Home Loan: ఇంటిరుణం తొందరగా తీరాలంటే..

దీర్ఘకాలం కొనసాగే గృహరుణాన్ని..వ్యవధికి లోపే చెల్లించడం కష్టంగా అనిపించవచ్చు. కానీ, జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుంటే.. దీన్ని సులభంగానే సాధించొచ్చు. ముందుగానే చెల్లించడం వల్ల పెద్ద మొత్తంలో వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.

Updated : 11 Feb 2022 09:10 IST

దీర్ఘకాలం కొనసాగే గృహరుణాన్ని..వ్యవధికి లోపే చెల్లించడం కష్టంగా అనిపించవచ్చు. కానీ, జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుంటే.. దీన్ని సులభంగానేసాధించొచ్చు. ముందుగానే చెల్లించడం వల్ల పెద్ద మొత్తంలో వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఈఎంఐల బాధ్యతల నుంచి బయటపడొచ్చు. అందుకోసం ఏం చేయాలంటే..

గృహరుణాన్ని తొందరగా ముగించేయడానికి రెండు మార్గాలున్నాయి. మొత్తం బాకీని ఒకేసారి చెల్లించడం.. లేదా కుదిరినప్పుడల్లా పాక్షికంగా రుణానికి జమ చేయడం. చాలామంది రుణ గ్రహీతలకు ఒకేసారి రుణం చెల్లించడం సాధ్యం కాదు. అందుకే, పాక్షిక చెల్లింపులతోనే ఈ భారాన్ని తొందరగా వదిలించుకునే ప్రయత్నం చేయాలి.

మిగులు డబ్బుతో..

గృహరుణం తీసుకునే సమయంలో రుణగ్రహీత ఈఎంఐ వారి ప్రస్తుత ఆర్థిక చెల్లింపు సామర్థ్యంకన్నా తక్కువగా ఉంచుతారు. రుణం తీసుకున్న కొన్నేళ్ల తర్వాత ఆదాయం పెరగొచ్చు. ఇలాంటి సందర్భాల్లో రుణగ్రహీత రుణాన్ని ముందస్తుగా చెల్లించేందుకు అదనపు ఆదాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అప్పు ఇచ్చిన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను సంప్రదించి, ఈఎంఐని పెంచాల్సిందిగా కోరవచ్చు. దీనివల్ల వడ్డీలో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. గృహరుణాన్ని నిర్ణీత వ్యవధుల్లో చెల్లించేందుకు డబ్బును కూడబెట్టడం మరో విధానం. దీనివల్ల మీరు వీలును బట్టి, మీ దగ్గరున్న సొమ్ముతో గృహరుణం నుంచి తొందరగా బయటపడొచ్చు. మీ దగ్గర ఎంత డబ్బు మిగులుతుంది అనేదాన్ని బట్టి, రెండింటిలో ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి.

అనుకోకుండా వచ్చే ఆదాయాలు...

సందర్భానుసారంగా వచ్చిన బోనస్‌లు, వారసత్వ ఆస్తి నుంచి ఆదాయంలాంటివి వచ్చినప్పుడు ఈ మొత్తాలను గృహరుణాన్ని ముందుగా చెల్లించేందుకు వాడుకోవచ్చు. దీనివల్ల మీ నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడి ఉండదు. ఇలాంటి సందర్భాల్లో ఈ మొత్తాలను గృహరుణానికి కేటాయించాలా? పెట్టుబడికి మళ్లించాలా అనేదీ విశ్లేషించుకోవాలి. గృహరుణంపై వడ్డీ కన్నా పెట్టుబడిపై రాబడి అధికంగా ఉంటే.. మీరు ఆ నిధులను పెట్టుబడి పెట్టొచ్చు. రెండింటినీ పోల్చి చూసినప్పుడు గృహరుణం వడ్డీ/అసలు తిరిగి చెల్లించినప్పుడు లభించే పన్ను ప్రయోజనం, పెట్టుబడి రాబడిపై వచ్చే పన్ను భారం తదితర అంశాలను తప్పనిసరిగా గమనించాలి. ఉదాహరణకు మీకు రూ.5లక్షలు వచ్చాయనుకుందాం. మీ రుణంపై వార్షిక వడ్డీ 6.5శాతం. అదే సమయంలో బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై 7 శాతం ఉందనుకుందాం. మీరు 20 శాతం పన్ను పరిధిలోకి వస్తారని భావిస్తే.. పెట్టుబడిపై నికర వార్షిక రాబడి 5.6%. ఇలాంటి సందర్భాల్లో గృహరుణాన్ని చెల్లించడమే లాభం అన్నమాట.

పొదుపు పెరిగితే..

వ్యవధిలోపు గృహరుణాన్ని తీర్చేయాలంటే.. మీ ఖర్చుల అలవాట్లూ మార్చుకోవాలి. అనవసరమైన వ్యయాలను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. మీరు సాధారణంగా చేసే పొదుపును కాస్త అధికం చేయాలి. మీ ఆదాయంలో పెరుగుదల ఉన్నప్పుడు.. మీ పొదుపు లక్ష్యమూ పెరగాలి. ఇలా డబ్బును ఒకచోటకు చేర్చి, ఈ నిధితో గృహరుణాన్ని తీర్చేందుకు ప్రయత్నించాలి.

వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడే..

వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు గృహరుణానికి అధికంగా చెల్లించడం మంచిది. దీనివల్ల వడ్డీ భాగానికి తక్కువగా.. రుణం అసలుకు అధికంగా వెళ్తుంది. ఫలితంగా రుణం తొందరగా తీరుతుంది. ఈఎంఐ మారకుండా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గితే, వ్యవధీ తగ్గిపోతుంది. రుణం ప్రారంభంలో, వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు అధిక ఈఎంఐ చెల్లించడం ద్వారా రుణ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈఎంఐని పెంచుకోవడం, పెట్టుబడి పెట్టడం ద్వారా పాక్షికంగా రుణం తీర్చడంలాంటివి చేస్తున్నప్పుడు.. మీ ఇతర ఆర్థిక లక్ష్యాలకు ఇబ్బంది లేకుండా చూసుకోండి. అత్యవసర నిధి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని