Published : 06 Aug 2021 00:24 IST

పెట్టుబడుల జాబితా సమీక్షించుకునే తరుణమిదే...

కొవిడ్‌-19 ప్రభావంతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవన కాల గరిష్ఠాలనూ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో మనమూ మన పెట్టుబడుల జాబితాను సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. కొత్తగా పెట్టుబడులు పెట్టే ముందు పాత పెట్టుబడుల పనితీరును చూసుకోవాలి. మరి అందుకు ఏం చేయాలో చూద్దామా!

లక్ష్యాలు మారాయా?

మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు కొన్ని లక్ష్యాలను అనుకుంటాం. కానీ, కాలక్రమంలో వాటి ప్రాధాన్యత మారవచ్చు. పాత పథకాలు.. కొత్త లక్ష్యాలకు అనుగుణంగా ప్రతిఫలాలు ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా కొవిడ్‌ తర్వాత అత్యవసర నిధి అవసరం ఎంతో పెరిగింది. దీంతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలకన్నా.. స్వల్పకాలిక లక్ష్యాలపైనే దృష్టి సారించాల్సిన పరిస్థితులు వచ్చాయి. మరోవైపు కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ రావచ్చనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, అందుకు తగ్గట్టుగా మన పెట్టుబడులు ఉన్నాయా ఒకసారి చూసుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలను పెట్టుబడులో అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించండి.

పనితీరు బాగుందా..

ప్రస్తుతం నిఫ్టీ, సెన్సెక్స్‌ గరిష్ఠ స్థాయుల్లో ఉన్నాయి. మీరు మదుపు చేసిన పథకాలూ ఇదే తీరులో రాబడిని అందిస్తున్నాయా లేదా ఒకసారి పరిశీలించండి. మీరు ఎంచుకున్న పథకాల్లో అంతగా పనితీరు చూపించని వాటిని వదిలించుకునేందుకు ఇది సరైన తరుణమే. అయితే, ఈ పని చేసేముందు గత కొంతకాలంగా ఈ ఫండ్‌ ఎలా రాబడినిచ్చిందో కూడా పరిశీలించాలి. తాత్కాలికంగా ఇబ్బంది పడుతుంటే.. కొన్నాళ్లు ఓపిక పట్టి చూడొచ్చు.

కేటాయింపులు ఎలా?

వైవిధ్యంగా పెట్టుబడులు పెట్టడం ఎప్పుడూ అవసరమే. మీరు భరించగలిగే నష్టభయం, పెట్టుబడుల లక్ష్యం, వ్యవధి, ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు ఇలా ఎన్నో అంశాల ఆధారంగా పెట్టుబడుల కేటాయింపు జరగాలి. అయితే, గతంతో పోలిస్తే ఇప్పుడు మీ నష్టభయం భరించే సామర్థ్యంలో తేడా రావచ్చు. ముఖ్యంగా కొవిడ్‌-19 నేపథ్యంలో చాలామందికి ఆదాయాలు తగ్గాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పెట్టుబడులు ఉండాల్సిన అవసరం ఉంది.
ఈక్విటీ, డెట్‌, ఇతర పథకాల్లో పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. రెండు పెట్టుబడి పథకాలు ఒకే విధంగా పనిచేయవు అనే సూత్రాన్ని ఇక్కడ గమనించాలి. అందుకే, మార్కెట్‌ అన్ని దశల్లోనూ ఇబ్బంది లేకుండా ఉండేలా పెట్టుబడుల కేటాయింపు ఉండాలి.

నష్టభయం తగ్గేలా..

పెట్టుబడులు ఎప్పుడూ ఒకేచోట ఉండకూడదు. నష్టభయం.. రాబడి శాతం.. ఈ రెండు నిష్పత్తుల ఆధారంగా పెట్టుబడుల జాబితా రూపొందించుకోవాలి. మనం పెట్టుబడులకు కేటాయించే మొత్తంలో 60శాతం ఈక్విటీల్లోనూ.. 30శాతం డెట్‌, 10 శాతం పసిడిలోనూ ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే, మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ర్యాలీని దృష్టిలో పెట్టుకొని ఈ నిష్పత్తులు కాస్త అటూ ఇటూ అవుతుంటాయి. అయితే, నష్టభయాన్ని పరిమితం చేసుకునే దృష్టితో చూసినప్పుడు.. కనీసం నెల, రెండు నెలలకోసారి మీ పెట్టుబడులు తిరిగి ఇదే నిష్పత్తిలో కొనసాగేలా మార్పులు చేర్పులు చేయొచ్చు. బంగారం నేరుగా కొనకుండా పసిడి ఫండ్లు లేదా గోల్ట్‌ ఈటీఎఫ్‌లను ఎంచుకునే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు మార్కెట్‌ పెరగడం వల్ల మీ 60శాతం ఈక్విటీ మొత్తం పెట్టుబడుల్లో 80శాతానికి చేరుకుందనుకుందాం.. అప్పుడు దాన్ని 60శాతానికి తీసుకొచ్చేందుకు చూడాలి. దీనివల్ల ఎప్పుడైనా మార్కెట్‌ పడినా.. మీ లాభాలకు ఇబ్బంది ఉండదు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని