మధుమేహం ఉంది.. పాలసీ ఇస్తారా?

జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు మీకు సంబంధించిన అన్ని వ్యక్తిగత, ఆరోగ్య, ఆర్థిక వివరాలను కచ్చితంగా ప్రతిపాదన పత్రంలో తెలియజేయాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో దాపరికం పనికిరాదు. ఇప్పటికే మీకున్న వ్యాధులు,

Updated : 12 Nov 2021 05:59 IST

నేను రూ.50 లక్షల విలువైన జీవిత బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. రెండు నెలల క్రితం మధుమేహం వచ్చింది. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకునేటప్పుడు ఆ వివరాలు చెప్పాల్సి ఉంటుందా? - మహిపాల్‌

జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు మీకు సంబంధించిన అన్ని వ్యక్తిగత, ఆరోగ్య, ఆర్థిక వివరాలను కచ్చితంగా ప్రతిపాదన పత్రంలో తెలియజేయాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో దాపరికం పనికిరాదు. ఇప్పటికే మీకున్న వ్యాధులు, జరిగిన శస్త్రచికిత్సల వివరాలు పేర్కొనాలి. ఈ విషయాలు తెలియజేయకుండా.. మీరు పాలసీ తీసుకుంటే.. క్లెయిం వచ్చినప్పుడు తిరస్కరించే ఆస్కారం ఉంది. మీకు మధుమేహం ఉన్న విషయం ప్రతిపాదన పత్రంలో చెప్పండి. ఆరోగ్య పరీక్షలు అవసరమైతే చేయించుకోండి. మీ వైద్య నివేదికలకు అనుగుణంగా జీవిత బీమా సంస్థ నిర్ణయం తీసుకుంటుంది. కొన్నిసార్లు ప్రీమియం కాస్త అధికంగా వసూలు చేయొచ్చు.


మా అమ్మ వయసు 63 ఏళ్లు. తనకు నెలకు పింఛనులా కొంత ఆదాయం వచ్చేలా రూ.8లక్షలను పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెద్దగా వడ్డీ రావడం లేదు కదా.. ప్రత్యామ్నాయంగా ఏ పథకాన్ని ఎంచుకోవాలి? - మధు

ప్రస్తుతం వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్న మాట నిజమే. వీటిల్లో 5-6 శాతం వరకూ వడ్డీ లభిస్తోంది. మీ డబ్బు సురక్షితంగా ఉంటూ.. మంచి రాబడి రావాలంటే మీరు పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో 7.4శాతం వడ్డీ ఇస్తున్నారు. అయితే, నెలకు కాకుండా.. మూడు నెలలకోసారి వడ్డీని చెల్లిస్తారు. అయిదేళ్ల వరకూ పెట్టుబడిని కొనసాగించవచ్చు. రూ.8లక్షలు డిపాజిట్‌ చేస్తే.. మూడు నెలలకోసారి రూ.14,800 వడ్డీ వస్తుంది.


నేను మూడేళ్ల క్రితం ఇల్లు కొన్నాను. ఇంకా రూ.8లక్షల వరకూ చెల్లించాలి. ఇప్పుడు ఉద్యోగం మానేశాను. ఈఎంఐ చెల్లించగలను. రూ.8 లక్షలను ఒకేసారి చెల్లించి, రుణం తీర్చేయాలా? లేక ఈ మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తే మంచిదా? - పద్మావతి

మీరు ఉద్యోగం చేయడం లేదు కాబట్టి, ఈఎంఐ ద్వారా రుణం చెల్లించినా ఆదాయపు పన్ను మినహాయింపులేమీ వర్తించవు. రుణానికి వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, మీ దగ్గరున్న రూ.8లక్షలతో గృహరుణం తీర్చేయండి. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసినప్పుడు.. మీరు గృహరుణానికి చెల్లించే వడ్డీకి మించి రావచ్చు. లేకపోవచ్చు. పైగా నష్టభయమూ ఉంటుంది. మీకు నెలనెలా ఏదైనా ఆదాయం ఉంటే.. అప్పుడు మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేసేందుకు ప్రయత్నించండి.


నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.10 వేల వరకూ మదుపు చేయాలనేది నా ఆలోచన. నా వయసు 23 ఏళ్లు. మరో 6 ఏళ్ల వరకూ నా పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది. - శశాంక్‌

ముందుగా మీపైన ఆధారపడిన వారు ఉంటే.. మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ జీవిత బీమా తీసుకోండి. దీంతోపాటు.. ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలూ ఎంచుకోండి. ఆరు నెలల ఖర్చుకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా ఉంచుకోండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.10వేలలో రూ.7,000 డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. మిగతా రూ.3,000 బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ చేసుకోండి.


మా అబ్బాయిల వయసు 14, 12 ఏళ్లు. ఇద్దరి పేరుమీదా నెలకు రూ.5వేల చొప్పున పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. దీనికోసం నేను ఏం చేయాలి? - సత్యం

మీ అబ్బాయిల ఉన్నత చదువుల కోసం ఈ మొత్తం ఉపయోగపడాలనేది మీ ఆలోచనగా తెలుస్తోంది. కాబట్టి, కాస్త అధిక రాబడి వచ్చే చోట మదుపు చేయాలి. దీనికోసం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. కనీసం ఏడేళ్లపాటు నెలకు రూ.10వేలు మదుపు చేస్తే.. 12 శాతం రాబడితో.. రూ.12,10,681 అయ్యేందుకు అవకాశం ఉంది. కానీ, ఈ డబ్బు ఇద్దరి చదువుల ఖర్చుకు సరిపోకపోవచ్చు. వీలైతే పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోండి.

- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని