Financial Planning : ఆర్థికారోగ్యం పట్టించుకోండి

గత రెండేళ్లలో మనం ఊహించని సంఘటనలు ఎన్నో చూశాం. దేశ వ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు ఆరోగ్య అత్యవసరాలు, ఆర్థిక భారాన్ని ఎదుర్కొన్నాయి. ప్రజల జీవితాల్ని తలకిందులు చేసిన మహమ్మారి మరోసారి తన రూపం మార్చుకొని, సవాలు విసురుతోంది. ఇలాంటి సమయంలో మన శారీరక, మానసిక, ఆర్థిక ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

జీవితంలో అనిశ్చితి ఏర్పడినప్పుడు మన ఆర్థిక ప్రణాళికలు పట్టాలు తప్పుతుంటాయి. అయినప్పటికీ కాస్త జాగ్రత్తగా వాటిని మళ్లీ గాడిన పెట్టొచ్చు. కొత్తగా ప్రారంభించొచ్చు. అయితే, ముందుగా మన ఆర్థికారోగ్యం ఎలా ఉంది? అనే సంగతి తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కొన్ని ప్రశ్నలకు మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి. ముందుగా మనం ఆర్థికంగా ఇబ్బందుల్లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి.


పదవీ విరమణ ప్రణాళిక..

సంపాదన మొదలైనప్పుడే పదవీ విరమణ ప్రణాళిక ప్రారంభం కావాలి. పీపీఎఫ్‌, జాతీయ పింఛను పథకం, యాన్యుటీ ప్లాన్లు ఇలా ఏదో ఒకదాంట్లో మదుపు చేయాలి. బంగారం, స్థిరాస్తి, ఇతర పెట్టుబడి పథకాలనూ పరిశీలించాలి.
ఎ) ఇప్పటివరకూ పదవీ విరమణ ప్రణాళికలు ప్రారంభించలేదు.
బి) పదవీ విరమణ ప్రణాళిక ఉంది. కానీ, తగిన పెట్టుబడులు లేవు.
సి) అనుకున్నట్లుగానే పదవీ విరమణ పెట్టుబడులు కొనసాగుతున్నాయి.


అత్యవసర నిధి..

చాలామందికి అనుకోని ఖర్చులను తట్టుకోవడం ఎలాగో తెలియదు. కొంతమందికిది దాదాపు అసాధ్యం కూడా. ఇలాంటి పరిస్థితి  రెండేళ్లుగా ఎంతోమందికి ఎదురయ్యింది. అందుకే, ప్రతి కుటుంబం అత్యవసర నిధికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే కొత్త అప్పులు చేయకుండా.. ఉన్న పొదుపు, పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా ఉండగలం. కనీసం ఆరు నెలలకు సరిపోయే అత్యవసర నిధి మీ దగ్గర ఉందా లేదా చూసుకోండి.
ఎ) అత్యవసర నిధి లేదు.
బి) అత్యవసర నిధి ఉంది. గతంలో అనుకోని ఖర్చులకు ఉపయోగపడింది.
సి) అత్యవసర నిధి ఉన్నా ఇప్పటివరకూ అవసరం రాలేదు.


బీమా...

అనుకోని పరిస్థితుల్లో వచ్చే ఆర్థిక భారాన్ని తట్టుకునే శక్తిని బీమా పాలసీలు ఇస్తాయి. 2020, 2021లో ఎంతోమందికి ఆరోగ్య బీమా అవసరం ఏర్పడింది. జీవిత బీమా పాలసీలు.. కుటుంబ పెద్దకు ఏదైనా జరిగినప్పుడు ఆ బాధ్యతను కొంతమేరకు తీసుకుంటాయి. అత్యవసర నిధి తర్వాత మనకు ఉండాల్సిన మరో ముఖ్యమైన అంశం బీమానే.
ఎ) ఇప్పటికీ బీమా పాలసీలు లేవు.
బి) ఆరోగ్య బీమా ఉంది.. గతంలో క్లెయిం చేసుకున్నాం.
సి) ఆరోగ్య బీమా పాలసీ అవసరం ఇప్పటి వరకూ రాలేదు.


రుణాలు..

అత్యవసరంగా డబ్బు కావాల్సివచ్చినప్పుడు అప్పు చేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ, ఆర్థిక భారం తప్పదు. వ్యక్తిగత రుణాలు 10%-20% వడ్డీకి వస్తాయి. క్రెడిట్‌ కార్డులపై 40శాతం వార్షిక వడ్డీ ఉంటుంది. అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నప్పుడు మన ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం ఉంది.
ఎ) గతంలో కొత్త రుణం తీసుకొని, ఈఎంఐలు చెల్లించడంలో ఇబ్బంది ఎదుర్కొన్నాను.
బి) రుణం తీసుకున్నా ఈఎంఐల చెల్లింపులో ఇబ్బంది రాలేదు.
సి) ఇప్పటి వరకూ రుణం తీసుకోలేదు.


పెట్టుబడులు..

దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు పెట్టుబడులకు మించిన మార్గం లేదు. రూ.500లతోనూ పెట్టుబడులను ప్రారంభించవచ్చు. గత రెండేళ్ల కాలంలో ఎంతోమంది తమ పెట్టుబడులను ఆపేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు మళ్లీ మహమ్మారి మూడో విడత సాగుతున్న నేపథ్యంలో పెట్టుబడుల గురించి ఏం ఆలోచిస్తున్నారనేది ముఖ్యం. చిన్న మొత్తాలతోనైనా పెట్టుబడులు కొనసాగించడం ఎప్పుడూ ఆపొద్దు..
ఎ) ఇప్పటికే సిప్‌, ఇతర పెట్టుబడులను నిలిపివేశాను.
బి) కొంతకాలంగా ఎలాంటి పెట్టుబడులూ ప్రారంభించలేదు. పాతవాటిని ఆపేయలేదు.
సి) కొత్త పెట్టుబడులను ప్రారంభించాను.


ముందుగా ప్రతి అంశంలోని ప్రశ్నలో మీకు ఏది వర్తిస్తుందనేది ఎంచుకోండి.

అధిక మొత్తంలో ‘ఎ’ మీ సమాధానం అయితే.. మీరు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అత్యవసర నిధి ఏర్పాటు, అధిక వడ్డీల అప్పులు తీర్చడం, మిగులు మొత్తాలను పెట్టుబడులకు మళ్లించడం విషయంలో శ్రద్ధ చూపించాలి.

‘బి’కి ఎక్కువ మార్కులు వస్తే.. అత్యవసర నిధిని భర్తీ చేసుకోవాలి. బీమా అవసరాలను సమీక్షించుకోవాలి. మహమ్మారికి ముందున్న ఆర్థిక ప్రణాళికలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండండి.

మీ సమాధానం అన్నింటికీ ‘సి’ అయితే.. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉన్నారు. దీనిని ఇలాగే కొనసాగిస్తూ ఉండండి. మీరు అనుకున్న లక్ష్యాలన్నింటినీ చేరడంలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురవ్వవు.

- బి.గోప్‌కుమార్‌, ఎండీ-సీఈఓ, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని