Published : 29 Oct 2021 04:30 IST

గృహరుణం ఎక్కడ  తీసుకోవాలి?

గృహరుణం వడ్డీ రేట్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. బ్యాంకులు  పోటీ పడి ఈ రుణాలను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. చాలా బ్యాంకులు 6.40 - 6.95శాతం వడ్డీకే వీటిని  అందిస్తున్నాయి. ఇలా తక్కువ వడ్డీ రేటుకు గృహరుణం  దొరుకుతున్నప్పుడు.. అప్పు ఎక్కడ తీసుకోవాలనే సందేహం రాకపోదు.  కొత్త రుణం తీసుకునే వారు.. ఇప్పటికే ఉన్న రుణాన్ని వేరే బ్యాంకుకు మార్చుకోవాలనుకునే వారు.. బ్యాంకులను  ఎంచుకునేటప్పుడు ఏం చూడాలి.. తెలుసుకుందాం!

బ్యాంకు 6.75శాతం వడ్డీకి రుణం ఇస్తాం అని ప్రకటించింది అనుకుందాం.. నిజంగా రుణ గ్రహీతకు ఈ వడ్డీ రేటుకే రుణం లభిస్తుందా? ఇంకా అధికంగా చెల్లించాల్సి వస్తుందా? ప్రతి రుణదాతా.. గృహరుణాలకు రెండు రేట్లు నిర్ణయిస్తారు. ఉదాహరణకు 6.70-7.50శాతం అని పేర్కొంటారు. బ్యాంకు నిర్ణయించిన అర్హతలు ఉన్నవారే తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందగలరు. మహిళలకు, పురుషులకు వర్తించే వడ్డీ రేట్లలో వ్యత్యాసం ఉంటుంది. ఆదాయం, క్రెడిట్‌ స్కోరు, రుణ మొత్తం, విలువలో రుణ నిష్పత్తి, కొత్త రుణమా.. వేరే బ్యాంకు నుంచి మార్చుకుంటున్నారా.. ఇలా అనేక అంశాల ఆధారంగా వడ్డీ రేటును నిర్ణయిస్తారు. ఒకవేళ బ్యాంకు నిర్ణయించిన అర్హతలు లేకపోతే.. స్వల్ప వడ్డీ రేటు దక్కదు. ఉదాహరణకు స్వయం ఉపాధి పొందుతున్న వారికి 10 బేసిస్‌ పాయింట్లు అధికంగా ఉండవచ్చు. రుణం రూ.75లక్షలు మించినప్పుడు మరో 10 బేసిస్‌ పాయింట్లు, క్రెడిట్‌ స్కోరు 750కి లోపు ఉంటే.. మరో 10 బేసిస్‌ పాయింట్లు.. ఇలా వడ్డీ రేటును పెంచుతుంటాయి.

ప్రామాణికం ఏమిటి?

వడ్డీ రేటుకు ప్రామాణిక సూచీగా దేనిని తీసుకుంటున్నారన్నదీ బ్యాంకు/ఎన్‌బీఎఫ్‌సీ ఎంపికలో ముఖ్యమే. అక్టోబరు 2019 నుంచి బ్యాంకులు రెపో రేటు ఆధారంగా గృహరుణాల వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్నాయి. రెపో రేటు తగ్గడంతోనే గృహరుణాల రేట్లూ ఆ మేరకు తగ్గాయి. ఎన్‌బీఎఫ్‌సీలు అంతర్గత బెంచ్‌మార్క్‌ను నిర్ణయించుకుంటాయి. రెపో రేట్ల ఆధారంగా నిర్ణయించిన వడ్డీ రేట్లు ఇటీవల కాలంలో బాగా తగ్గాయి. అందుకే, వీటికి ఆదరణ పెరిగింది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే.. రెపో రేటు పెరుగుతున్నప్పుడు గృహరుణ వడ్డీ రేటూ దాన్ని ప్రతిబింబిస్తుంది. పూర్తి పారదర్శకంగా వడ్డీ రేట్లను నిర్ణయించే సంస్థ నుంచే రుణాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి.

ఖర్చుల మాటేమిటి?

కేవలం వడ్డీ రేట్లనే చూస్తే సరిపోదు. ప్రాసెసింగ్‌ రుసుము, లీగల్‌ ఫీజు, ఇతర ఖర్చులనూ బేరీజు వేసుకోవాలి. రుణాన్ని ముందస్తుగా చెల్లిస్తే ఏమైనా రుసుములుంటాయా అనేదీ చూసుకోవాలి. చలన వడ్డీ రేటుకు తీసుకున్న రుణానికి ఎలాంటి ముందస్తు చెల్లింపు రుసుమూ ఉండదు. కొన్ని బ్యాంకులు ముందుగానే ఒక ఈఎంఐని మినహాయించుకొని, మిగతా మొత్తం చెల్లిస్తాయి. కొన్ని రెండు ఈఎంఐలను అడుగుతుంటాయి. దీన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు సులభంగా ముందస్తు చెల్లింపులు చేసే వీలూ ఉండాలి.

సేవలు ఎలా ఉన్నాయి?

గృహరుణం ఒక దీర్ఘకాలిక భాగస్వామ్యం. కాబట్టి, సేవలను అందించడంలో మేటిగా ఉన్న సంస్థనే పరిశీలించాలి. పూర్తిగా డిజిటల్‌ ద్వారా సేవలను అందించే బ్యాంకులు, రుణ సంస్థలను పరిశీలించాలి. మిమ్మల్ని పదిసార్లు బ్యాంకు శాఖకు రావాల్సిందిగా కోరుతున్న వాటిని కాస్త పక్కకు  పెట్టడమే కొవిడ్‌-19 పరిస్థితుల్లో ఉత్తమం. మీకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని సత్వరమే పరిష్కరించాలి. మీరు రుణం తీసుకోబోయే ముందు మీకు తెలిసిన వారెవరైనా ఆ బ్యాంకు/సంస్థలో అప్పు తీసుకున్నారా.. వారి అనుభవం ఏమిటి అడిగి తెలుసుకోండి. దీంతోపాటు.. మీరు రుణం తీసుకోబోయే బ్యాంకు, ఆర్థిక సంస్థ శాఖలు మీకు దగ్గరగా ఉన్నాయా చూసుకోండి.

రుణానికి దరఖాస్తు చేసుకోబోయే ముందు క్రెడిట్‌ స్కోరును తనిఖీ చేసుకోవడం మర్చిపోవద్దు. కొన్ని బ్యాంకులు 750 పాయింట్లు ఉంటే చాలు అంటున్నాయి. మరికొన్ని 800 వరకూ అడుగుతున్నాయి. మీకు మంచి స్కోరు ఉందనుకోండి.. బ్యాంకుతో వడ్డీ విషయంలో బేరమాడే అవకాశమూ ఉంటుంది.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts