Investments: అన్ని రకాలైన మదుపు సాధనాల్లో

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి కొత్తగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ప్యాసివ్‌ మల్టీ అసెట్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఈక్విటీలతోపాటు, రుణ పత్రాలు, బంగారం, అంతర్జాతీయ ప్యాసివ్‌ ...

Updated : 31 Dec 2021 09:45 IST

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి కొత్తగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ప్యాసివ్‌ మల్టీ అసెట్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఈక్విటీలతోపాటు, రుణ పత్రాలు, బంగారం, అంతర్జాతీయ ప్యాసివ్‌ మ్యూచువల్‌ ఫండ్లు, ఈటీఎఫ్‌లలో మదుపు చేయడం దీని ప్రత్యేకత. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ జనవరి 10. కనీస పెట్టుబడి రూ.1,000. క్రిసిల్‌ హైబ్రిడ్‌ 50+50 టీఆర్‌ఐ (80 శాతం వెయిటేజీ)తో పాటు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ 1200 ఇండెక్స్‌ (15 శాతం వెయిటేజీ), దేశీయ బంగారం ధర (5 శాతం వెయిటేజీ)ను ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు నగదు లభ్యత (లిక్విడిటీ) పెంచేందుకు గత రెండేళ్లుగా చర్యలు తీసుకున్న విషయం విదితమే. తత్ఫలితంగా ఈక్విటీ పెట్టుబడులపై అధిక లాభాలు కనిపించాయి. కానీ ఇకపై ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ నగదు లభ్యతను తగ్గించేందుకు, వడ్డీరేట్లు పెంచేందుకు కేంద్ర బ్యాంకులు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పలు రకాలైన పెట్టుబడి సాధనాలకు (మల్టీ- అసెట్‌) పెట్టుబడులను మళ్లించటం ద్వారా నష్టభయం తగ్గించుకోవటానికి, ఒక మోస్తరు లాభాలు ఆర్జించటానికి అవకాశం ఉందనేది నిపుణుల విశ్లేషణ. ఈ ఫండ్‌ నిర్వహణ వ్యయం (ఎక్స్‌పెన్సెస్‌ రేషియో), రెగ్యులర్‌ ప్లాన్‌కు 1 శాతం కంటే మించి ఉండదు. డైరెక్ట్‌ ప్లాన్‌ అయితే 0.4 శాతమే. ఇదొక సానుకూలత. తమ పెట్టుబడులను వివిధ రకాలైన పెట్టుబడి సాధనాల వైపు మళ్లించాలనుకునే వారికి అన్నీ ఒకే చోటే లభించే ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.


మూలధన వృద్ధి కోసం..

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్‌కం విభాగానికి చెందిన క్లోజ్‌ ఎండెడ్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ (ఎఫ్‌ఎంపీ), సిరీస్‌ 58 (1842 రోజులు) అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ జనవరి 4 వరకూ అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.5,000. అధిక ఇంట్రస్ట్‌ రేట్‌ రిస్కు, తక్కువ క్రెడిట్‌ రిస్కు ఉండటం ఈ పథకానికి ఉన్న లక్షణాలు. క్రిసిల్‌ మీడియం టు లాంగ్‌టర్మ్‌ డెట్‌ ఇండెక్స్‌ను ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా తీసుకుంటారు. రంజనా గుప్తా ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. మదుపరులకు క్రమం తప్పకుండా ఆదాయాన్ని, మూలధన వృద్ధిని అందించడం ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని నిర్వహిస్తారు.


నిరీక్షణ వ్యవధి ఏడాదే

ముందస్తు వ్యాధులకు పరిహారం ఇచ్చే విషయంలో వేచి ఉండే సమయం సాధారణంగా రెండు నుంచి నాలుగేళ్ల వరకూ ఉంటుంది. కొన్ని నిర్ణీత వ్యాధుల చికిత్సల పరిహారానికీ రెండేళ్లపాటు నిరీక్షించాలి. దీనికి బదులుగా అన్ని రకాల ముందస్తు వ్యాధుల చికిత్సకూ ఏడాది పాటే వేచి ఉంటే చాలని అంటోంది డిజిట్‌ ఇన్సూరెన్స్‌. కంటి శుక్లాలు, లివర్‌ సిరోసిస్‌, హెర్నియా తదితర 30 రకాల చికిత్సలకు నిరీక్షణ వ్యవధి ఉంటుంది. ఏడాది తర్వాత వీటన్నింటికీ పరిహారం లభించడం వల్ల పాలసీదారులకు ఉపయోగకరంగా ఉంటుందని డిజిట్‌ ఇన్సూరెన్స్‌ అంటోంది.


ప్రీమియం తిరిగిచ్చే టర్మ్‌ పాలసీ

జీవితంలో బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పుడు పాలసీ విలువ పెరుగుతుంది.. బాధ్యతలు తగ్గినప్పుడు అందుకు అనుగుణంగా పాలసీ విలువ తగ్గుతుంది.. ఇలాంటి వినూత్న టర్మ్‌ పాలసీని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకొచ్చింది. ఐసీఐసీఐ ప్రు. ఐప్రొటెక్ట్‌ రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం పేరుతో వచ్చిన ఈ పాలసీలో మరో ప్రత్యేకతా ఉంది. 60-70 ఏళ్ల వయసులో పాలసీదారులు చెల్లించిన ప్రీమియాన్ని 105 శాతం వెనక్కి ఇస్తుంది. ప్రీమియం తిరిగి రావడం లైఫ్‌ స్టేజ్‌ కవర్‌, లేదా ఒకే విధంగా పాలసీ రక్షణ లెవల్‌ కవర్‌.. ఈ రెండింటిలో దేనినైనా ఎంచుకునే వీలుంది. దీంతోపాటు 64 తీవ్ర వ్యాధులకు వర్తించేలా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌నూ అదనంగా జోడించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని