జీవిత బీమా క్లెయిం కష్టం కాకుండా..

దురదృష్టవశాత్తూ.. ఒక వ్యక్తికి జరగరానిది జరిగితే.. అతను/ఆమె తీసుకున్న బీమా పాలసీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను హరించి వేసింది. ఈ

Published : 18 Jun 2021 00:23 IST

దురదృష్టవశాత్తూ.. ఒక వ్యక్తికి జరగరానిది జరిగితే.. అతను/ఆమె తీసుకున్న బీమా పాలసీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను హరించి వేసింది. ఈ కష్టకాలంలో పాలసీదారుడికి నామినీగా ఉన్న వ్యక్తి పాలసీని క్లెయింని వేగంగా క్లెయిం చేసుకునేందుకు ఏం చేయాలి?
పాలసీదారుడు మరణించినప్పుడు.. అతని నామినీలు దాఖలు చేసిన క్లెయింలను వేగంగా పరిష్కరించడం జీవిత బీమా సంస్థల ప్రాథమిక బాధ్యత. కొవిడ్‌-19 పరిస్థితుల్లో ఇది మరింత కీలకంగా మారింది. కరోనాతో ఈ లోకానికి దూరమైన వారి ఆత్మీయులకు అందాల్సిన బీమా పరిహారాన్ని సకాలంలో అందించే విషయంలో బీమా సంస్థలు సకాలంలోనే స్పందిస్తున్నాయని చెప్పొచ్చు.
పాలసీదారుడికి జరిగిన నష్టాన్ని బీమా సంస్థకు తెలియజేసేందుకు అనేక మార్గాలున్నాయి. ఇప్పుడు ప్రతి బీమా సంస్థ తమ వెబ్‌సైటులో క్లెయిం సమాచారాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్లెయిం చేసుకునేందుకు పాటించాల్సిన నిబంధనలు, అవసరమైన పత్రాలన్నీ అందుబాటులో ఉంచాయి. వీటిని తీసుకొని, పూర్తి చేసి, పోస్టులో పంపిస్తే సరిపోతుందని చెబుతున్నాయి. కొన్ని బీమా సంస్థలు పూర్తిగా డిజిటల్‌ రూపంలోనే క్లెయింలను అంగీకరిస్తున్నాయి.
క్లెయింలను వేగంగా పరిష్కరించేందుకు పాలసీ నామినీ పాలసీదారుడి మృతి వివరాలను సాధ్యమైనంత తొందరగా బీమా సంస్థకు తెలియజేయాలి. అవసరమైన పత్రాలు, సమాచారం అందించాలి. డిజిటల్‌ విధానంలో క్లెయిం చేసుకునేటప్పుడు.. వివరాలన్నీ కచ్చితంగా ఉండేలా ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలి. పాలసీ సంఖ్య, పాలసీదారుడి పేరు, మరణించిన తేదీ, కారణం, ఎక్కడ మరణించారు తదితర వివరాలన్నీ జాగ్రత్తగా పూర్తి చేయాలి. పాలసీని క్లెయిం చేసుకుంటున్న నామినీ కూడా తనకు సంబంధించిన కొన్ని ప్రాథమిక వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ డిజిటల్‌లో చేయడం సాధ్యం కాకపోతే.. సమీపంలో ఉన్న బీమా సంస్థ శాఖకు వెళ్లి అక్కడ నుంచి పత్రాలు తీసుకొని, పూర్తి చేసి పంపించాలి. పాలసీని బీమా సలహాదారు/ఏజెంటు ద్వారా తీసుకుంటే.. ఈ విషయంలో వారి సేవలను పొందవచ్చు.
క్లెయిం సమాచారంతోపాటు పాలసీ అసలు డాక్యుమెంట్‌, మరణ ధ్రువీకరణ పత్రం, ప్రమాదంలో మరణిస్తే.. పోలీసు ఎఫ్‌ఐఆర్‌, పోస్ట్‌మార్టం నివేదిక, అనారోగ్యంతో మరణిస్తే.. చికిత్స అందించిన డాక్టర్‌/ఆసుపత్రి నివేదిక అవసరం అవుతాయి. నామినీ కేవైసీ, బ్యాంకు వివరాలు కూడా పంపించాలి. కొవిడ్‌-19 వల్ల మరణిస్తే.. దానికి సంబంధించిన ఆధారాలూ సమర్పించాల్సి ఉంటుంది.
భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నిబంధనల మేరకు బీమా క్లెయింకి సంబంధించిన అన్ని పత్రాలూ, వివరణలూ అందిన 30 రోజుల్లోగా పరిహారం అందించాలి. ఒకవేళ మరింత సమాచారం అవసరమని భావిస్తే.. దాన్ని వేగంగా పూర్తి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 90 రోజుల్లోగా అవసరమైన అన్ని లాంఛనాలూ పూర్తి చేయాలి. ఆ తర్వాత 30 రోజుల్లో బీమా మొత్తం అందించాలి.
కొవిడ్‌-19 మరణాల విషయంలో బీమా సంస్థలు సాధ్యమైనంత వేగంగా క్లెయింలను పరిష్కరిస్తున్నాయి. ఈ విషయంలో ఏదైనా సమస్య వస్తే.. బీమా సంస్థ సలహా కేంద్రాన్ని సంప్రదించడం మేలు.
పాలసీదారులందరూ ఒక విషయాన్ని మర్చిపోవద్దు.. ప్రీమియం బకాయి లేకుండా చూసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత అవసరం. ఒక్క ప్రీమియం చెల్లించకపోయినా.. పాలసీని క్లెయిం చేసుకోవడంలో నామినీలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని