యులిప్‌ను రద్దు చేసుకోవచ్చా?

నేను 20ఏళ్ల క్రితం జీవిత బీమా పాలసీ తీసుకున్నాను. దీని నుంచి రూ.4లక్షల వరకూ వస్తున్నాయి. నా వయసు 57 ఏళ్లు. ఈ మొత్తాన్ని ఎక్కడైనా మదుపు చేయడం ద్వారా నెలనెలా ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. దీనికోసం ఏం చేయాలి?

Published : 06 Aug 2021 01:03 IST

* నేను 20ఏళ్ల క్రితం జీవిత బీమా పాలసీ తీసుకున్నాను. దీని నుంచి రూ.4లక్షల వరకూ వస్తున్నాయి. నా వయసు 57 ఏళ్లు. ఈ మొత్తాన్ని ఎక్కడైనా మదుపు చేయడం ద్వారా నెలనెలా ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. దీనికోసం ఏం చేయాలి?

- రమేశ్‌

* మీ డబ్బు సురక్షితంగా ఉంటూ.. నెలనెలా ఆదాయం రావాలంటే.. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీం అకౌంట్‌లో జమ చేసుకోండి. ప్రస్తుతం ఇందులో 6.6శాతం వడ్డీ లభిస్తోంది. రూ.4లక్షలు మదుపు చేస్తే నెలకు రూ.2,200 వడ్డీ లభిస్తుంది. దీన్ని అయిదేళ్లపాటు కొనసాగించాలి. ఏడాది తర్వాత మీరు డబ్బును వెనక్కి తీసుకునే వీలుంది. 1-3 ఏళ్లలోపు డబ్బు వెనక్కి తీసుకుంటే.. పెట్టుబడి నుంచి 2శాతం తగ్గించి ఇస్తారు. 3-5 ఏళ్లలోపు తీసుకుంటే 1శాతం తగ్గించి వెనక్కి ఇస్తారు.


* మా అబ్బాయి వయసు 9 ఏళ్లు. అతను విదేశీ చదువులకు వెళ్లే నాటికి కనీసం రూ.40లక్షల వరకూ చేతిలో ఉండాలని అనుకుంటున్నాను. దీనికోసం నేను నెలకు ఎంత మదుపు చేయాలి? నష్టభయం తక్కువగా ఉన్న పథకాలను ఎంచుకుంటే బాగుంటుందా?

- శ్రీనివాస్‌

* మీ అబ్బాయి చదువు కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇంకా దాదాపు 13-14 ఏళ్ల వ్యవధి ఉంది. ఇది దీర్ఘకాలం కిందే లెక్క. కాబట్టి, మంచి రాబడి కోసం హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. 13 ఏళ్లలో రూ.40లక్షలు జమ కావాలంటే 11 శాతం రాబడి అంచనాతో నెలకు రూ.13,000 వరకూ మదుపు చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ అబ్బాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలను కాపాడేందుకు మీ పేరుపై తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోండి.


* పన్ను ఆదా కోసం గతంలో ఒక యూనిట్‌ ఆధారిత పాలసీ తీసుకున్నాను. ఆరేళ్ల నుంచి ఏడాదికి రూ.80వేల ప్రీమియం చెల్లిస్తున్నాను. కానీ, ఇప్పుడు ఈ మొత్తం చెల్లించడం నాకు సాధ్యం కావడం లేదు. ఈ దశలో పాలసీని రద్దు చేసుకోవచ్చా?

- కృష్ణ

* యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌) అయిదేళ్ల తర్వాత రద్దు చేసుకుంటే ఎలాంటి రుసుములు లేకుండా.. మీ ఫండ్‌ విలువను వెనక్కి ఇస్తారు. మీకు ఈ డబ్బు అవసరం ఉండే వాడుకోండి. అవసరం లేదు అనుకుంటే.. రెండుమూడు మంచి పనితీరున్న డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసుకోండి.


* నేను ఒక ప్రైవేటు ఉద్యోగిని. నా వయసు 43 ఏళ్లు. ఇప్పటివరకూ బీమా పాలసీలు తీసుకోలేదు. నెలనెలా ప్రీమియం చెల్లించి టర్మ్‌ పాలసీలను తీసుకోవడం మంచిదేనా? రూ.50లక్షల చొప్పున రెండు సంస్థల నుంచి ఆన్‌లైన్‌ పాలసీలు తీసుకోవచ్చా?

- రాజేంద్ర

* మీ కుటుంబానికి తగినంత ఆర్థిక రక్షణ ఇవ్వాలంటే మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీని తీసుకోవాలి. ఈ మొత్తాన్ని మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు కంపెనీల నుంచి తీసుకోండి. మీరు ఆన్‌లైన్‌లోనూ రెండు పాలసీలు తీసుకోవచ్చు. నెలనెలా ప్రీమియం చెల్లించే బదులు ఆరు నెలలు లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లించే వీలుందా చూసుకోండి. దీనివల్ల ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది.

- తుమ్మ బాల్‌రాజ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని