ఆదాయం లెక్కలు... పక్కాగా...

ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం వచ్చింది.. మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) వివరాలు ఇప్పటివరకూ ఫారం 26ఏఎస్‌లో కనిపించేవి. దీనిని మరింత అభివృద్ధి చేసి, పన్ను చెల్లింపుదారుడికి వచ్చిన ప్రతి ఆదాయం వివరాలతో కొత్త ఫారాన్ని ...

Updated : 12 Nov 2021 05:56 IST

క ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం వచ్చింది.. మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) వివరాలు ఇప్పటివరకూ ఫారం 26ఏఎస్‌లో కనిపించేవి. దీనిని మరింత అభివృద్ధి చేసి, పన్ను చెల్లింపుదారుడికి వచ్చిన ప్రతి ఆదాయం వివరాలతో కొత్త ఫారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఆదాయపు పన్ను శాఖ. దీనిని వార్షిక ఆదాయపు నివేదిక (యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌-ఏఐఎస్‌) రూపంలో అందిస్తోంది. మరి, దీనిని ఎలా చూడాలి.. ఈ కొత్త నివేదికతో ప్రయోజనాలేమిటి? తెలుసుకుందామా..

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా ఉండేలా వచ్చిన ఆదాయపుపన్ను వెబ్‌సైట్‌ https:///www.incometax.gov.in ఎన్నో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ముందే సిద్ధం చేసిన ఆదాయపు పన్ను రిటర్నుల ఫారాలు వేగంగా రిటర్నులు దాఖలు చేసేందుకు వీలు కల్పిస్తున్నాయి. బడ్జెట్‌ సమావేశంలో ఆర్థికమంత్రి ప్రకటించిన ఆదాయాలన్నీ ఒకేచోట కనిపించేలా నివేదిక వస్తుందని తెలిపారు. తాజాగా ఆదాయపు పన్ను వెబ్‌సైటులో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణంగా 26ఏఎస్‌లో వచ్చిన ఆదాయం, టీడీఎస్‌ వివరాలు మాత్రమే కనిపించేవి. కొత్తగా వచ్చిన ఫారంలో ఇవే కాకుండా పన్ను వర్తించని ఆదాయాల వివరాలూ తెలుసుకోవచ్చు. ఉదాహరణకు పొదుపు ఖాతాపై వచ్చిన వడ్డీ, రికరింగ్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ, డివిడెండ్‌, షేర్ల లావాదేవీలు, మ్యూచువల్‌ ఫండ్ల లావాదేవీలు, విదేశాల నుంచి వచ్చిన డబ్బు.. ఇలా ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయానికి సంబంధించిన అన్ని వివరాలూ ఈ ఏఐఎస్‌లో చూసుకోవచ్చు.

లాభమేమిటి?

ఈ కొత్త నివేదిక వల్ల పన్ను  చెల్లింపుదారులకు ప్రయోజనాలు ఏమున్నాయనే సందేహం మీకు రావచ్చు... ముఖ్యంగా.. పన్ను వర్తించే ఆదాయాలన్నింటినీ ఒకేచోట అందుబాటులో ఉండేలా చూడటమే దీని ప్రధాన లక్ష్యం. దీని ఆధారంగా పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా తమ ఆదాయాలను రిటర్నులలో వెల్లడించేందుకు ఆదాయపు పన్ను విభాగం అవకాశం కల్పిస్తోంది.

* ఈ ఏఐఎస్‌.. 26ఏఎస్‌కి విస్తృత రూపంగా చెప్పొచ్చు. రిటర్నుల దాఖలు సమయంలో ఆదాయాలకు సంబంధించిన వివరాల్లో మరింత స్పష్టతకు ఇది తోడ్పడుతుంది.

* పన్ను వర్తించే ఆదాయం, చెల్లించిన పన్ను, చెల్లించాల్సిన పన్ను వివరాలు.. ఇలా ఒకే చోట అన్ని వివరాలనూ చూసుకోవచ్చు.

* ఒకే ఆదాయం రెండుసార్లు నమోదయిన సందర్భంలో ఒక దానిని తొలగించే వెసులుబాటు ఉంటుంది.

* ఆదాయాల నమోదులో ఏదైనా పొరపాటును గమనిస్తే.. వేరే వ్యక్తికి సంబంధించిన ఆదాయం మీ ఖాతాలో చూపించినా.. ఒకే ఆదాయం రెండుసార్లు నమోదు చేసినా.. వీటిపై సంబంధిత వర్గాలకు ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పిస్తోంది.

ఎలా చూడాలి..

ఆదాయపు పన్ను వెబ్‌సైటులోకి మీ యూజర్‌ఐడీ (పాన్‌), పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి. ఆ తర్వాత ‘సర్వీసెస్‌’ విభాగంలో ‘యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ (ఏఐఎస్‌)’ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత మీకు ‘ట్యాక్స్‌పేయర్‌ ఇన్ఫర్మేషన్‌ సమ్మరి (టీఐఎస్‌)’ ‘యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ (ఏఐఎస్‌)’ వివరాలు కనిపిస్తాయి.

* ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకున్న తర్వాత.. ఏఐఎస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పుడు దీన్ని చూడ్డానికి పాస్‌వర్డ్‌ ఉంటుంది. మీ పాన్‌నెంబరు (క్యాపిటల్‌ లెటర్స్‌)తోపాటు మీ పుట్టిన తేదీ వివరాలను పూర్తిగా నమోదు చేయాలి.

తనిఖీ చేసుకోండి..

ఇప్పటికే ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారూ.. ఈ స్టేట్‌మెంట్‌ను ఒకసారి పరిశీలించాలి. మీరు రిటర్నుల దాఖలు చేసినప్పుడు అన్ని వివరాలూ పేర్కొన్నారా తనిఖీ చేసుకోండి. లేకపోతే.. రివైజ్డ్‌ రిటర్నులు సమర్పించండి. ట్రేసెస్‌ పోర్టల్‌లో కనిపించే ఫారం 26ఏఎస్‌, ఏఐఎస్‌ రెండింటి మధ్య టీడీఎస్‌/టీసీఎస్‌ల మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు ట్రేసెస్‌ పోర్టల్‌లో కనిపించే వివరాలనే తీసుకోవాలని ఆదాయపు పన్ను విభాగం చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు