ఫార్మా షేర్లలో మదుపు...

స్టాక్‌మార్కెట్లో ఫార్మా షేర్లు ఇటీవల కాలంలో మదుపరులకు లాభాల పంట పండించాయి. ఫార్మా కంపెనీలు అధిక ఆదాయాలు,

Published : 25 Jun 2021 01:27 IST

స్టాక్‌మార్కెట్లో ఫార్మా షేర్లు ఇటీవల కాలంలో మదుపరులకు లాభాల పంట పండించాయి. ఫార్మా కంపెనీలు అధిక ఆదాయాలు, లాభాలు ఆర్జించటం దీనికి ప్రధాన కారణం. ఫార్మా రంగంలో మరికొన్నేళ్ల పాటు వృద్ధి అవకాశాలు ఉన్నాయని., కాబట్టి ఈ రంగానికి చెందిన కంపెనీలపై పెట్టుబడి ఆకర్షణీయమేననే అభిప్రాయాలను ఇటీవల కాలంలో స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫార్మా రంగానికి చెందిన షేర్లలో పరోక్షంగా పెట్టుబడి అవకాశాన్ని మదుపరులకు కల్పించేందుకు నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌, కొత్తగా నిప్పాన్‌ ఇండియా నిఫ్టీ ఫార్మా ఈటీఎఫ్‌ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 28. కనీస పెట్టుబడి రూ.1,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌. అదే విధంగా    ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌) కూడా. దీన్ని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ)లో లిస్ట్‌ చేస్తారు. ప్రధానంగా నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లోని షేర్లలో  ఈ ఫండ్‌ పెట్టుబడులు ఉంటాయి. మెహుల్‌ దామా దీనికి ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.

ఈటీఎఫ్‌ క్రయవిక్రయాలు ఎంతో సులువు. స్టాక్‌ ఎక్స్ఛేంజీ టెర్మినల్‌ మీద నిర్వహించవచ్చు. ఒక యూనిట్‌ కొనుగోలు చేయటం అంటే, దాన్లో ఉన్న 10 కంపెనీల షేర్లను కొనుగోలు చేసినట్లు అవుతుంది. సాధారణంగా ఈటీఎఫ్‌ వ్యయాలూ తక్కువగా ఉంటాయి. ఆ మేరకు మదుపరులకు మేలు జరుగుతుంది.
సమీప భవిష్యత్తులో ఫార్మా రంగం వృద్ధి అవకాశాలపై విశ్వాసం ఉన్న మదుపరులకు ఈ పథకం అనుకూలం. గత ఏడాదిన్నర కాలంలో ఫార్మా రంగంపై పెట్టుబడులు అధిక లాభాలు ఇచ్చినందువల్ల భవిష్యత్తులోనూ అదే విధంగా జరుగుతుందనే అభిప్రాయానికి రాలేం. కానీ కొవిడ్‌-19 ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోకపోవటంతో పాటు ఔషధ రంగంలో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని ఫార్మా కంపెనీలు మంచి ఆదాయాలు, లాభాలు ఆర్జించే అవకాశం ఉందనే నమ్మకం కలుగుతుంది. దీనిపై నమ్మకం ఉన్న మదుపరులు ఈ ఫార్మా ఈటీఎఫ్‌ ఫండ్‌ను పరిశీలనలోకి తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని