కొత్త సంవత్సరంలో వాతలే

నూతన సంవత్సరంలో మరిన్ని ఆర్థిక భారాలు జత చేరనున్నాయి. ఏటీఎం ఛార్జీల రూపంలో అందరికీ రుసుములు పడే వీలుండగా, కార్ల ధరలను పెంచుతున్నట్లు దిగ్గజ సంస్థలు ప్రకటించాయి. మారుతీ సుజుకీతోపాటు విలాస కార్లను ఉత్పత్తి చేసే మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి సంస్థలు

Updated : 05 Dec 2021 15:54 IST

 జనవరి నుంచి పెరగనున్న ఏటీఎం ఛార్జీలు
1 నుంచి మారుతీ, మెర్సిడెస్‌, ఆడి కార్ల ధరల పెంపు

నూతన సంవత్సరంలో మరిన్ని ఆర్థిక భారాలు జత చేరనున్నాయి. ఏటీఎం ఛార్జీల రూపంలో అందరికీ రుసుములు పడే వీలుండగా, కార్ల ధరలను పెంచుతున్నట్లు దిగ్గజ సంస్థలు ప్రకటించాయి. మారుతీ సుజుకీతోపాటు విలాస కార్లను ఉత్పత్తి చేసే మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి సంస్థలు తమ కార్ల ధరల్ని జనవరి నుంచి పెంచనున్నట్లు గురువారం ప్రకటించాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం సహా కార్లలో సదుపాయాలు పెంచడం కోసం అదనపు వ్యయాలు అవుతున్నందున ధరలు పెంచక తప్పట్లేదని ఆయా సంస్థలు వెల్లడించాయి.
* మారుతీ సుజుకీ.. మోడల్‌ ఆధారంగా ధరల్ని పెంచుతున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే కంపెనీ మూడు సార్లు కార్ల ధరల్ని పెంచింది. జనవరిలో 1.4%, ఏప్రిల్‌లో 1.6%, సెప్టెంబరులో 1.9% (మొత్తం 4.9%) చొప్పున ధరలు సవరించింది. ‘ఏడాది నుంచి ఉక్కు (కిలో రూ.38 నుంచి  రూ.77కు), అల్యూమినియం(టన్ను 1800 డాలర్ల నుంచి 2800 డాలర్లకు)తో పాటు రాగి, ప్లాస్టిక్‌, విలువైన లోహాల ధరలు బాగా పెరిగాయి. వాహన తయారీలో 75-80 శాతం వాటా ఈ లోహాలదే. దీంతో ఉత్పత్తి వ్యయం భారమైంది. అందువల్లే మరోసారి ధరలు పెంచక తప్పట్లేద’ని మారుతీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ వెల్లడించారు.
* ఎంపిక చేసిన మోడళ్లపై జనవరి 1 నుంచి 2 శాతం వరకు ధరలు (ఎక్స్‌-షోరూమ్‌) పెంచుతున్నట్లు మెర్సిడెస్‌ బెంజ్‌ తెలిపింది. అయితే ఇప్పటికే బుక్‌ చేసుకుని, వాహన డెలివరీ కోసం ఎదురు చూస్తున్న వారికి పాత ధరలే వర్తిస్తాయని పేర్కొంది.  
* 2022 జనవరి 1 నుంచి తమ అన్ని మోడళ్లపై 3 శాతం వరకు ధరల పెంపు అమల్లోకి వస్తుందని ఆడి పేర్కొంది.


 సిమెంటు ధర బస్తాకు రూ.15-20 పెరగొచ్చు క్రిసిల్‌ అంచనా

వచ్చే కొద్ది నెలల్లో సిమెంటు బస్తా ధర మరో రూ.15-20 పెరిగి, ఈ ఆర్థిక సంవత్సరంలోనే గరిష్ఠంగా రూ.400 వరకు చేరొచ్చని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేసింది. బొగ్గు, డీజిల్‌ వంటి ముడిపదార్థాల ధరలు పెరగడం, గిరాకీ అధికమవ్వడం ఇందుకు నేపథ్యమని తెలిపింది. ముడిపదార్థాల అధిక ధరల వల్ల సిమెంటు కంపెనీల ఎబిటా (వడ్డీ, పన్నుకు ముందు లాభం) టన్నుకు రూ.100-150 వరకు తగ్గొచ్చని చెబుతోంది. దిగుమతి బొగ్గు (120% పెరిగింది), పెట్‌కోక్‌ (80% అధికం) ధరల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌, ఇంధన వ్యయాలు సిమెంటు టన్ను ఉత్పత్తిపై రూ.350-400 (40%) మేర పెరగొచ్చని సంస్థ అంచనా వేసింది. గతేడాది తక్కువ ప్రాతిపదిక కారణంగా ఈసారి విక్రయాలు  11-13 శాతం వృద్ధి చెందొచ్చనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో సిమెంటు గిరాకీ 20% పెరిగినా.. అధిక ప్రాతిపదిక కారణంగా రెండో భాగంలో 3-5 శాతానికే పరిమితం కావొచ్చని అంటోంది. దక్షిణ భారతంలో అక్టోబరులో అత్యధికంగా బస్తాకు రూ.54 మేర ధర పెరిగిన సంగతి తెలిసిందే.


ఏటీఎంలో నగదు ఉపసంహరణపై

ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తరవాతా, వినియోగదార్లు ఏటీఎం నుంచి నగదు తీసుకుంటే అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. పరిమితికి మించిన నగదు, నగదేతర ఏటీఎం లావాదేవీలపై 2022 జనవరి నుంచి ఛార్జీలు పెంచుకోవచ్చని గత జూన్‌లోనే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు అనుమతి మంజూరు చేసిన సంగతి విదితమే. ఈ మార్గదర్శకాల ప్రకారం, పరిమితికి మించిన ఆర్థిక లావాదేవీపై రూ.21+జీఎస్‌టీ వర్తిస్తుందని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. ఇప్పటివరకు ఈ ఛార్జీ రూ.20+జీఎస్‌టీగా ఉంది. తమ ఖాతాదారులు బ్యాంక్‌ ఏటీఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగించుకున్నా ఇది వర్తిస్తుందని తెలిపింది.
* వినియోగదార్లు తమ ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అదనంగా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మెట్రో కేంద్రాల్లో 3, మెట్రోయేతర కేంద్రాల్లో 5 ఉచిత లావాదేవీలు నిర్వహించే వెసులుబాటు ఉంది.
* ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెంచుకునేందుకూ ఆర్‌బీఐ ఆమోదించిన నేపథ్యంలో, ఆర్థిక లావాదేవీలపై రుసుమును రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు గత ఆగస్టు నుంచే బ్యాంకులు అమల్లోకి తీసుకొచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని