Demat Nominee: డీమ్యాట్‌ ఖాతా నామినీ పేరు రాశారా?

స్టాక్‌ మార్కెట్లు కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తుండటంతో ఎంతోమంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దశాబ్దాల క్రితం డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు తీసుకోవడం పెద్ద ప్రహసనంగా ఉండేది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ క్షణాల్లోనే ఈ ఖాతాలు తీసుకోవచ్చు. వీటికి నామినేషన్‌ పేర్కొనడమూ గతంతో పోలిస్తే మరింత సులభం అయ్యింది. డీమ్యాట్‌ ఖాతాలో నామినీ పేరు ఎందుకు ఉండాలి.. తెలుసుకుందాం..

Updated : 14 Jan 2022 09:59 IST

స్టాక్‌ మార్కెట్లు కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తుండటంతో ఎంతోమంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దశాబ్దాల క్రితం డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు తీసుకోవడం పెద్ద ప్రహసనంగా ఉండేది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ క్షణాల్లోనే ఈ ఖాతాలు తీసుకోవచ్చు. వీటికి నామినేషన్‌ పేర్కొనడమూ గతంతో పోలిస్తే మరింత సులభం అయ్యింది. డీమ్యాట్‌ ఖాతాలో నామినీ పేరు ఎందుకు ఉండాలి.. తెలుసుకుందాం..

చాలామంది పెట్టుబడులు పెట్టే క్రమంలో అన్ని వివరాలూ పూర్తి చేస్తారు. బ్యాంకు, డీమ్యాట్‌ ఖాతా కానీయండి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బీమా, మ్యూచువల్‌ ఫండ్లు.. ఏదైనా సరే.. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా ఒక ఖాళీని పెడుతుంటారు అదే నామినీ పేరు రాయడం. ఇది అవసరమా అనే ధోరణే అనేకమందిలో కనిపిస్తుంటుంది. కానీ, కొన్నిసార్లు ఈ ఖాళీని పూరించకపోవడం వల్ల ఎంతో కష్టం భరించాల్సి వస్తుంది.
పెట్టుబడుల  అసలు యజమానికి ఏదైనా జరిగినప్పుడు.. అతనికి బదులుగా వాటిని తీసుకునే హక్కు ఉన్న వ్యక్తే నామినీ. ఇది ఎవరైనా కావచ్చు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, తోబుట్టువులు, ఎన్‌ఆర్‌ఐ, మైనర్‌ ఇలా ఎవరిపేరైనా నామినీగా పేర్కొనే వీలుంది. నామినీకి ఎంత శాతం వాటా ఉందనేదీ రాయొచ్చు.

ఇబ్బందుల్లేకుండా..

పలు ఖాతాలు, ఇతర పెట్టుబడులకు సంబంధించి నామినీ లేకపోతే.. ఏదైనా అనుకోని సందర్భంలో వాటిని క్లెయిం చేసుకోవాల్సి వచ్చినప్పుడు వారసులకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. వీలునామా, వారసత్వ ధ్రువీకరణ ఇలా ఎన్నో పత్రాలు అవసరం అవుతాయి. ఈ ఇబ్బందులన్నింటినీ ఒక్క నామినీ పేరు పేర్కొనడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ఇక్కడ మరో విషయమూ గుర్తుంచుకోవాలి. మదుపరులు ఒకరికి మించి నామినీ పేర్లనూ సూచించేందుకు వీలుంది.

ఆన్‌లైన్‌లోనే..

డీమ్యాట్‌ ఖాతాను డిజిటల్‌లో ప్రారంభించేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. నామినీ కోసం ప్రత్యేకంగా దరఖాస్తును పంపించాల్సి వచ్చేది. కానీ, ఇటీవలే సెబీ ఈ నిబంధనలను సవరించింది. ఇ-సైన్‌ ద్వారా నామినీని పేర్కొనే వెసులుబాటును కల్పించింది. అక్టోబరు 1, 2021 నుంచి డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభించిన వారు తప్పనిసరిగా నామినీ పేరు పేర్కొనాలనే నిబంధన విధించింది.

ఎలా పేర్కొనాలంటే..

వ్యక్తిగతంగా ఖాతాలు తీసుకున్న వారు నామినీ పేరును పేర్కొనడానికి ఇబ్బందేమీ లేదు. కానీ, ఉమ్మడి ఖాతాలున్న వారు నామినీ పేరు చేర్చాలన్నా, మార్చాలన్నా అందరి సంతకాలూ అవసరం అవుతాయి. డీపీ (డిపాజిటరీ పార్టిసిపెంట్‌)ల దగ్గర నామినీ పేరు కోసం నిర్ణీత దరఖాస్తు ఫారం ఉంటుంది. దీన్ని పూర్తి చేసి అందించాల్సి ఉంటుంది. దీనిపై ఒక సాక్షి సంతకమూ అవసరం అవుతుంది.

మార్చి 31 లోపు..

సెబీ నిబందనల ప్రకారం డీమ్యాట్‌ ఖాతాదారులు తమ ఖాతాలకు నామినేషన్‌ను మార్చి 31, 2022లోపు తెలియజేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఖాతాలను నిలిపివేసే ఆస్కారం ఉంది. కాబట్టి, మీ ఖాతాలకు నామినీ ఉన్నారా లేదా చూసుకోండి. లేకపోతే వెంటనే నామినీ పేరును పేర్కొనండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. నామినీ పేరును ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు.

- రామ్‌కుమార్‌, చీఫ్‌ ఆఫ్‌ బిజినెస్‌, సీడీఎస్‌ఎల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని