వైద్య ఖర్చులన్నీ రావాలంటే..

పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే ఆరోగ్య బీమా ఇప్పుడు తక్షణ అవసరం. కొత్తగా దీన్ని తీసుకునే వారు తాము తీసుకుంటున్న పాలసీ ఎంత మేరకు తమకు రక్షణ కల్పిస్తుందో ఒకటికి

Updated : 09 Jul 2021 05:00 IST

పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే ఆరోగ్య బీమా ఇప్పుడు తక్షణ అవసరం. కొత్తగా దీన్ని తీసుకునే వారు తాము తీసుకుంటున్న పాలసీ ఎంత మేరకు తమకు రక్షణ కల్పిస్తుందో ఒకటికి రెండుసార్లు పరిశీలించి చూసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకోకుండా తీసుకొని, తీరా క్లెయిం చేసిన తర్వాత పరిహారం తగ్గించి ఇస్తామని బీమా సంస్థ చెబితే.. ఆందోళన తప్పదు. ఈ విషయంలో చాలామందికి ఆర్థికకష్టాలు వచ్చిన ఇక్కడ మర్చిపోకూడదు. అందుకే,  పాలసీని ఏ సందర్భంలో తిరస్కరిస్తారు.. ఎప్పుడు పరిహారం మొత్తం తగ్గిస్తారు.. పాలసీదారులుగా మనం ఎలాంటి  జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం..

సహ చెల్లింపు: ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందినప్పుడు.. అయిన ఖర్చులో కొంత భాగం పాలసీదారుడు భరించాలని నిబంధన ఉంటుంది. దీన్నే బీమా పరిభాషలో కోపే అని పిలుస్తారు. పాలసీ తీసుకునేటప్పుడే ప్రీమియం తగ్గుతుందనే ఆలోచనతో కొంతమంది దీనికి అంగీకరిస్తుంటారు. బీమా సంస్థలు పాలసీదారులు పాలసీదారుడిలో బాధ్యతను పెంచేందుకూ దీన్ని వాడుకుంటాయి. తాను కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిసినప్పుడు పాలసీదారులు ప్రతి బిల్లునూ తనిఖీ చేస్తారు. లేకపోతే అంతగా పట్టించుకోరు. కోపే 20 శాతం ఉందనుకుందాం.. అప్పుడు ఆసుపత్రి ఖర్చు రూ.50,000 అయితే.. అందులో రూ.10వేలు పాలసీదారుడు భరించాల్సిందే. మిగతా రూ.40వేలు మాత్రమే బీమా సంస్థ చెల్లిస్తుంది. చిన్న మొత్తంలో బిల్లు ఉన్నప్పుడు పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కానీ, రూ.5లక్షల బిల్లు అయి.. రూ.లక్ష చేతి నుంచి చెల్లించినప్పుడు కష్టంగా మారుతుంది. అందుకే, పాలసీ తీసుకునేటప్పుడే.. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

గది అద్దె: పాలసీలు తీసుకునేటప్పుడు గది అద్దెపై నియంత్రణ ఉందా అన్న విషయాన్ని గమనించరు. ఇది పెద్ద పొరపాటు. మీ పాలసీ విలువ, చేరిన ఆసుపత్రిని బట్టి, గది అద్దె పరిమితి మారుతుంది. పాలసీ మొత్తంలో 1-2 శాతం మాత్రమే గది అద్దె చెల్లిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఐసీయూ గది అద్దెపై నియంత్రణ పెట్టకూడదని ఐఆర్‌డీఏఐ స్పష్టమైన  ఆదేశాలనిచ్చింది. మీరు రూ.3లక్షల పాలసీ తీసుకున్నారనుకుందాం.. అప్పుడు గది అద్దె 1శాతమే చెల్లిస్తామని బీమా సంస్థ చెబితే.. రూ.3వేలు అవుతుంది. ఆసుపత్రిలో గది అద్దె రూ.5,000 ఉంటే.. ఆ మిగిలిన రూ.2వేలు పాలసీదారుడు భరించాల్సిందే. ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు ఇది భారంగా మారుతుంది. పాలసీ తీసుకునేటప్పుడు.. ఆసుపత్రిలో చేరినప్పుడు.. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే తక్కువ మొత్తం పాలసీదారుడి చేతి నుంచి భరించేందుకు వీలవుతుంది.

ప్రాంతాలు మారినప్పుడు..
ప్రాంతాలను బట్టి వైద్య ఖర్చుల్లో తేడా ఉంటుంది. అందుకే బీమా సంస్థలూ నగరాల ఆధారంగా ప్రీమియాన్ని వసూలు చేస్తుంటాయి. మీరు చిన్న నగరాల్లో ఉన్నట్లుగా పాలసీ తీసుకొని, చికిత్స కోసం మెట్రో నగరాలకు వెళ్తే.. క్లెయిం పూర్తి మొత్తం రాకపోవచ్చు. బీమా సంస్థలు కొంత మేరకు సహ చెల్లింపు చేయాల్సిందిగా అడుగుతాయి.

ఉప పరిమితులు..
కొన్ని చికిత్సా విధానాలకు పాలసీలో కొంత పరిమితి విధించే అవకాశం ఉంటుంది. దీన్ని ఉప పరిమితులుగా పేర్కొంటారు. ఉదాహరణకు పాలసీ మొత్తంతో నిమిత్తం లేకుండా కొన్ని పాలసీల్లో ఆయుష్‌ చికిత్సకు రూ.50వేల వరకూ పరిమితి ఉంటుంది. ఆసుపత్రిలో చేరకముందు.. ఇంటికి వెళ్లిన తర్వాత నిర్ణీత కాలంపాటు వైద్య ఖర్చులను బీమా సంస్థ చెల్లిస్తుంది. కొన్ని పాలసీలు.. ఆసుపత్రి బిల్లులో గరిష్ఠంగా 10శాతానికి మించి చెల్లించడం లేదు. వీటితోపాటు కొన్ని రకాల చికిత్సలకు స్థిరంగా ఇంత మొత్తం అని ఇస్తుంటాయి. కంటి శుక్లం, హెర్నియాలాంటి వాటివి ఇందుకు ఉదాహరణ.

ఇతర ఖర్చులు..

సాధారణంగా ఆసుపత్రి బిల్లులో 3-6 శాతం వరకూ ఖర్చు గ్లౌజులు, డ్రెస్సింగ్‌, కాటన్‌.. వాడిపారేసే వస్తువులు తదితరాలకు అవుతుంది. కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ మొత్తం 15-20శాతానికి పెరిగింది. పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, ఫేస్‌ షీల్డులకయ్యే ఖర్చును బీమా పాలసీ ఇవ్వకపోవచ్చు. ఇలాంటప్పుడు పాలసీదారుడు ఆ ఖర్చును భరించాల్సిందే.

బీమా పాలసీని ఎంచుకునేటప్పుడు మీ అవసరాలకు నప్పే పాలసీని ఎంచుకోవడం మంచిది. పాలసీ గురించి ఉన్న అనుమానాలన్నింటినీ బీమా సంస్థను అడిగి నివృత్తి చేసుకోవాలి. ఆ తర్వాతే సరైన నిర్ణయం తీసుకుంటే పాలసీదారులపై ఆర్థిక భారం పడకుండా ఉంటుంది.

- రాజగోపాల్‌ రుద్రరాజు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, టాటా ఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని