధ్యతలు.. ఇలా అన్నీ వివరంగా వీలునామాలో రాయడం ఉత్తమం. మీకు నచ్చిన భాషలో తెల్లకాగితం మీద రాసి సంతకం చేసినా.. అది వీలునామానే. మీ పాలసీలు,  ఇతర పెట్టుబడులకు నామినీ వివరాలను మరోసారి సరిచూసుకోండి.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని