Updated : 11 Jun 2021 12:11 IST

Gold: బంగారంలో మదుపు చేయాలంటే...

నా జీతం ఇప్పుడు రూ.60వేలు. ఏడేళ్ల క్రితం రూ.15లక్షల టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. దీన్ని ఆపేసి, ఇప్పుడు కొత్తగా రూ.కోటి విలువైన పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. నా వయసు 47 ఏళ్లు. ఆన్‌లైన్‌లో తీసుకుంటే ఇబ్బందేమైనా ఉంటుందా? - కుమార్‌
వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల టర్మ్‌ పాలసీ తీసుకోవడం ఎప్పుడూ మంచిది. మీరు రూ.కోటి పాలసీని రెండు భాగాలుగా విభజించి, రెండు బీమా సంస్థల నుంచి తీసుకోండి. పాత పాలసీని ఒకటి రెండేళ్లపాటు కొనసాగించండి. కొత్త పాలసీ తీసుకునేటప్పుడు.. మీ పాత పాలసీ వివరాలతోపాటు, మీ ఆరోగ్య వివరాలు, ఆహార అలవాట్లు, ఆదాయం.. ఇలా ప్రతి విషయాన్నీ ఇవ్వండి. అవసరమైతే ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీ తీసుకున్నా ఇబ్బందేమీ ఉండదు.


మా అమ్మాయి పేరుమీద ఇప్పటికే సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.5వేల చొప్పున జమ చేస్తున్నాను. ఇప్పుడు మరో  రూ.3వేల వరకూ ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా? - రామకృష్ణ
మీరు ఇప్పటికే సురక్షితమైన, పన్ను వర్తించని ఆదాయం ఇచ్చే సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెడుతున్నారు. పీపీఎఫ్‌ కూడా ఇలాంటి పథకమే. కాబట్టి, మీరు కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని కాస్త అధిక రాబడినిచ్చే పథకానికి మళ్లించండి. వీటిల్లో కాస్త నష్టభయం ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి రాబడికి అవకాశం ఉంటుంది. రూ.3వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో సిప్‌ చేయండి. వీటిల్లో 10-12 ఏళ్లపాటు మదుపు చేస్తే.. మీకు 12-13శాతం వరకూ రాబడి వచ్చే వీలుంది.


నేను బంగారంలో మదుపు చేయాలనుకుంటున్నాను. నెలకు కనీసం రూ.5,000 దీనికోసం కేటాయించాలని ఆలోచన. గోల్డ్‌ ఫండ్లలో లేదా గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో ఏవి మంచివి? కనీసం 10 ఏళ్ల తర్వాత ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. ప్రత్యామ్నాయంగా ఏ పెట్టుబడులను ఎంచుకోవచ్చు? - హరిత
మీరు భవిష్యత్తులో బంగారం కొనే ఆలోచనతో ఉంటేనే.. మీరు చెప్పిన పెట్టుబడి పథకాలను ఎంచుకోవచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లో మదుపు చేయాలంటే మీకు డీమ్యాట్‌ ఖాతా ఉండాలి. సాధారణంగా ఇందులో ఒక యూనిట్‌ ధర ఒక గ్రాము బంగారంతో సమానంగా ఉంటుంది. మున్ముందు బంగారం ధర పెరిగితే.. ఆ మేరకు మీ పెట్టుబడి మొత్తమూ పెరగాలి. దీనికన్నా గోల్డ్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయడం మంచిది. పసిడి కొనడం కాకుండా.. కేవలం పెట్టుబడి మాత్రమే మీ లక్ష్యం అయితే.. ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసేందుకు ప్రయత్నించండి.


నాకు ఇటీవలే వివాహం అయ్యింది. ఇద్దరమూ ఉద్యోగులమే. మా సంస్థల్లో బృంద ఆరోగ్య బీమా సౌకర్యం ఉంది. ఇది సరిపోతుందా? లేకపోతే.. మా ఇద్దరి పేరుమీదా కలిసి ఉమ్మడిగా ఒక పాలసీ తీసుకోవాలా? - దయాకర్‌
మీ ఇద్దరికీ సంస్థల నుంచి బృంద బీమా సౌకర్యం ఉండటం మంచిదే. ప్రస్తుతం ఆరోగ్య చికిత్సల ఖర్చు అధికంగా ఉంటోంది. భవిష్యత్తులో మీలో ఎవరైనా ఉద్యోగం మారినా.. మానేసినా.. ఈ ఆరోగ్య బీమా రక్షణ దూరం అవుతుంది. అప్పుడు ఇబ్బందులు తప్పవు. కాబట్టి, మీ ఇద్దరికీ కలిపి ఒక ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి.


నేను ప్రైవేటు ఉద్యోగిని. ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.80వేల వరకూ మదుపు చేయాల్సి ఉంటుంది. దీనికోసం కాస్త సురక్షితంగా ఉండే పథకాలు ఏమున్నాయి? నా ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది? - సంజీవ
ఆదాయపు పన్ను మినహాయింపు కోసం సురక్షితమైన పథకాలు కావాలనుకుంటే.. వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (వీపీఎఫ్‌)ను పరిశీలించవచ్చు. దీంతోపాటు ట్యాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌, పీపీఎఫ్‌ లాంటివీ అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిపైనా వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. కాస్త అధిక రాబడి రావాలనుకుంటే.. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పరిశీలించవచ్చు. ఇందులో కనీసం మూడేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించాలి. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆశించవచ్చు. నెలనెలా సిప్‌ విధానంలో మదుపు చేసే వీలూ ఉంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts