Updated : 18 Jun 2021 05:47 IST

ఫండ్ల బాటలో.. అపోహలు వద్దు..

దీర్ఘకాలిక పెట్టుబడులు.. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి అనగానే చాలామందికి మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలే గుర్తుకొస్తాయి. వైవిధ్యంగా మదుపు చేయడంతోపాటు, చిన్న మొత్తంతోనూ వీటిని ఎంచుకోవచ్చు. ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల మొత్తం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నా.. కొన్ని అపోహలతో చాలామంది మ్యూచువల్‌ ఫండ్లకు దూరంగానే ఉంటున్నారు.
మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను అర్థం చేసుకోవడం సులభమే. ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం, సాంకేతికత ఫండ్లలో మదుపు చేసే వారికి ఎన్నో సౌకర్యాలను తీసుకొచ్చింది. అయినప్పటికీ.. తొలిసారి ఫండ్లలో మదుపు చేసే యువత కొన్ని పొరపాట్ల వల్ల వీటి మదుపు ద్వారా ఆశించిన ఫలితం పొందలేకపోతున్నారు.
డీమ్యాట్‌ ఖాతా అవసరమా?
షేర్లలో మదుపు చేసేందుకు తప్పనిసరిగా డీమ్యాట్‌ ఖాతా ఉండాల్సిందే. కానీ, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులకు ఈ ఖాతా అవసరం లేదు. ఉంటే.. ఆ ఖాతా ద్వారానూ ఫండ్లలో మదుపు చేయొచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ వెబ్‌సైటు నుంచే నేరుగా ఎంపిక చేసిన ఫండ్లలో మదుపు చేయొచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా.. మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధనలను పూర్తి చేయడమే. అయితే, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్‌)లో  పెట్టుబడి పెట్టాలంటే.. తప్పనిసరిగా డీమ్యాట్‌ కావాలి.
నష్టభయం అధికంగా ఉంటుందా?
మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేటప్పుడు.. చెప్పే మాట.. ఫండ్లలో నష్టభయం ఉంటుంది.. కాబట్టి, ఆ పథకానికి సంబంధించిన పత్రాన్ని జాగ్రత్తగా చదవాలని చెబుతుంటారు. మ్యూచువల్‌ ఫండ్లు మార్కెట్‌తో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి, మార్కెట్‌ పనితీరును బట్టి, ఇవి ప్రతిస్పందిస్తాయి. వీటిని నిపుణులు నిర్వహిస్తారు. కాబట్టి, మార్కెట్‌లోని వివిధ దశల నుంచి లాభాలను ఆర్జించేందుకు వారు ప్రయత్నిస్తుంటారు.
ఐదేళ్లకు మించి మదుపు చేసే వారు.. ఈక్విటీ పథకాలను ఎంచుకోవాలి. 3-5 ఏళ్ల మధ్య కాలానికి పెట్టుబడి పెట్టేవారు హైబ్రిడ్‌ స్కీలంనూ, అంతకన్నా తక్కువ వ్యవధికి కావాలనుకుంటే.. ఫిక్స్‌డ్‌ ఇన్‌కం పథకాలనూ ఎంచుకోవాలి.

పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి?
ఫండ్‌ పథకాల్లో మదుపు చేయాలంటే.. అధిక మొత్తంలో పెట్టుబడి కావాలని ఇప్పటికీ చాలామంది భావిస్తుంటారు. కొత్తగా సంపాదించడం ప్రారంభించిన వారూ.. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికీ ఇవి సరిపోతాయి. నెలనెలా కనీస మొత్తం రూ.500తోనూ వీటిలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)లో పెట్టుబడి పెట్టొచ్చు. క్రమశిక్షణతో మదుపును కొనసాగించేందుకు ఇవి ఎంతో  ఉపకరిస్తాయి.
దీర్ఘకాలం కొనసాగించాలా?
ప్రతి అవసరానికీ మ్యూచువల్‌ ఫండ్లు సరిపోయేలా మ్యూచువల్‌ ఫండ్లు అందుబాటులో ఉంటాయి. వీటిని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. అయితే, దీర్ఘకాలం పెట్టుబడిని కొనసాగించడం వల్ల చక్రవడ్డీ ఫలితాలు అందుతాయి.
వైవిధ్యం అంతగా ఉండదు..
పెట్టుబడుల కోసం మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకునే వారికి ఎన్నో రకాల అవకాశాలున్నాయి. లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌, మల్టీ క్యాప్‌, క్రెడిట్‌ ఫండ్‌, బాండ్‌ ఫండ్‌, డ్యూరేషన్‌ ఫండ్‌, లిక్విడ్‌ ఫండ్‌, గోల్డ్‌ ఫండ్‌, రిటైర్మెంట్‌ ఫండ్‌, చిల్డ్రన్స్‌ ఫండ్‌, హైబ్రిడ్‌ ఫండ్‌, గ్లోబల్‌ ఫండ్‌, సెక్టార్స్‌ ఫండ్‌, ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఇలా ఎన్నో విభిన్న రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెట్టుబడిదారుడు తన అవసరం మేరకు ఫండ్లను ఎంచుకోవచ్చు. ఇటీవల కాలంలో క్వాంట్‌ ఫండ్‌, ఈఎస్‌జీ ఫండ్లూ వచ్చాయి.
కరోనా మన ఆరోగ్యానికి శత్రువులాగా తయారయ్యింది. ఈ సమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు, ఆర్థికంగానూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న ఖర్చులు తట్టుకుంటూనే.. భవిష్యత్‌ గురించీ ఆలోచించాలి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా రూపాయి రూపాయినీ కాపాడుకోవాలి. దాన్ని జాగ్రత్తగా పెట్టుబడి పెట్టినప్పుడే.. అనిశ్చితి ఎదురైనా.. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండగలం.

రుసుములు అధికంగా..

మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ మ్యూచువల్‌ ఫండ్లనూ నియంత్రిస్తుంది. కాబట్టి, సెబీ నిబంధనలను ఫండ్‌ సంస్థలు పాటిస్తాయి. మ్యూచువల్‌ ఫండ్ల రకాలను బట్టి, ఎంత రుసుములు, ఛార్జీలు వసూలు చేయాలనేది సెబీ పరిమితులు విధించింది. వాటికి అనుగుణంగానే గరిష్ఠ ఛార్జీలను వసూలు చేస్తారు. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల మధ్య పోటీ నేపథ్యంలో కొన్ని ఫండ్‌ సంస్థలు తక్కువ రుసుములనే తీసుకుంటున్నాయి.

- అశ్విన్‌ పత్ని,హెడ్‌ ప్రొడక్ట్స్‌, యాక్సిస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని