చిన్న కంపెనీల్లో మదుపు...

పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ ఒక స్మాల్‌ క్యాప్‌ పథకాన్ని తీసుకొచ్చింది. పీజీఐఎం ఇండియా స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌- అనే ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ...

Published : 09 Jul 2021 00:18 IST

పీజీఐఎం ఇండియా స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌

పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ ఒక స్మాల్‌ క్యాప్‌ పథకాన్ని తీసుకొచ్చింది. పీజీఐఎం ఇండియా స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌- అనే ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ఈ నెల 23న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. సిప్‌ (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) పద్ధతిలోనూ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం పనితీరును నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 100 సూచీతో పోల్చి చూస్తారు. ప్రధానంగా స్మాల్‌ క్యాప్‌ తరగతికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటం ద్వారా మదుపరులకు మంచి లాభాలు ఆర్జించి పెట్టాలనేది ఈ పథÅ]కం లక్ష్యం. మొత్తం సొమ్ములో 65 శాతం వరకూ స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో పెట్టుబడి పెడతారు. ఈ పథకానికి అనిరుధ్‌ సాహ, కుమరేష్‌ రామకృష్ణన్‌, రవి అడుకియా ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.

కార్పొరేట్‌ సంస్థల ఆదాయాల్లో గణనీయమైన పెరుగుదలకు అవకాశం ఉన్నట్లు దీనివల్ల స్మాల్‌ క్యాప్‌ తరగతికి చెందిన కంపెనీలు బాగా లాభపడతాయని విశ్వసిస్తున్నట్లు పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది. గత కొంత కాలంగా స్మాల్‌ క్యాప్‌ తరగతికి చెందిన కంపెనీల షేర్ల ధరలు బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో ప్రతిఫలం ఇటీవల ఎంతో అధికంగా నమోదైంది. కానీ ఈ విభాగంలో అధిక రిస్కు- అధిక ప్రతిఫలం అనేది సర్వసాధారణం. అందువల్ల మదుపరులు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని తాము ఏమేరకు రిస్కు భరించగలమనేది బేరీజు వేసుకొని స్మాల్‌ క్యాప్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టాలి.


దీర్ఘకాలంలో మూలధన వృద్ధి కోసం..
నవీ నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఫండ్‌

ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్‌ బన్సల్‌ ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి స్థాపించిన నవీ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఆవిష్కరించింది. ‘నవీ నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 12. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.500. తక్కువ రిస్కుతో దీర్ఘకాలంలో మూలధన వృద్ధిని ఆశించే వారికి ఇటువంటి ఇండెక్స్‌ పథకాలు అనుకూలంగా ఉంటాయి. ప్యాసివ్‌ ఫండ్స్‌ తరగతికి చెందిన ఈ ఫండ్‌ వ్యయాల నిష్పత్తి (ఎక్స్‌పెన్సెస్‌ రేషియో) ఎంతో తక్కువగా (డైరెక్ట్‌ ప్లాన్‌కు 0.06%) ఉండటం ప్రత్యేకత. ప్రస్తుతం ఇతర ఇండెక్స్‌ ఫండ్ల వ్యయాల నిష్పత్తి 0.15% నుంచి 0.20% వరకూ ఉండటం గమనార్హం. టెక్నాలజీని వినియోగించటం, తమ పంపిణీదార్లతో కలిసి పనిచేయటం ద్వారా ఫండ్‌ నిర్వహణ వ్యయాన్ని తక్కువగా నిర్ణయించగలిగినట్లు నవీ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ-సీఈఓ సౌరభ్‌ జైన్‌ వివరించారు. అన్ని మ్యూచువల్‌ ఫండ్లలో నిపుణులైన పోర్ట్‌ఫోలియో మేనేజర్లు ఉంటారు, అయినా కొన్ని పథకాలకు అధిక వ్యయాలు ఎందుకు చెల్లించాలి..., అని అన్నారు. తక్కువ ఖర్చులో మదుపరులకు సరైన పెట్టుబడుల అవకాశాన్ని అందించాలనేది తమ లక్ష్యమని వివరించారు.

ఇటీవల కాలంలో మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో ప్యాసివ్‌ ఫండ్స్‌ (ఫండ్‌ మేనేజర్‌ పాత్ర పరిమితంగా ఉండటం) వాటా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. తక్కువ వ్యయాలు, ఫండ్‌ మేనేజర్‌ పాత్ర పరిమితంగా ఉండటం వంటి అంశాలను  పరిగణనలోకి తీసుకొని ఇటువంటి పథకాల వైపు మదుపరులు మొగ్గుచూపుతున్నారు. యూఎస్‌ మార్కెట్లో మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల కింద ఉన్న పెట్టుబడుల మొత్తంలో 40 శాతం ప్యాసివ్‌ ఫండ్స్‌లోనే ఉండటం ప్రత్యేకత. యూఎస్‌లోని అతిపెద్ద అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) అయిన వ్యాన్‌గార్డ్‌ తక్కువ వ్యయాలు ఉండే పెట్టుబడి పథకాలను ఆవిష్కరిస్తూ మదుపరులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని