Updated : 25 Jun 2021 05:13 IST

నెలకు రూ.30వేలు రావాలంటే...

* నేను మరో రెండేళ్లలో పదవీ విరమణ చేయబోతున్నాను. ఆ తర్వాత నెలకు కనీసం రూ.30,000 వరకూ వచ్చే ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. దీనికోసం రిటైర్‌ అయ్యేనాటికి నా దగ్గర ఎంత నిధి ఉండాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది? - ప్రవీణ్‌ కుమార్‌
రెండేళ్ల తర్వాత మీ పెట్టుబడిపై నెలకు కనీసం రూ.30వేలు రావాలంటే.. 6 శాతం రాబడి అంచనాతో రూ.60లక్షల నిధి ఉండాలి. అదే 7శాతం రాబడి వస్తే.. రూ.52లక్షలు అవసరం. 8శాతం రాబడి వచ్చేలా మదుపు చేస్తే రూ.45 లక్షలు సరిపోతాయి. పదవీ విరమణ తర్వాత నష్టభయం లేని పథకాలను ఎంచుకుంటే.. 6 శాతం వరకే రాబడి వచ్చే వీలుంది. అధిక రాబడి రావాలంటే.. మొత్తం పెట్టుబడిలో 75శాతం వరకూ సురక్షిత పథకాల్లోనూ.. 25 శాతం దాకా ఈక్విటీ ఆధారిత పథకాలకూ కేటాయించాలి. ఇలా చేయడం వల్ల సగటున 8శాతం వరకూ రాబడిని ఆర్జించే అవకాశం ఉంది. అప్పటి పరిస్థితులను బట్టి, సురక్షిత పథకాలు ఏవి ఎంచుకోవాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.


* మా 12 ఏళ్ల అమ్మాయి పేరుతో ఒక మనీ బ్యాక్‌ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. నెలకు కనీసం రూ.10వేల వరకూ ప్రీమియం చెల్లించగలను. ఇది మంచి ఆలోచనేనా? - జ్యోతి
ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ అవసరాలకు రక్షణ కల్పించేందుకు కుటుంబంలో ఆర్జించే వ్యక్తి వార్షికాదాయానికి 10-12 రెట్లు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. మీ అమ్మాయి పేరుమీద మనీ బ్యాక్‌ పాలసీ తీసుకోవడం కన్నా.. రూ.10వేలను క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ పథకాల్లో మదుపు చేయండి. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మంచి రాబడికి ఆస్కారం ఉంటుంది. నెలకు రూ.10వేలను కనీసం ఏడేళ్లపాటు, 12 శాతం రాబడి అంచనాతో పెట్టుబడి పెడితే.. దాదాపు రూ.12,10,681 జమ అయ్యేందుకు అవకాశం ఉంది.


 * నాలుగేళ్ల క్రితం ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఏక మొత్తంలో రూ.80,000 మదుపు చేశాను. ఇప్పటికీ ఆ ఫండ్‌లో పెద్దగా రాబడి కనిపించడం లేదు. ఇప్పుడు మళ్లీ పన్ను మినహాయింపు కోసం ఆ మొత్తాన్ని తీసి, కొత్తగా వేరే ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చా? అందులోనే మరికొన్నాళ్లు కొనసాగాలా? - శేఖర్‌

మీరు మదుపు చేసిన ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పనితీరు బాగా లేదంటున్నారు కాబట్టి, అందులో నుంచి పెట్టుబడిని  వెనక్కి తీసుకోండి. తదనంతరం మంచి పనితీరున్న  రెండు మూడు ఈఎల్‌ఎస్‌ఎస్‌లను ఎంచుకొని, ఆ మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టండి. పాత ఫండ్‌లోనే కొనసాగించడం వల్ల మీకు కొత్తగా పన్ను మినహాయింపు రాదు. కొత్తగా ఫండ్లలో మదుపు చేసినప్పుడు దాన్ని సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు కోసం చూపించుకోవచ్చు. కొత్త పెట్టుబడిని మూడేళ్లపాటు కొనసాగించాలని గుర్తుంచుకోండి.


* నేను ఒక వ్యాపారిని. నేను టర్మ్‌ పాలసీ తీసుకోవాలంటే వీలవుతుందా? ఒక ప్రమాదంలో నా తలకు బలమైన గాయాలయ్యాయి. కొన్నాళ్లు ఆసుపత్రిలో ఉన్నాను. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. ఈ విషయం పాలసీ తీసుకునేటప్పుడు చెప్పాలా? - కృష్ణా రెడ్డి

వ్యాపారం చేసేవారూ  టర్మ్‌ పాలసీని తీసుకునేందుకు వీలుంది. అయితే, మీ వయసు, మీరు ఎంచుకునే పాలసీ మొత్తాన్ని బట్టి, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా బీమా సంస్థలు అడుగుతాయి. మీరు దరఖాస్తు పత్రంలో మీకు జరిగిన ప్రమాదం వివరాలన్నీ తెలియజేయండి. ఇలాంటప్పుడు బీమా సంస్థ కొన్ని అదనపు ఆరోగ్య పరీక్షలు అడగవచ్చు. అన్ని వివరాలూ పరిశీలించాక, బీమా సంస్థ విచక్షణ మేరకు మీకు పాలసీ అందుతుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts