Updated : 08 Dec 2021 17:16 IST

చిన్నారుల కలలు నిజం చేద్దాం

కుటుంబానికి నిజమైన ఆస్తి పిల్లలే. వారు వృద్ధిలోకి రావడానికి తల్లిదండ్రులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వారి భవిష్యత్‌ కలలను నెరవేర్చేందుకు అవసరమైన డబ్బును సమకూర్చేందుకు ఉన్నంతలో పెట్టుబడులు పెడుతుంటారు. పెద్దల ఆర్థిక లక్ష్యాల్లో పిల్లల చదువులే ముందు వరుసలో ఉంటాయని ఎన్నో నివేదికలూ స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారుల కలలు నిజం చేసే క్రమంలో మదుపు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

దువుల ఖర్చులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఖర్చులను తప్పించుకోవడానికి లేదు. ఈ మొత్తాన్ని కూడబెట్టేందుకు పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంతమంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వీటివల్లే ఆశించిన లక్ష్యానికి చేరడం కష్టంగా మారుతుంది. అది పిల్లల ఉన్నత చదువులపై ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా పెట్టుబడుల విషయంలో చేసే పొరపాట్లు.. వాటిని ఎలా అధిగమించాలనేది చూద్దాం...

ద్రవ్యోల్బణాన్ని విస్మరిస్తే..

ఫీజులు పెరుగుతూ ఉండటం చాలామంది తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం అవుతూ ఉంటుంది. ఉన్నత చదువుల ఖర్చు విషయం చెప్పక్కర్లేదు. దీన్ని తట్టుకునేందుకు పెట్టుబడి పెట్టే తరుణంలో.. ముఖ్యమైన అంశాన్ని మర్చిపోతుంటారు. ఇప్పటి ఖర్చులకు అనుగుణంగానే మదుపు చేసే ఆలోచనతో ఉంటారు. కానీ, భవిష్యత్తు వేరేగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. డబ్బు విలువను హరించే ద్రవ్యోల్బణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. ప్రస్తుతం ఉన్నత చదువుకయ్యే ఖర్చు రూ.10లక్షలు ఉందనుకుందాం.. 10-15 ఏళ్లు గడిచే సరికి ఈ మొత్తం ఏమాత్రం సరిపోకపోవచ్చు. ఏడాదికి కనీసం 5శాతం ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసుకున్నా.. 15 ఏళ్ల నాడు.. రూ.21.07 లక్షలు అవసరం అవుతాయి. అందుకే, భవిష్యత్తు అంచనాతో ఇప్పటి నుంచే పెట్టుబడులు ప్రారంభించాలి. క్రమానుగత పెట్టుబడి విధానంతో (సిప్‌) చిన్న మొత్తాలనైనా మదుపు చేస్తూ వెళ్లాలి. ఈ మొత్తాన్ని సాధించేందుకు ఎలాంటి మదుపు ప్రణాళికలు ఉండాలన్నది తెలుసుకునేందుకు అవసరాన్ని బట్టి, నిపుణుల సలహాలు తీసుకోవడమూ ఉత్తమం.

వాయిదాలు వద్దు..

ఇంకా సమయం ఉంది కదా.. ఇప్పటి నుంచే ఎందుకు.. ఈ ధోరణి చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ఆలస్యం అమృతం విషం.. అనే నానుడి పెట్టుబడులకూ వర్తిస్తుంది. వాయిదా వేస్తున్న కొద్దీ.. పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం పెరుగుతుంది. పైగా అనుకున్న మొత్తం రాకపోవచ్చు కూడా. ఎక్కువ వ్యవధి మదుపు చేసినప్పుడే చక్రవడ్డీ ప్రభావం వల్ల మన పెట్టుబడులు వృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయి. తల్లిదండ్రులుగా మారే ముందే.. పెట్టుబడులు ప్రారంభం కావాలి. ఉదాహరణకు మీరు బిడ్డ పుట్టగానే.. నెలకు రూ.10వేల చొప్పున ‘సిప్‌’ చేయడం ప్రారంభించారనుకుందాం. అప్పుడు మీ చిన్నారి 20 ఏళ్ల వయసుకు వచ్చేనాటికి మీ దగ్గర రూ.1.33 కోట్ల నిధి ఉంటుంది. దీనికోసం కనీసం 15శాతం రాబడి వచ్చేలా ఈక్విటీ పథకాల్లో మదుపు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ చిన్నారికి 5 ఏళ్లు వచ్చాక పెట్టుబడి ప్రారంభిస్తే.. 20 ఏళ్ల వయసు నాటికి రూ.61.73లక్షలు మాత్రమే ఉంటాయి. ఇక పదేళ్ల వయసు వచ్చాక పెట్టుబడి ప్రారంభిస్తే.. రూ.26.34లక్షలు మాత్రమే జమ చేయగలరు. చూశారుగా.. ఆలస్యం చేస్తున్న కొద్దీ.. పెట్టుబడి విలువ ఎలా తగ్గిపోయిందో.. అందుకే, దీర్ఘకాలిక లక్ష్యంతో పెట్టుబడులు కొనసాగించండి.

వైవిధ్యం పాటించకపోతే..

ఒకే పెట్టుబడి పథకంలో మొత్తం డబ్బును దాచి పెట్టటం దీర్ఘకాలంలో మనకు నష్టం చేకూర్చే ప్రమాదముంది. పిల్లల కోసం మదుపు చేసే తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో ఒకే పథకాన్ని నమ్ముకుంటారు. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, షేర్లు, యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు, డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లు, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు, స్థిరాస్తి ఏవైనా కావచ్చు.. ఒకే పథకంలో మాత్రం మంచిది కాదు. దీనివల్ల నష్టభయం ఉండటమే కాకుండా.. రాబడీ ఆశించినంత ఉండకపోవచ్చు. దీర్ఘకాలం కోసం పెట్టుబడులను ఎంచుకునేటప్పుడు వివిధీకరణకే ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లల లక్ష్యాల కోసం పెట్టుబడులు పెట్టేందుకు 15-20 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ఈ దీర్ఘకాలిక వ్యవధిలో మంచి లాభాలు సంపాదించాలంటే.. మన పోర్ట్‌ఫోలియో బలంగా నిర్మించుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో 60-65 శాతం ఈక్విటీలకు కేటాయించాలి. 35-40 శాతం వరకూ డెట్‌, స్థిరాస్తి, బంగారంలాంటి వాటికి ప్రత్యేకించాలి. దీనివల్ల పెట్టుబడులు స్థిరంగా వృద్ధి చెందేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ.. ముందుకెళ్లాలి.

ధీమా లేకుండా...

పిల్లల అవసరాల కోసం పెట్టుబడులు పెట్టడం మంచిదే. అదే సమయంలో వారికి భరోసాగా ఉండే తల్లిదండ్రులకు అనుకోనిదేదైనా జరిగితే.. అందుకే.. పిల్లల చదువులకు తగిన ఆర్థిక భద్రత కల్పించాలి. అందుకోసం తల్లిదండ్రులు తమ పేరు మీద సరైన మొత్తానికి జీవిత బీమా పాలసీలను తీసుకోవడం తప్పనిసరి. కుటుంబానికి అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమాలూ ఉండాలి. అప్పుడే.. పిల్లల భవిష్యత్తుకు కూడబెట్టిన సొమ్ము ఈ ఆరోగ్య అవసరాలకు వాడకుండా చూసుకోగలం.

ఇతర అవసరాలకు మళ్లిస్తే..

మనలో చాలామంది ఒక పొరపాటు చేస్తుంటాం.. డబ్బును జమ చేసే లక్ష్యం ఒకటుంటుంది. కానీ, దాన్ని వేరే అవసరానికి ఖర్చు చేసేస్తాం.. ఇతర విషయాల్లో ఇది ఎలా ఉన్నా.. పిల్లల చదువులకు జమ చేస్తున్న మొత్తాన్ని సాధ్యమైనంత వరకూ ముట్టుకోకూడదు. తర్వాత మళ్లీ జమ చేస్తాం అని ప్రతిసారీ ఈ డబ్బునే తీసి, వేరే అవసరాలకు మళ్లించడం వల్ల.. దాన్ని తిరిగి జమ చేయడం అంత తేలిక కాదు. పైగా చక్రవడ్డీ రాబడిని కోల్పోతారు. మీ పెట్టుబడి ప్రాధాన్యాలను గుర్తించండి. అయితే, పిల్లల చదువులు మాత్రం ఇందులో మొదట ఉండేలా చూసుకోండి. అప్పుడే చిన్నారుల కలలను నిజం చేసే క్రమంలో ఎలాంటి తడబాటూ ఉండదు.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts