రుణం తీసుకుంటే.. బీమా తప్పదా?

రూ.27 లక్షల గృహరుణం తీసుకుంటున్నాను. ఈ రుణంతోపాటు బీమా పాలసీ తీసుకోవాలని బ్యాంకు ఒత్తిడి చేస్తోంది. ఇలా బీమా తీసుకోవడం తప్పనిసరా?

Updated : 28 Jan 2022 04:20 IST

రూ.27 లక్షల గృహరుణం తీసుకుంటున్నాను. ఈ రుణంతోపాటు బీమా పాలసీ తీసుకోవాలని బ్యాంకు ఒత్తిడి చేస్తోంది. ఇలా బీమా తీసుకోవడం తప్పనిసరా?

- మోహన్‌

రుణాలు తీసుకునేటప్పుడు దానికి రక్షణగా ఒక బీమా పాలసీని తీసుకోవడం మంచిదే. గృహరుణం లాంటి పెద్ద అప్పులకు ఇది తప్పనిసరి అవసరం. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గృహరుణాన్ని ఇచ్చేటప్పుడు దానికి అనుబంధంగా లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీని తీసుకోవాల్సిందిగా సూచిస్తుంటాయి. ఒక రకంగా ఇది మంచిదే. మీ రుణ వ్యవధి ఉన్నంత వరకూ బీమా రక్షణ కొనసాగేలా చూసుకోవాలి. ఏక ప్రీమియం ద్వారా ఈ బీమా పాలసీని ఎంచుకోవచ్చు. చాలా బ్యాంకులు ఈ ప్రీమియానికీ రుణాన్ని ప్రత్యేకంగా మంజూరు చేస్తాయి. సాధ్యమైనంత వరకూ ప్రీమియం చెల్లింపు కోసం రుణం తీసుకోవద్దు.


నేను ప్రస్తుతం యూఎస్‌ఏలో ఉంటున్నాను. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కొన్ని షేర్లలో మదుపు చేశాను. వాటిని అలాగే కొనసాగిస్తున్నాను. ఇప్పుడు నేను ఎన్‌ఆర్‌ఐని కాబట్టి, కొత్తగా షేర్లను కొనొచ్చా? డీమ్యాట్‌ ఖాతాలో నా వివరాలేమైనా మార్చాల్సి ఉంటుందా?

- శ్రీనివాస్‌ రెడ్డి

ప్పుడు మీరు ప్రవాస భారతీయులు (నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌) కాబట్టి, మీ కేవైసీ వివరాలు మార్చాల్సి ఉంటుంది. ముందుగా మీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థను సంప్రదించి, వివరాలు తెలియజేయండి. కేవైసీ వివరాలతో పాటు, మీ డీమ్యాట్‌ ఖాతాకు అనుసంధానమైన బ్యాంకు ఖాతా సైతం ఎన్‌ఆర్‌ఈ లేదా ఎన్‌ఆర్‌ఓ ఖాతాగా మార్చాలి. ఈ మార్పులన్నీ పూర్తయ్యాకే కొత్తగా షేర్లను కొనేందుకు ప్రయత్నించండి.


నెలకు రూ.8వేలు మదుపు చేయాలనేది ఆలోచన. రెండుమూడేళ్ల తర్వాత ఇందులో నుంచి కొంత మొత్తం వెనక్కి తీసుకుంటాను. నష్టభయం కాస్త మధ్యస్థంగా ఉండేలా ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?

- చంద్ర

ధిక రాబడి రావాలంటే.. కాస్త నష్టభయం ఉన్న పథకాలను ఎంచుకోవాల్సిందే. పెట్టుబడికి అయిదారేళ్లు వ్యవధి ఉన్నప్పుడు వీటి వల్ల మంచి రాబడిని ఆశించవచ్చు. మీకు నష్టభయం కాస్త తక్కువగా ఉండాలంటే.. హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. రెండుమూడేళ్లలో డబ్బు వెనక్కి తీసుకోవాలంటే.. సురక్షిత పథకం.. రికరింగ్‌ డిపాజిట్‌ను పరిశీలించండి.


నాకు ఇటీవలే కరోనా సోకింది. నాలుగేళ్ల క్రితం రూ.25లక్షల టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని పెంచుకునేందుకు బీమా సంస్థలు అనుమతినిస్తాయా?

- ప్రసాద్‌

జీవిత బీమా తీసుకోవాలనుకున్నప్పుడు.. కొన్ని ప్రత్యేక వ్యాధులకే వేచి ఉండే సమయం ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కరోనా సోకిన వారికీ బీమా సంస్థలు 3-6 నెలల వేచి ఉండే సమయాన్ని నిర్ణయించాయి. కొన్ని సంస్థలు దీన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి, ముందుగా మీరు పాలసీ తీసుకున్న బీమా సంస్థను సంప్రదించండి. కొత్త పాలసీ తీసుకునేటప్పుడు మీ ఆర్థిక, ఆరోగ్య వివరాలను పేర్కొనండి. బీమా సంస్థ విచక్షణ మేరకు మీ పాలసీ విలువను పెంచుకునేందుకు అవకాశం లభిస్తుంది.


మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలకు బదులుగా ఈటీఎఫ్‌లను ఎంచుకోవడం వల్ల లాభం ఎక్కువగా ఉంటుందా? ఇండెక్స్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు అందుకోవచ్చా?

- సత్యం

సాధారణ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలతో పోలిస్తే.. ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లకు (ఈటీఎఫ్‌) ఖర్చుల నిష్పత్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి, కొద్దిగా లాభం ఎక్కువే. మీ పెట్టుబడి మొత్తం ఇండెక్స్‌ ఫండ్లలో పెట్టడం కన్నా.. కొద్ది మొత్తం వాటికి కేటాయించి, మిగతాది డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. దీర్ఘకాలంలో ఇండెక్స్‌ ఫండ్లతో పోలిస్తే.. డైవర్సిఫైడ్‌ పథకాలే అధిక రాబడిని అందించే వీలుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని