Updated : 10 Sep 2021 05:42 IST

రీట్స్‌లో మదుపు చేస్తుంటే..

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో స్థిరాస్తి ప్రాజెక్టులు నిర్మాణం అవుతూనే ఉంటాయి. దీంతోపాటు మౌలిక వసతుల ఏర్పాటూ కొనసాగుతుంటుంది.. మరి వీటికి డబ్బు ఎలా.. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టు (రీట్స్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టు (ఇన్విట్స్‌) ప్రజల దగ్గర్నుంచి పెట్టుబడులను సమీకరించి, వీటికి అందిస్తుంటాయి. ఆయా ప్రాజెక్టుల నుంచి వచ్చిన లాభాలను మదుపరులకు పంచుతాయి. భారతీయ మదుపరులకు ఇవి కాస్త కొత్త పథకాలే. వీటి పనితీరు మ్యూచువల్‌ ఫండ్ల పనితీరును పోలి ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే రీట్స్‌, ఇన్విట్స్‌కు ఆదరణ ఉంది. ఆర్థిక లక్ష్యాల సాధనలో వైవిధ్యం ఉండేలా ఈ పథకాలను ఎంచుకునేటప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం.

దాయాన్ని ఆర్జించేందుకు అవకాశం ఉన్న నిర్మాణంలో ఉన్న లేదా పూర్తయిన నిర్మాణాలలో రీట్స్‌ పెట్టుబడి పెడుతుంది. ఇది నివాస గృహాలైనా కావచ్చు.. వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లు, గోదాములు, కార్యాలయాలు ఇలా ఏదైనా ఉండొచ్చు.. రీట్స్‌లో మదుపు చేసిన మదుపరులకు క్రమం తప్పకుండా ఆదాయం రావడంతోపాటు.. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికీ ఇది అవకాశం కల్పిస్తుంది. సెబీ నిబంధనల ప్రకారం రీట్స్‌ 80శాతం మేరకు ఆదాయం ఆర్జిస్తున్న పూర్తయిన నిర్మాణాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రీట్స్‌ రెండు రకాలుగా అందుబాటులో ఉంటాయి. ఒకటి ఎక్స్ఛేంజీల్లో  ట్రేడ్‌ అవుతుండగా..మరోటి ట్రేడింగ్‌లో ఉండదు.

వంతెనలు, రహదారులు, రోడ్లు, పైప్‌లైన్లు, విద్యుత్‌ ప్లాంట్లు తదితర భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఇన్విట్స్‌ మదుపు చేస్తాయి. మొత్తం పెట్టుబడిలో తప్పనిసరిగా 80శాతం వరకూ పూర్తయిన ప్రాజెక్టులలోనే మదుపు చేయాల్సి ఉంటుంది. అవి ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉండాలి. ఈ రెండు పథకాల్లోనూ ఆర్జించిన ఆదాయంలో 90శాతం వరకూ యూనిట్‌ హోల్డర్లు/పెట్టుబడిదారులకు పంపిణీ చేయాలి.

లాభమేమిటి?

రీట్స్‌, ఇన్విట్స్‌ను ఎంచుకోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మదుపు చేసేందుకు ఆస్కారం లభిస్తుంది. స్థిరాస్తులు, మౌలిక వసతుల ప్రాజెక్టులలో యాజమాన్యం లభిస్తుందనీ చెప్పొచ్చు. పైగా నిర్వహణ, స్టాంపు డ్యూటీ, ఇతర ఖర్చుల్లాంటి ఇబ్బందులేమీ ఉండవు. ఈ కొత్త తరహా పథకాలు మదుపరుల పెట్టుబడుల వివిధీకరణకు తోడ్పడతాయి. డివిడెండ్ల రూపంలో క్రమం తప్పని ఆదాయాన్నీ ఆర్జించవచ్చు. దీంతోపాటు మూలధన వృద్ధికీ అవకాశం ఉంటుంది. నేరుగా రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులో పెట్టుబడికి భారీ మొత్తం అవసరం. కానీ, రీట్స్‌, ఇన్విట్స్‌లో మదుపు చేయడానికి పెద్ద మొత్తం అవసరం కూడా లేదు. ఈ పథకాలను సెబీ నియంత్రిస్తుంది. మోసపూరిత లావాదేవీలకు ఆస్కారమూ తక్కువే. 80శాతానికి పైగా మొత్తం ఆదాయాన్ని ఆర్జించే పథకాల్లో మదుపు చేస్తుంది కాబట్టి, అంతగా నష్టభయం ఉండదు.

గతంలో రీట్స్‌లో కనీస పెట్టుబడి రూ.50,000 ఇన్విట్స్‌లో రూ.1,00,000 ఉండేది. కానీ, 2021-22 బడ్జెట్‌లో దీన్ని సవరించారు. రీట్స్‌లో కనీసం రూ.10,000, ఇన్విట్స్‌లో రూ.15,000లతోనూ మదుపు చేసే అవకాశం ఉంది. స్టాక్‌ మార్కెట్‌ ద్వారా నేరుగా ఈ పథకాల్లో మదుపు చేయడం ఇబ్బంది అనుకుంటే.. మ్యూచువల్‌ ఫండ్ల ద్వారానూ వీటిలో మదుపు చేసే అవకాశం ఉంది.


నష్టభయాలూ ఉన్నాయి..

మార్కెట్లో నమోదైన రీట్స్‌, ఇన్విట్స్‌లో సహజంగానే అధిక హెచ్చుతగ్గులు ఉంటాయి. రీట్స్‌ ఆర్జించిన ఆదాయంలో 90శాతం వరకూ మదుపరులకు వెనక్కి ఇస్తుంది కాబట్టి, తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు కొంత ఇబ్బందులు తలెత్తవచ్చు. దీనివల్ల పెట్టుబడి వృద్ధి కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఇన్విట్స్‌ మదుపు చేసిన ప్రాజెక్టులలో రాబడి అంచనా విధానంలో ఉంటుంది. కాబట్టి, కాస్త అధిక నష్టభయం ఉండే అవకాశం ఉంటుంది. కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఏదైనా న్యాయపరమైన చిక్కులు వచ్చినా, నియంత్రణ సంస్థల నిబంధనలు మారినా.. ఇబ్బందులు తప్పవు.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts