కుటుంబానికి ఆరోగ్య ధీమా..

వైద్య చికిత్స ఎంత ఖరీదైన విషయమో.. కొవిడ్‌-19 రెండో దశ మనకు చూపించింది. ఎంతోమంది ఆసుపత్రి బిల్లులు చెల్లించలేక అప్పుల పాలైన విషయమూ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో

Updated : 11 Jun 2021 05:58 IST

వైద్య చికిత్స ఎంత ఖరీదైన విషయమో.. కొవిడ్‌-19 రెండో దశ మనకు చూపించింది. ఎంతోమంది ఆసుపత్రి బిల్లులు చెల్లించలేక అప్పుల పాలైన విషయమూ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒక కుటుంబానికి ఆరోగ్య బీమా అవసరం ఎంత ఉందనేదీ ప్రత్యక్షంగా తెలుసుకున్నాం. దీంతో ఇప్పుడు చాలామంది ఈ బీమా పాలసీలను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే, కుటుంబానికి అంతటికీ వర్తించే బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.

ఎవరెవరికి...
కుటుంబం అంటే.. దంపతులిద్దరితోపాటు వారి మీద  ఆధారపడిన పిల్లలను ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలో చేర్పించవచ్చు. పిల్లలకు 23 నుంచి 25 ఏళ్లు లేదా వివాహం అయ్యేదాకా ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి వరకూ ఈ పాలసీలో సభ్యులుగా కొనసాగే వీలుంది. కొన్ని బీమా సంస్థలు తల్లి, తండ్రి, అత్త, మామ, నాన్నమ్మ, తాతయ్యలనూ కుటుంబ పాలసీలో చేర్పించుకునే వీలును కల్పిస్తున్నాయి. పాలసీ మొత్తం.. ఆ పాలసీలో ఉన్న వారందరికీ నిబంధనల మేరకు వర్తిస్తుంది.
కుటుంబంలో సీనియర్‌ సిటిజన్లు ఉన్నప్పుడు వారిని కుటుంబ పాలసీలో చేర్పించడం వల్ల పాలసీ ప్రీమియం పెరిగే అవకాశం ఉంది. పైగా వారికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటప్పుడు వారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే.. పాలసీ మొత్తం వారికే ఖర్చయితే.. మిగతా వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. సాధారణంగా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలో ఉన్న సభ్యుల్లో ఎవరికి ఎక్కువ వయసు ఉంటుందో వారిని ప్రాథమికంగా తీసుకొని, పాలసీ ప్రీమియాన్ని నిర్ణయిస్తారు. ఇలాంటప్పుడు ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులుగా సీనియర్‌ సిటిజన్లు లేదా ఎక్కువ వయసు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత పాలసీ తీసుకొని, మిగతా వారిని ఫ్యామిలో ఫ్లోటర్‌ పాలసీలో చేర్పించేందుకు ఆలోచించాలి. దీనివల్ల ప్రీమియం భారం లేకుండా.. అందరికీ.. గరిష్ఠ పాలసీ రక్షణ అందేందుకు అవకాశం ఉంటుంది.

ఎంత మొత్తంలో..
ఆరోగ్య ద్రవ్యోల్బణం ఇప్పుడు అధికంగా ఉంటోంది. కాబట్టి, తగిన మొత్తానికి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం తప్పనిసరి. మీ కుటుంబానికి ఎంత మొత్తం పాలసీ కావాలని నిర్ణయించుకునేందుకు.. కుటుంబ సభ్యుల వయసు, ఆరోగ్య పరిస్థితి, జీవన శైలి, అనువంశికంగా ఏదైనా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందా తదితర అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. కొన్ని బీమా కంపెనీలు తక్కువ మొత్తంలో పాలసీ తీసుకున్న వారికన్నా.. అధిక మొత్తంలో పాలసీ తీసుకున్న వారికి కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తుంటాయి. ఇలాంటివీ చూడాలి. తీసుకున్న పాలసీ పునరుద్దరణ భారం కాకుండా ఉండాలన్నదీ ముఖ్యమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ కనీసం రూ.7లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఉండటమే మేలు. అంతకు మించి ఉంటే ఇంకా శ్రేయస్కరం.
ఇవి తప్పనిసరి..
బీమా సంస్థ, పాలసీ రకాన్ని బట్టి.. ఆ పథకం అందించే ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. వివిధ రకాల వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని, బీమా సంస్థలు పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మీరు పాలసీ తీసుకోబోయేటప్పుడు.. కచ్చితంగా నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయన్నది ముందుగా తెలుసుకోవాలి. వేచి ఉండే సమయం తక్కువగా ఉండాలి. ముందస్తు వ్యాధులకు ఎప్పటి నుంచి కవరేజీ లభిస్తుంది.. జీవితాంతం వరకూ పునరుద్ధరణకు వీలుందా.. ప్రత్యామ్నాయ వైద్య  చికిత్సలకు అనుమతిస్తుందా.. ఇలాంటి వాటికి సమాధానాలు తెలుసుకోవాలి.
ఆసుపత్రి గది అద్దెపై ఉప పరిమితులేమైనా ఉన్నాయా అన్నది కీలకం. సహ చెల్లింపుల సంగతేమిటి? చెల్లింపుల చరిత్ర ఎలా ఉంది అనేవీ పాలసీ ఎంపికలో గమనించాల్సిన విషయాలే.
45 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్య బీమా పాలసీ ఇవ్వాలన్నా.. లేదా అప్పటికే ఉన్న పాలసీ మొత్తాన్ని పెంచుకోవాలన్నా బీమా సంస్థలు ఆరోగ్య పరీక్షలను అడిగే అవకాశం ఉంది. కాబట్టి, వీలైనంత వరకూ ఈలోపే పాలసీ తీసుకోవడం, విలువ పెంచుకోవడంలాంటివి పూర్తి చేయడం మంచిది.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని