ఆరోగ్య బీమా.. రూ.5 కోట్ల వరకూ..

పూర్తిస్థాయి ఆరోగ్య బీమా పాలసీని ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఆవిష్కరించింది. ‘ఆరోగ్య సుప్రీమ్‌’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ పాలసీని ...

Updated : 09 Jul 2021 05:05 IST

పూర్తిస్థాయి ఆరోగ్య బీమా పాలసీని ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఆవిష్కరించింది. ‘ఆరోగ్య సుప్రీమ్‌’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ పాలసీని రూ.5 కోట్ల వరకూ తీసుకునే వీలుండటం విశేషం. మొత్తం 20 రకాల ప్రాథమిక, 8 రకాల ఐచ్ఛిక కవర్లు ఈ పాలసీలో అందుబాటులో ఉన్నాయి. పాలసీదారులు ప్రో, ప్లస్‌, ప్రీమియం ఐచ్ఛికాలను ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ విలువ, రక్షణ కల్పించే తీరు ఆధారంగా వీటిని విభజించారు. ఒకసారి బీమా పాలసీ మొత్తం పూర్తయినా.. దాన్ని తిరిగి భర్తీ చేసే వెసులుబాటులాంటివి ఉన్నాయి. పాలసీని క్లెయిం చేసుకోని సంవత్సరంలో నో క్లెయిం బోనస్‌ వర్తిస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా ఎన్‌సీబీ ప్రొటెక్టర్‌ ఆప్షనల్‌ కవర్‌నూ ఎంచుకోవచ్చు.  పాలసీ పునరుద్ధరణ ప్రయోజనం కింద.. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అనుమతి ఉంది. కుటుంబం అంతా కలిసి పాలసీ తీసుకున్నప్పుడు రాయితీ వర్తిస్తుంది. దీంతోపాటు లాయల్టీ డిస్కౌంట్‌, టర్మ్‌ పాలసీ డిస్కౌంట్‌ లాంటివీ ఈ పాలసీ అందిస్తోంది. కొవిడ్‌-19 రెండో దశ తర్వాత అధిక విలువ ఆరోగ్య బీమా పాలసీలకు గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఈ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఎయిర్‌ అంబులెన్స్‌ ఖర్చునూ ఇది చెల్లిస్తుంది. 91 రోజుల నుంచి 65 ఏళ్ల వయసు లోపు వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. 1, 2, 3 ఏళ్ల వ్యవధికి ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. సాధారణ చికిత్సలతోపాటు, మానసిక అనారోగ్యం, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ కవర్‌, జన్యులోపాలు, బేరియాట్రిక్‌ సర్జరీలాంటి ప్రత్యేక చికిత్సలకూ ఈ పాలసీ వర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని