Updated : 19 Nov 2021 05:48 IST

మదుపు చేద్దాం.. వైవిధ్యంగా...

ఒకే ఆదాయం.. ఒకే చోట పెట్టుబడి.. ఆర్థికంగా విజయం సాధించాలని అనుకునే వారికి ఈ రెండూ అవరోధాలే. షేర్లు, డెట్‌, బంగారం, స్థిరాస్తి.. ఇలా వైవిధ్యమైన చోట పెట్టుబడుల వికేంద్రీకరణ తప్పనిసరి. అప్పుడే దీర్ఘకాలంలో లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన మార్గం ఏర్పడుతుంది. అందుకు తగ్గట్టుగా పెట్టుబడుల ప్రణాళిక ఉండాలి.

లక్ష్యం ఏమిటో తెలుసా?

ఒక్కో పథకం పనితీరు ఒక్కో రీతిగా ఉంటుంది. దీన్నిబట్టే రాబడీ ఆధారపడుతుంది. మీరు అనుకుంటున్న లక్ష్య ఆధారంగా పథకాల ఎంపిక ఉండాలి. నష్టభయం భరించే సామర్థ్యం, ఇంకా ఎన్నాళ్ల వ్యవధి ఉంది, వాస్తవ పనితీరు ఇలా పలు అంశాలు పథకం ఎంపికలో ముఖ్యం. మీ పెట్టుబడి కేటాయింపులు ఎప్పుడూ మీరు ముందుగా అనుకున్న ప్రణాళికలోనే ఉండాలి. ఇదంతా ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలోనే పూర్తి కావాలి.

స్వల్పకాలంలో వద్దు..

చాలామంది ఒక పథకం నుంచి మరో పథకానికి పెట్టుబడులను మారుస్తూ ఉంటారు. స్వల్పకాలంలో ఒక పథకం పనితీరును అంచనా వేయలేం. కాబట్టి, ఇలా మార్చడం అంత మంచిపని కాదు. మీరు ఇప్పటికే ఏ విభాగానికి ఎంత కేటాయించాలి అని నిర్ణయించుకున్నారు కాబట్టి, దానినే పాటించండి. మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా పథకాల ఎంపిక జరగాలి. స్వల్పకాలిక హెచ్చుతగ్గులు ఎక్కడైనా సహజమే. కనీసం 10-12 ఏళ్లకు మించి వ్యవధి ఉండి, డబ్బుతో ఇప్పటికిప్పుడు ఎలాంటి అవసరం లేదు అనుకున్నప్పుడే ఈక్విటీ పెట్టుబడులకు కేటాయింపులు కాస్త అధికంగా ఉన్నా ఇబ్బంది ఉండదు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయడమే ఉత్తమం. 5-10 ఏళ్ల మధ్య వ్యవధి ఉన్నప్పుడు హైబ్రీడ్‌, డెట్‌ ఫండ్లను ఎంచుకోవడం మంచిది.

ఎప్పుడూ మార్కెట్లో ఉండాలి..

చాలామంది పెట్టుబడి కోసం సరైన సమయం రావాలని అనుకుంటారు. నిజానికి ఇది ఎప్పటికీ రాదు. సూచీల గమనం ఎటువైపున్నా.. మదుపు ప్రారంభించడం, దీర్ఘకాలం కొనసాగడమే వ్యూహంగా ఉండాలి. అన్ని రకాల పెట్టుబడి పథకాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. పదేళ్లకు మించి మార్కెట్లో కొనసాగాలని అనుకునే వారికి ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయంతో అంతగా సంబంధం ఉండదు.

పన్ను భారం లేకుండా..

మదుపు చేసినప్పుడు వచ్చే ఆదాయంపై పన్ను భారం ఉండకూడదు. అలాంటప్పుడు మనకు వచ్చే నికర రాబడి తగ్గిపోతుంది. రాబడిపై పన్ను భారం తక్కువగా ఉండే ఈక్విటీలాంటి పథకాలకు, లేదా వీపీఎఫ్‌, పీపీఎఫ్‌లాంటి వాటికి దీర్ఘకాలిక దృష్టితో ప్రాధాన్యం ఇవ్వాలి.

నష్టభయం తగ్గేలా...

చరిత్రను గమనిస్తే.. దీర్ఘకాలిక పెట్టుబడులు ఎప్పుడూ మంచి ఫలితాలనే అందించాయని గమనించవచ్చు. ఒక్కో పథకం పనితీరు ఒక్కో కాలంలో ఒక్కో తీరుగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగవుతున్నప్పుడు కొన్ని రంగాల పనితీరు బాగుంటుంది. మరికొన్నింటికి ఇది ప్రతికూలంగా ఉండొచ్చు. అందుకే, మన పెట్టుబడి ఎప్పుడూ.. అన్ని రకాల పథకాల్లోనూ నిర్ణీత శాతంలో ఉండాలి. దీనివల్ల నష్టభయం అంతగా ఉండకుండా.. మధ్యస్థంగా ఉంటుంది. ఒక పథకంలో తక్కువ రాబడి వచ్చినప్పుడు.. మరో పథకంలో అధిక రాబడి వస్తుంది. ఇలా రాబడి సగటు కనిపిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే.. లాభం.. నష్టాలను సమన్వయం చేసుకుంటూ సాగడం అన్నమాట.

పెట్టుబడులు పెట్టేటప్పుడు భవిష్యత్‌ గురించి ఆలోచించాలి. ఇప్పటికిప్పుడు లాభాల కోసం కాదు. అప్పుడే.. అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని