బీమా ప్రీమియం ముందే చెల్లిస్తే

బీమా పాలసీ ఏదైనా సరే.. సకాలంలో ప్రీమియం చెల్లించాలి. ముందు చెల్లించినా ఇబ్బంది ఉండదు. కానీ, చాలామంది గడువు తేదీ దాకా ప్రీమియం చెల్లించేందుకు ఇష్టపడరు. ముందు చెల్లించడం అనవసరం.. దీనివల్ల ఏ ప్రయోజనమూ

Updated : 12 Nov 2021 06:08 IST

బీమా పాలసీ ఏదైనా సరే.. సకాలంలో ప్రీమియం చెల్లించాలి. ముందు చెల్లించినా ఇబ్బంది ఉండదు. కానీ, చాలామంది గడువు తేదీ దాకా ప్రీమియం చెల్లించేందుకు ఇష్టపడరు. ముందు చెల్లించడం అనవసరం.. దీనివల్ల ఏ ప్రయోజనమూ ఉండదు అనే భావనే ఇందుకు కారణం. అయితే, చివరి నిమిషం వరకూ వేచి చూడకుండా..  బీమా ప్రీమియాన్ని కాస్త ముందే చెల్లిస్తే కొన్ని ప్రయోజనాలూ ఉన్నాయి.

ఈ రోజు చేతిలో డబ్బు ఉండొచ్చు.. ఏదైనా అత్యవసరం వచ్చి.. దాన్ని వాడేసుకుంటే.. తీరా బీమా ప్రీమియం చెల్లించే నాటికి ఆ మొత్తం అందుబాటులో లేకపోతే.. పాలసీ రద్దయ్యే ప్రమాదం ఉంది. అందుకే, పాలసీకి సంబంధించిన ప్రీమియాన్ని ముందుగానే చెల్లించడం కొన్ని సందర్భాల్లో మేలే చేస్తుంది. ఇలా ముందుగానే బీమా ప్రీమియం చెల్లించాలనుకుంటున్న పాలసీదారులకు లాభం చేకూర్చేందుకు బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) సైతం కొన్ని చర్యలు తీసుకుంటోంది. ముందుగానే ప్రీమియం చెల్లించిన వారికి కొంత రాయితీ ఇచ్చేందుకు ప్రయత్నించాలనీ మార్గదర్శకాలను రూపొందించింది. దీనివల్ల పాలసీదారులకు ప్రీమియంలో రాయితీ లభించడంతోపాటు, పాలసీ రద్దు కాకుండా చూసుకునేందుకూ ఉపయోగపడుతుంది. ఇప్పటికే కొన్ని బీమా సంస్థలు ఈ విషయాన్ని అమలు చేస్తున్నాయి. ముందుగానే పునరుద్ధరణ ప్రీమియం చెల్లించిన పాలసీదారులకు డిస్కౌంటులను అందిస్తున్నాయి.

అడ్డంకులు లేకుండా..

గడువు తేదీకి ముందుగానే పునరుద్ధరణ ప్రీమియం చెల్లించడం వల్ల పాలసీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొనసాగుతుంది. సమయానికి డబ్బు లేకపోతే.. పాలసీ రద్దవుతుందనే ఆందోళన ఉండదు. పాలసీ ప్రీమియాన్ని ఏడాదిలో ఎప్పుడైనా చెల్లించడం ద్వారా.. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఇలా ముందుగానే ప్రీమియం చెల్లించినప్పుడు బీమా సంస్థలు అందించే రాయితీ వల్ల భారం తగ్గుతుంది.

రక్షణ కొనసాగేలా..

జీవిత బీమా ఒక దీర్ఘకాలిక ఒప్పందం. పాలసీ వ్యవధి మొత్తం ప్రీమియం చెల్లించినప్పుడే దీని ప్రయోజనాలు పూర్తిగా అందుతాయి. ముందస్తు ప్రీమియం చెల్లింపు వల్ల పాలసీదారులు తమ బడ్జెట్‌ను అందుకు అనుగుణంగా సిద్ధం చేసుకునేందుకు వీలవుతుంది. ఏదైనా అనుకోని ఆదాయం, బోనస్‌లాంటివి వచ్చినప్పుడు ఇతర ఆర్థిక లక్ష్యాల సాధనకు ఉపయోగించుకోవచ్చు.

పాలసీదారులు ముందస్తు ప్రీమియం చెల్లింపును పన్ను మినహాయింపు కోసమూ క్లెయిం చేసుకోవచ్చు. అయితే, ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ పరిమితికి లోబడి ఇది ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి.

- అట్రిచక్రవర్తి, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌,
ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని