Updated : 08 Oct 2021 02:23 IST

అత్యవసరాల్లో ఆదుకునేలా..

జీవితం అంటేనే అనిశ్చితి.. ఎప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో అంచనా వేయలేం. కొవిడ్‌-19 మనకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇలాంటి ముప్పు మరోసారి వచ్చినా.. ఆర్థికంగా మనం తట్టుకునేలా ఉండాలి. అందుకు.. సిద్ధంగా ఉండేందుకు అత్యవసర నిధిని మనం ఏర్పాటు చేసుకోవాల్సిందే. మరి అందుకోసం ఏం చేయాలి?

హమ్మారి అనేది ఒక అరుదైన సందర్భం. కానీ, తరచూ మనల్ని ఎన్నో అత్యవసరాలు పలకరిస్తూనే ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో చాలామంది తమ పొదుపు, పెట్టుబడులను అందుకు వినియోగిస్తుంటారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను వ్యవధికి ముందే తీసుకోవాల్సి వస్తుంది. మ్యూచువల్‌ ఫండ్లలోని పెట్టుబడులు సరైన రాబడిని అందించకముందే వెనక్కి తీసుకుంటారు. దీనివల్ల అనుకున్న లక్ష్యాలకు కష్టం అవుతుంది. మళ్లీ ఆ మొత్తాన్ని జమ చేయడమూ అంత తేలిక కాదు. అందుకే, అత్యవసరాల కోసం ప్రత్యేకంగా నిధి ఉండాల్సిందే.

ఈఎంఐ చెల్లింపులు, క్రెడిట్‌ కార్డు బిల్లులు, ఇతర అవసరాలన్నీ తీరిన తర్వాత మిగిలిందే పొదుపు అనే భావన చాలామందిలో ఉంటుంది. కొంతమంది మ్యూచువల్‌ ఫండ్లు, ఇతర పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తుంటారు. కానీ, అత్యసవరాల గురించి ఆలోచించి, కొంత మొత్తాన్ని తీసి పెట్టేవారు తక్కువే. అసలు అత్యవసర నిధి ఎందుకు ఉండాలి.. అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే..

ఒత్తిడి తగ్గుతుంది: డబ్బు అవసరం వచ్చి, ఎక్కడా దొరకనప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందన్నది ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఆదాయం ఆగిపోయిన సందర్భంలో ఇది మరీ ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే, ప్రతి వ్యక్తీ ఇలాంటి సందర్భాన్ని ఊహించి, అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి.

అప్పుల నియంత్రణ: ఒక వ్యక్తి దగ్గర అవసరమైన మేరకు అత్యవసర నిధి ఉందనుకుందాం. అప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మిత్రులు, బంధువుల దగ్గర చేబదులు తీసుకోనక్కర్లేదు. వ్యక్తిగత రుణాలు తీసుకోవడం, కార్డులు వాడాల్సిన పనీ ఉండదు.

ఖర్చుల నియంత్రణ: ప్రత్యేకంగా అత్యవసరాల కోసం దాచి పెట్టడం మొదలు పెట్టినప్పుడు.. దుబారా ఖర్చులను నియంత్రించేందుకు వీలవుతుంది. ఫలితంగా మంచి ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది.

ఇతరులకూ అండగా: మీ స్నేహితులు, బంధువులు ఎవరైనా అనుకోకుండా అనారోగ్యంపాలై, ఆసుపత్రిలో చేరినప్పుడు వారి దగ్గర డబ్బు లేనప్పుడు మీరు సర్దుబాటు చేయొచ్చు. అన్నింటినీ ఆర్థికంగా చూడలేం.. ఇలాంటి సందర్భాల్లో వారికి మీరు కొండంత ధైర్యం ఇచ్చినట్లు అవుతుంది.

ఎక్కడ దాచి పెట్టాలి: అవసరానికి తీసుకునేలా ఈ నిధి ఉండాలి. పైగా నష్టభయం ఏమాత్రం ఉండకూడదు. అందుకే, బ్యాంకు పొదుపు ఖాతాలో ఈ డబ్బు ఉండేలా చూసుకోవడం మేలు.

ఎంత మొత్తం: నెలవారీ ఇంటి ఖర్చులు, ఈఎంఐ, ఇతర తప్పనిసరి ఖర్చులు.. ఇలా అన్నింటినీ లెక్కించుకోవాలి. కనీసం 3-6 నెలలకు సరిపోయే మొత్తం ఉండాలి. మంచిని ఆశించాలి.. అదే సమయంలో చెడు జరిగినా తట్టుకోవాలి. ఇదే అత్యవసర నిధి విషయంలోనూ ఈ సూత్రం వర్తిస్తుంది.

- ప్రవీణ్‌ భట్‌,
ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts