Updated : 09 Jul 2021 04:52 IST

విద్యా రుణానికి సిద్ధం ఇలా...

దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సుల్లో చేరడానికి సిద్ధం అవుతున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి విద్యా  సంవత్సరం క్యాలెండర్‌ను పూర్తిగా మార్చేసింది. సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ.. విద్యార్థులు తమ భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని అనుకుంటున్న వారు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వదేశం, విదేశం..  ఎక్కడైనా సరే.. ఉన్నత విద్య ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. అయితే, విద్యారుణాలు ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుంటాయి. కరోనా తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో.. విద్యారుణాలు పొందడం ఎలా అనేది చూద్దాం..

హమ్మారి నేపథ్యంలో కాలేజీల్లో ప్రవేశాలు ఆలస్యం అవుతున్నాయి. విశ్వవిద్యాలయాలు ప్రవేశ పరీక్షలను నిర్వహించలేకపోతున్నాయి. గత ఏడాది పూర్తి కావాల్సిన కోర్సులూ ఇంకా జరుగుతున్నాయి. కొత్త కోర్సుల గురించి స్పష్టత లేదు. అర్హత ఉన్న విద్యార్థులు.. తమకు నచ్చిన యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఎదురుచూస్తూ.. అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో బ్యాంకులనూ విద్యా రుణాల కోసం సంప్రదించడం ప్రారంభించాలి.

ఎవరికి ఇస్తారు..
గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదవడానికి సిద్ధమవుతున్న 18-35 ఏళ్ల లోపు వయసున్న విద్యార్థులు ఈ రుణాలను పొందడానికి అర్హులు. విశ్వవిద్యాలయాల్లో చదివే వారే కాకుండా.. గుర్తింపు పొందిన నైపుణ్యాల శిక్షణ కోసమూ ఈ రుణాలను తీసుకోవచ్చు. చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఆదాయం ఉండదు కాబట్టి, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు రుణానికి సహ దరఖాస్తుదారులుగా ఉంటారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరిన వెంటనే రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వారు రుణ వాయిదాలను చెల్లించడంలో విఫలం అయితే, ఆ బాధ్యత సహ దరఖాస్తులుగా ఉన్న వారికి బదిలీ అవుతుంది.

హామీ అవసరమే...
సాధారణంగా బ్యాంకులు రూ.7.5లక్షల వరకూ విద్యా రుణాన్ని ఎలాంటి హామీలు అవసరం లేకుండానే అందిస్తాయి. అంటే.. బ్యాంకుకు మీరు ఏ విధమైన తనఖాలు చూపెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ రుణ మొత్తం ఇంతకన్నా అధికంగా కావాలనుకుంటే.. అప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు హామీ చూపించాల్సిందిగా అడుగుతాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఆస్తులులాంటివి అవసరం అవుతాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది.. విద్యార్థులు ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చేరినప్పుడు రూ.40 లక్షల వరకూ ఎలాంటి హామీ అవసరం లేని రుణాలను బ్యాంకులు అందించేందుకు ముందుకు వస్తుంటాయి.

15 ఏళ్ల వరకూ..
విద్యా రుణాన్ని 15 ఏళ్ల వరకూ తీర్చేందుకు వెసులుబాటు ఉంది. విద్యార్థులకు ఏడాది కాలం పాటు మారటోరియం సౌకర్యమూ ఉంటుంది. కోర్సు పూర్తయిన 12 నెలల వరకూ వాయిదాలు చెల్లించకపోయినా ఇబ్బంది ఉండదన్నమాట. ఆ తర్వాత రుణగ్రహీత ఉద్యోగంలో చేరినా.. చేరకపోయినా.. వాయిదాల చెల్లింపులు ప్రారంభం అవుతాయి. కొన్నిసార్లు ఈ మారటోరియాన్ని పెంచే అవకాశమూ ఉంది. అయితే, ఈ వ్యవధిలో వడ్డీ రుణ మొత్తానికి జమ అవుతుంది. కాబట్టి, ఆ మేరకు రుణ భారం పెరుగుతుంది. మారటోరియం వీలైనంత వరకూ తక్కువగా వినియోగించుకోవాలి. ఉద్యోగంలో చేరిన వెంటనే రుణ వాయిదాలను చెల్లించడం మేలు.

ఎందుకోసం?
కోర్సుకు అయ్యే ట్యూషన్‌ ఫీజు, పుస్తకాల ఖర్చు, ల్యాబ్‌, లైబ్రరీ ఫీజులు, ల్యాప్‌టాప్‌ కొనుగోలు తదితరాలన్నీ విద్యారుణం పరిధిలోకి వస్తాయి. వీటితోపాటు హాస్టల్‌ ఖర్చులనూ రుణంలో భాగంగా తీసుకోవచ్చు. కొవిడ్‌-19 నేపథ్యంలో ఇప్పుడు కోర్సులన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. కాబట్టి, కొన్ని ఖర్చులను విద్యా రుణ పరిధిలో నుంచి మినహాయిస్తున్నారు. అవసరమైన ఖర్చులనే రుణంగా ఇస్తున్నాయి బ్యాంకులు.  కోర్సు ఫీజులు కాకుండా.. ఇతర ఖర్చులకు సాధ్యమైనంత తక్కువగా రుణం తీసుకుంటేనే మంచిది. రుణ మొత్తం పెరుగుతున్న కొద్దీ బ్యాంకులు కొంత చేతి నుంచి భరించాల్సిందిగా చెబుతుంటాయి. రుణం రూ.వేల నుంచి రూ.కోటి వరకూ తీసుకునే వీలుంటుంది. కానీ, విద్యార్థికి ఆ మేరకు రుణం పొందేందుకు తగిన అర్హత ఉండాలి. బ్యాంకులను బట్టి, ఈ నిబంధనలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా తీసుకున్న అప్పును తీర్చేందుకు విద్యార్థికీ, సహ దరఖాస్తుదారుడికీ ఎంత మేరకు శక్తి ఉందనేదే ఇక్కడ కీలకం. ఆదాయం వివరాలు, పన్ను చెల్లింపు రిటర్నులు, ఆస్తులు, క్రెడిట్‌ స్కోరు ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటాయి బ్యాంకులు.

పన్ను ప్రయోజనాలు..
ఒకసారి విద్యారుణాన్ని తిరిగి చెల్లించడం ప్రారంభించిన తర్వాత.. వడ్డీ మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80ఈ ప్రకారం పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఇలా ఎనిమిదేళ్లపాటు వడ్డీని ఎలాంటి పరిమితి లేకుండా క్లెయిం చేసుకోవచ్చు. విద్యార్థి తల్లిదండ్రుల పేరు మీద రుణం తీసుకుంటే.. ఈ మినహాయింపును వారు తీసుకోవచ్చు. గుర్తింపు పొందిన బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకున్నప్పుడే ఈ సెక్షన్‌ వర్తిస్తుంది. బంధువులు, మిత్రులు, కార్యాలయాల నుంచి తీసుకున్న అప్పు ఈ పరిధిలోకి రాదు.

కొవిడ్‌-19 తర్వాత అనుకున్న సమయానికి కోర్సులు పూర్తి కాకపోవడం, ఉద్యోగాలు దొరకకపోవడంలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. మరోవైపు విద్యారుణాల్లో నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయని బ్యాంకులు ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే రుణం తీసుకున్న వారిపై అవి ఒత్తిడి పెంచుతున్నాయి. మీరు విద్యారుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. దాన్ని ఎలా తీరుస్తారనే వ్యూహాన్నీ ముందుగానే వేసుకోండి. సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోతే.. హామీ ఇచ్చిన ఆస్తులను బ్యాంకు జప్తు చేయడం, క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం లాంటి ప్రతికూలతలు ఉంటాయి. భవిష్యత్తులో కొత్త రుణాలు  అవసరం అయినప్పుడు అంత తేలికగా దొరకకపోవచ్చు.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని